
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా, ప్రతి పైసా గిరిజనులకే చేరేలా చూడాలని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీ ఆమోదం పొందకుండా నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేయడాన్ని నియంత్రించాలని కోరారు.
తాత్కాలిక సచివాలయంలో బుధవారం ఆమె గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో గిరిజన గురుకుల విద్యా సంస్థలలో ఏర్పాటు చేసిన డిజిటల్, వర్చువల్ క్లాసు రూములపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. హాస్టళ్ల నుంచి స్కూళ్లుగా స్థాయి పెంచిన అన్ని పాఠశాలల భవనాల నిర్మాణానికి కావాల్సిన స్థలాలను గుర్తించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన గురుకుల విద్యాలయాలపై ఆమె సమీక్షించారు.