సీతానగరం, బొబ్బిలి: తోటపల్లి ప్రాజెక్టు కుడి కాలువకు మళ్లీ గండి పడింది. అధికార పార్టీ నాయకుల ప్రచార తాపత్రయమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఆయకట్టు రైతులకు ఎలాగైనా సాగునీరు సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పనుల్లో నాణ్యత లోపించటంతో శనివారం మరోసారి గండి పడింది. దీంతో ఇటు అధికార పార్టీ ప్రతినిధులు, అటు ఇంజినీరింగ్ అధికారులు ఏం చేయాలో తెలియ తలలు పట్టు కున్నారు. ఆదరాబాదరాబా పనులు నిర్వ హించడం, నాణ్యతా ప్రమాణాలు పాటించ కోవడం, ఎలాగైనా ఈ నేలాఖరులోగా పనులు పూర్తి చేయాలన్న తొందరే దీనికి కారణం. వివరాల్లోకి వెళితే. జిల్లాలో సువర్ణముఖి నది మీద లక్ష్మీపురం, వేగావతి నదిపై బాడంగి మండలం అల్లుపాల్తేరు గ్రామం వద్ద రెండు అక్విడెక్టులు నిర్మించారు. అలాగే కాలువ మొత్తం 78 వరకూ మదుములను స్ట్రక్చర్లను నిర్మాణం చేశారు. 48 వ కిలోమీటరు వరకు సీతానగరం మండలంలోని నిడగల్లు పంచాయతీ పరిధిలో ఉన్న ముత్యాలదొరవలస నుంచి గాదెలవలస వరకు కుడికాలువ నిర్మించారు.
ఈ కాలువకు మధ్యలో 17.7 కిలోమీటరు వద్ద సువర్ణముఖి నది ఉంది. కాలువ నిర్మాణ పనులను 2012-13 వరకూ ఐటీడీ పనులు చేపట్టింది. తర్వాత ప్రభుత్వానికి, ఐటీడీ కంపెనీకి మధ్య వివాదం తలెత్తడంతో పనులు నిలిచి పోయాయి. 2013లో యుఏఎన్ మ్యాక్స్ కంపెనీకి పనులు ఈపీసీ విధానంలో దక్కాయి. అప్పటినుంచి పనులు జరుగుతున్నాయి. 2014 అక్టోబర్‌లో వచ్చిన హుద్‌హుద్ తుపానుకు సువర్ణముఖి నదిపై నిర్మించిన అక్విడెక్ట్‌ను ఆనుకుని 17.7 కిలోమీటరు వద్ద కాలువకు గండి పడింది. గండిపూడ్చివేత పనులు నిర్వహిస్తుండగానే ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో పర్యటించి, తోటపల్లి నుంచి ఖరీఫ్‌కు నీరిస్తామని ప్రకటించేశారు. దీంతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడిని మరింత పెంచారు. అక్విడెక్టు వద్ద ఉన్న శ్లాబ్‌కల్వర్టుకు పెద్ద రంధ్రం చేసి దానిలోపలకు మనుషులు వెళ్లి మరమ్మతు చేయవలసి వచ్చింది. నది ఒడ్డున ఊపిరి ఆడని ప్రదేశాల్లో పనులు చేయించడంతో పాటు నాణ్యతను పూర్తిగా విస్మరించారు.
దీంతో భవిష్యత్‌లో గండిపడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళన నేడు నిజమైంది. గరుగుబిల్లి వద్ద ఆ శాఖ అధికారులు శుక్రవారం నిర్వహించిన ట్రయిల్ రన్‌కు కాలువ ద్వారా వచ్చిన నీటి ప్రవాహం వల్ల కాలువ నిండి నీరు ఉంది. నీటి ప్రవాహ ఉద్ధృతికి శనివారం ఉదయం 11 గంటల సమయంలో 17.7 కిలోమీటరు వద్ద మళ్లీ గండి పడింది. దీంతో అక్విడెక్ట్ చూట్టూ వేసిన రాతి కట్టడాలతోపాటు మట్టి కొట్టుకుపోయింది. దానిని నిలుపుదల చేయడానికి అధికారులు అష్టకష్టాలు పడుతున్నా ఫలితం లేకపోయింది. ఈ నెలాఖురన ముఖ్యమంత్రితో జలాలు విడుదల చేయించాలని ట్రయిల్ రన్ వేస్తే ఇప్పుడు ఇలా జరగడంతో ఇటు అధికార పార్టీ నాయకులు, అటు నీటిపారుదలశాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కాలువ ద్వారా సీతానగరం, బొబ్బిలి, తెర్లాం. బాడంగి మండలాల్లో దాదాపు 9,300 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు అంతగా పడకపోవడం వల్ల ఈ అక్విడెక్టు వద్ద నిర్మాణంలో డొల్లతనం ఆలస్యంగా తెలిసింది.
అధికారుల నిర్లక్ష్యమే కారణం: ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి
తోటపల్లి కాలువకు శనివారం పడిన గండిని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నియోజక వర్గాల రైతులకు సాగు నీరందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో ఉన్నారన్నారు. ఈ మేరకు పనులు వేగవంతం చెయ్యాలని మార్గదర్శకాలు విడుదల చేశారన్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గండి పడిందని అన్నారు. దీనికి బాధ్యులైనవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరతామన్నారు. ఆయన వెంట పాజెక్ట్ డీఈ రమణమూర్తి, పార్వతీపురం ఏఎంసీ చెర్మైన్ రెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జి.వెంకటనాయుడు, కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. కాగా ఏగోటివలస గ్రామాన్ని ఆనుకుని ఉన్న తోటపల్లి కాలువ వల్ల ఇబ్బందులు రాకుండా రక్షణ గోడ నిర్మించాలని ఎంపీటీసీ సభ్యులు డి.నాగరత్నం నేతృత్వంలో రైతులు ఎమ్మెల్సీని, అధికారులను కోరారు.
మంత్రి మృణాళిని పరిశీలన
సీతానగరం: తోటపల్లి కాలువకు పడిన గండిని రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని శనివారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గండి పూడ్చివేత పనులను వేగవంతం చెయ్యాలని అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించామన్నారు. ఆమె వెంట ఎమ్మెల్సీ డి.జగదీష్, ఎమ్మెల్యే బి.చిరంజీవులు, పార్వతీపురం ఆర్డీవో రోణంకి గోవిందరాజు, ఎస్‌ఈ తిరుమలరావు, ప్రాజెక్ట్ సలహాదారు ఆర్.సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కె.గణపతిరావు, రెవెన్యూ సీనియర్ సహాయకులు శివయ్య ఉన్నారు.
కాన్వాయ్ వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు
గండి పరిశీలించాక మంత్రి మృణాళిని బొబ్బిలి వైపు తిరిగి వెళుతుండగా కాన్వాయ్‌లోని వాహనం ఆటోను తప్పించబోయి బైక్‌ను ఢీకొనడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. చినబోగిలి సమీపంలో జరిగిన ఈ ఘటనలో సీతానగరం గ్రామానికి చెందిన బి.వెంకటేష్, బి.రాంబాబు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి స్పందించి గాయపడినవారితో మాట్లాడారు. వారి పరిస్థితి గురించి తెలుసుకున్నాక పయనమయ్యారు.
తోటపల్లి కాలువకు మళ్లీ గండి
Published Sun, Jul 19 2015 12:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement