తోటపల్లి ప్రాజెక్టులో మరో 15 పనులు పెండింగ్
రూ.6 కోట్లతో డిజైనింగ్‌కు ప్రతిపాదన
ఈ ఏడాదీ పూర్తి స్థాయి సాగునీరు లేనట్టే...
విజయనగరం కంటోన్మెంట్: తాంబూలాలిచ్చేశాం... తన్నుకు చావండి... అన్నట్టు ఏదో ప్రారంభించేశాం అని చెప్పుకోవడానికి తప్ప పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు పాలకుల్లో చిత్తశుద్ధి కనిపించడంలేదు. జిల్లాలోని ఏకైక భారీ తరహా సాగునీటి ప్రాజెక్టు నుంచి పూర్తి స్థాయి సాగునీరు అందించేందుకు అడుగడుగునా ఆటంకాలేర్పడుతున్నాయి. ఇప్పుడీ పథకానికి సంబంధించి మరి కొన్ని పనులు పెండింగ్‌లో పడ్డాయి. తోటపల్లి కాలువ ఆసాంతం సుమారు 15 పనులు చేపట్టాల్సి ఉన్నట్టు అధికారులు ఇటీవలే గుర్తించారు. సుమారు రూ. 6 కోట్ల విలువయిన ఈ పనులను ఇప్పటి కాంట్రాక్టర్లు తాము చేయలేమని చేతులెత్తేయడంతో ఇప్పుడు వాటికి టెండర్లు పిలిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
పెండింగ్ పనులకు సంబంధించి ఇంకా డిజైన్ కూడా కాలేదు. వాటి అనుమతికోసం విశాఖలోని సీఈకి ఇప్పుడు ప్రతిపాదనలు పంపించారు. ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంటే... పనులెప్పుడు ప్రారంభమవుతాయన్నది రైతుల సందేహం. అసలే వర్షాకాలం... ఈ తరుణంలో ఎప్పుడు డిజైన్ చేస్తారు? మంజూరు చేసేదెప్పుడు? సాగునీరు అందించేదెప్పుడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ప్రాజెక్టు డిజైన్ చేసి, కాంట్రాక్టర్లకు అప్పగించినప్పుడే కొన్ని పనులు మరచిపోయారు. అండర్ టన్నెల్స్, చెరువుల పక్కనుంచి నీటిని మళ్లించడం, చెరువుల నీటికి అడ్డంగా ఉన్న కాలువ నిర్మాణాన్ని మార్చడం వంటివి పొందుపరచలేదు. తోటపల్లి కాలువ పనులు పూర్తవుతున్న కొద్దీ ఆ లోపాలు బయటపడుతున్నాయి.
నీరు నిలువ ఉండిపోవడం, వివిధ చెరువుల వద్ద నీరు పెండింగ్ ఉండిపోవడం వంటివి చూశాక ఈ పనులు తప్పనిసరిగా చేయాల్సిందేనని గుర్తించారు. తోటపల్లి కాలువ పొడవునా బ్రిడ్జిలు, యూటీలను నిర్మించాల్సి ఉన్నందున ఓ పక్క మిగిలి ఉన్న ఉప కాలువల పనులు, లైనింగ్ వంటివాటితో ఇప్పటికే అధికారులకు తీరిక లేకుండా నడుస్తోంది. ఇప్పుడీ అదనపు పనులు కూడా జత కలవడంతో ఏ పనులు ఎప్పుడు చేస్తారోనన్న అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు.
పనుల్లో జాగు...ప్రశ్నార్థకంగా సాగు
Published Tue, Jun 21 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement
Advertisement