నీటి మూటలు! | Water bales! | Sakshi
Sakshi News home page

నీటి మూటలు!

Published Mon, Jul 3 2017 11:38 PM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

నీటి మూటలు!

నీటి మూటలు!

  • హంద్రీనీవా.. ఉనికిపాటు
  • నీటి విషయంలో మాట నిలుపుకోని టీడీపీ
  • డిస్ట్రిబ్యూటరీలను అటకెక్కించిన ప్రభుత్వం
  • నెల రోజులుగా పనులు నిలిపేసిన ఏజెన్సీలు
  • 33, 34 ప్యాకేజీలతో గత ఏడాది ఖరీఫ్‌కే నీళ్లిస్తామని ప్రకటన
  • ఈ ఏడాదీ ఫలించని రైతుల ఆశలు
  •  

    2014 ఖరీఫ్‌కు నీరిస్తాం. ఆ తర్వాత 2015.. 2016.. ఇలా గడువు మారుతుందే తప్పిస్తే టీడీపీ ప్రభుత్వం హంద్రీనీవా జలాలతో అనంత పొలాలను తడపలేకపోతోంది. జిల్లా ఎమ్మెల్యేలు.. మంత్రులు మొదలు.. నీటి పారుదల శాఖ మంత్రి కూడా ఈ విషయంలో ఇక్కడి ప్రజలను మోసగించారు. ఇక మీదట నమ్మించలేమని తెలుసుకున్న నేతలు మౌనమే మేలనే నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉద్యమానికి తెర తీయగా.. ఉలిక్కిపడిన ఎమ్మెల్సీ పయ్యావుల పోటీ పర్యటనకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశంగా మారింది.

     

    సాక్షి ప్రతినిధి, అనంతపురం:

    హంద్రీనీవా ఫేజ్‌–1 పనులు 2012లోనే పూర్తయి జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణాజలాలు చేరుకున్నాయి. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి 1.18లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వడమే తరువాయి. ఈ క్రమంలో 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీల పనులు చేయొద్దంటూ 2015 ఫిబ్రవరిలో జీఓ జారీ చేసింది. దీనిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఉద్యమించాయి. హంద్రీనీవా పనుల పురోగతిపై జీడిపల్లి రిజర్వాయర్‌లో 2015లో జరిగిన సమీక్షలో ఆయకట్టుకు నీళ్లు ఎప్పుడిస్తారో చెప్పాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ముఖ్యమంత్రిని నిలదీశారు. ‘మీ ప్రాధాన్యతలు మీకుంటాయి. మా ప్రాధాన్యతలు మాకుంటాయి’ అని సీఎం మాట దాట వేశారు. దీనిపై విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండలో దీక్ష చేపట్టారు. ఆపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధర్నా నిర్వహించారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. కనీసం 33, 34 ప్యాకేజీలు పూర్తి చేద్దామనే నిర్ణయానికి వచ్చింది.

     

    ఈ పనులకూ బ్రేక్‌

    33, 34 ప్యాకేజీ డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 28వేల ఎకరాలకు నీరందుతుంది. 33వ ప్యాకేజీని ఈపీఐఎల్‌(ఇంజనీరింగ్‌ ప్రాజñక్టు ఇండియా లిమిటెడ్‌) చేస్తోంది. రాగులపాడు లిఫ్ట్‌ నుంచి 8.9 కిలోమీటర్లు ప్రధాన కాలువ తవ్వాలి. ఆ తర్వాత మైనర్, సబ్‌ మైనర్‌( ఉప, పిల్లకాలువలు) తవ్వాలి. ఈ పనులు పూర్తయితే 10,500 ఎకరాలకు నీరందుతుంది. కొంతమేర కాలువను తవ్వారు. నెల రోజులుగా పనులు నిలిచిపోయాయి. ఇదేంటని ఆరా తీస్తే రెండు అంశాలు తెరపైకి వచ్చాయి. 5–6 కిలోమీటరు మధ్య కిలోమీటరు మేర రాయి పడింది. దీన్ని బ్లాస్టింగ్‌ చేయాలి. దీనికి ప్రభుత్వ అనుమతి కావాలి. ఇది ఆలస్యం కావడంతోనే పనులు ఆపేశారని తెలుస్తోంది. ఇదే నిజమైతే మైనర్, సబ్‌ మైనర్‌తో పాటు మేజర్‌ కెనాల్‌లోని కల్వర్టులను పూర్తి చేయాలి. ఇవి కూడా చేయడం లేదు. దీంతో పాటు ఈ పనులకు రూ.12కోట్లు ఇచ్చారని, 2004–05 రేట్ల ప్రకారం ఉండటంతో ఏజెన్సీ పనులు చేయకుండా వెనుదిరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇదే నిజమైతే గతేడాది పనులు చేసేందుకు ఉపక్రమించిన ఏజెన్సీకి అప్పుడు రేట్ల వ్యత్యాసం ఎందుకు గుర్తుకు రాలేదనేది తేలాల్సి ఉంది. దీంతోపాటు 33 పక్కనే 34 ప్యాకేజీ పనులు జరుగుతున్నాయి. ఇందులో డీ–1, డీ–2 అని రెండు ప్రధాన కాలువలు, వాటి కింద మైనర్, సబ్‌ మైనర్‌ కాలువలు తవ్వాల్సి ఉంది. ఈ పనులను ఆర్‌వీసీపీఎల్‌(రెడ్డి వీరన్న కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) పనులు చేస్తోంది. పనుల్లో డీ–1, 8.25, డీ–2 22 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ తవ్వాలి. డీ–1 కింద 5వేలు, డీ–2 కింద 12, 500 ఎకరాలకు ఆయకట్టుకు నీరందుతుంది. ఈ పనులకూ బ్రేక్‌ పడింది. ఇందులోనూ కొంత మేర డిస్ట్రిబ్యూటరీ ప్రధాన కాలువను తవ్వి నిలిపేశారు. ఇదేమంటే 33 ప్యాకేజీలాగే పాతరేట్లు అని కొర్రీ పెడుతున్నారు. ఈ రెండు ఏజెన్సీలు టెండరు చేసుకునే ముందు ధరల్లో వ్యత్యాసం, గిట్టుబాటు అవుతుందా? లేదా? అనేది తేలీదా అనే విషయం తేలాల్సిన అంశం. లేదంటే ఈ ముసుగులో మరింత దండుకునే వ్యూహం పన్నుతున్నారా? అనే సందేహం వ్యక్తమవుతోంది. కనీసం ఈ రెండు డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే ఫేజ్‌–1లోని 1.18లక్షల ఎకరాల ఆయకట్టులో కనీసం 28వేల ఎకరాలకైనా నీరందుతుంది. కానీ దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించని పరిస్థితి. దీంతో ఈ నెల 2న పనుల పరిశీలనకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వెళ్లారు. ప్రభుత్వానికి ఆయకట్టుకు నీరిచ్చే ఉద్దేశం లేదని, అందుకే ఇలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్సీ కేశవ్‌ 3న అదే ప్రాంతంలోని పనులను పర్యవేక్షించారు. ఈ పోటాపోటీ పర్యటనలతో ఆయకట్టుకు నీరిచ్చే అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతేడాది జిల్లాకు 28 టీఎంసీలు వస్తే ఒక్క ఎకరాకు కూడా ప్రభుత్వం అందించలేకపోయింది. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ నీరొచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుంది.

     

    ఈ ఖరీఫ్‌కు నీరిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు

    ఆయకట్టుకు నీళ్లివ్వాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. 33, 34 ప్యాకేజీలను చూస్తే ఈ ఖరీఫ్‌కు నీళ్లొచ్చే పరిస్థితి కన్పించడం లేదు. ప్రధాన కాలువ పూర్తి కాలేదు. కల్వర్టలు నిర్మించాల్సి ఉంది. ఉప, పిల్ల కాలువలు తవ్వాలి. ఇవేవీ చేయలేదు.. పైగా ఏజెన్సీ పనులు చేయకుండా వెళ్లిపోయింది. గత ఖరీఫ్‌కు నీరిస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసింది. అదీ నిలుపుకోలేకపోయింది.

    - విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement