కరాటే పోటీల ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, వాసిరెడ్డి పద్మ, సినీ నటుడు సుమన్
సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్: గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారి సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గిరిజన శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గిరిజన రోగులను డోలీలలో తీసుకెళ్లాల్సి వస్తున్న పరిస్థితిని మార్చాలన్నారు. అన్ని గిరిజన ప్రాంతాల్లో నియోజకవర్గానికి 100 పడకలతో గర్భిణులకు హాస్టళ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. సచివాలయంలో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులతో శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. గిరిజన శాఖలో మంజూరు చేసిన పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయనపుడు వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి
మహిళల రక్షణకు అవసరమైన చర్యలను సీఎం వైఎస్ జగన్ చేపట్టారని, ప్రతీ గ్రామంలో ఒక మహిళా పోలీసును నియమించడం, మద్యాన్ని పూర్తిగా నిషేధించే దిశగా అడుగులు వేయడం వీటిలో భాగమేనని పుష్ప శ్రీవాణి చెప్పారు. సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా, ఏపీ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో డాక్టర్ వైఎస్సార్ స్మారక 10వ జాతీయ కరాటే చాంపియన్‌షిప్ పోటీలను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. 6వ తరగతి నుంచి బాలికలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికి ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రముఖ సినీ నటుడు సుమన్, క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment