సాగరమే దిక్కు | problems of water Nagarjuna Sagar only possibles | Sakshi
Sakshi News home page

సాగరమే దిక్కు

Published Thu, Aug 20 2015 2:49 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

సాగరమే దిక్కు - Sakshi

సాగరమే దిక్కు

ఒకవైపు కమ్ముకొస్తున్న కరువు...మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం... వెరసి జిల్లా ప్రజలకు శాపంగా మారుతోంది. ఒక్క వారం రోజుల్లో నాగార్జున సాగర్ నుంచి 1.5 టీఎంసీల తాగునీరు రాకపోతే గుక్కెడు మంచినీళ్ల కోసం ప్రజలు అల్లాడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని ప్రాజెక్టులు, తాగునీటి చెరువుల్లో ఉన్న నీరు మరో వారం రోజులు మాత్రమే సరిపోతాయని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు.
- అడుగంటుతున్న చెరువులు
- సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో అరకొర నీరే
- ఒంగోలు నగరంతోపాటు ప్రధాన పట్టణాల్లో దాహం కేకలు
- వారం రోజుల్లో సాగర్ నీరు రాకుంటే కష్టమే...
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జిల్లాలో ఇప్పటికే ఒక పక్క వర్షాభావ పరిస్థితులు, మరోపక్క సాగర్ నుంచి నీరు రాకపోవడంతో ఖరీఫ్‌లో పంటలు సాగు చేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగర్ నుంచి తాగునీటిని విడుదల చేయకపోతే గుక్కెడు మంచినీళ్ల కోసం వలసలు పోవాల్సిన దుస్థితి రానుంది.  తాగునీటి అవసరాల కోసం 1.5 టీఎంసీల నీరు కావాలని  కలెక్టర్ సుజాతా శర్మ ప్రభుత్వాన్ని కోరి 15 రోజులు దాటినా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. తాజాగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తాగునీరు విడుదల చేయడం సాధ్యం కాదు.
 
కార్పొరేషన్లో నాలురోజులకోసారి...
ఒంగోలు కార్పొరేషన్‌లో ఇప్పుడు నాలుగు రోజులకోసారి తాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే స్థితి కొనసాగితే వారానికి ఒక రోజు కూడా నీరు అందించాల్సి రావచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 5800 మిలియన్ లీటర్ల సామర్ధ్యం గల రెండు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఒంగోలుకు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం రెండువేల మిలియన్ లీటర్ల నీరు మాత్రమే ఉంది. రోజుకు ఒంగోలుకు 40 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుంది. దీంతో ప్రస్తుతం ఉన్న నిల్వలు నెల రోజులకు కూడా సరిపోవు.

గతంలో గుండ్లకమ్మ నుంచి నీటిని ఒంగోలుకు పైపుల ద్వారా తెచ్చే అవకాశం ఉండేది.  జాతీయ రహదారి విస్తరణ సమయంలో కార్పొరేషన్ అధికారులు స్పందించకపోవడంతో రోడ్డు కాంట్రాక్టర్లు ఆ పైపులను తీసి రోడ్డు వేశారు. దీంతో అక్కడి నుంచి నీరు మళ్లించే మార్గం లేకుండాపోయింది. రామతీర్థం జలాశయం  వారం రోజుల కన్నా ఎక్కువ రాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.  తెలంగాణాకు కూడా నీరు విడుదల చేయాల్సి ఉన్నందున రెండు రాష్ట్రాలు చొరవ తీసుకుని ఒక నిర్ణయానికి వస్తేగానీ తాగునీరు జిల్లాకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు.
 
మార్కాపురం సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులో కొద్దిమేరకు నీరు నిలువ ఉంది. ఈ నీరు కూడా గట్టిగా పది రోజుల వరకు మాత్రమేసరిపోతాయని అధికారులు భావిస్తున్నారు.  మార్కాపురం పట్టణానికి దూపాడు నుంచి సాగర్ మంచినీటి సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం దూపాడు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌లో 400 మిలియన్ లీటర్ల నీరుంది. ప్రస్తుతం పట్టణంలో రోజు మార్చి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం కనిగిరి నియోజకవర్గానికి రామతీర్థం జలాశయం నుంచి నీటిని ఇస్తున్నారు.

కనిగిరి మున్సిపాలిటీకి దర్శిలో కనిగిరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను నుంచి నీటిని అందిస్తున్నారు.  ప్రస్తుతం రామతీర్థం జలాయంలో నీటి శాతం డెడ్ స్టోరేజ్‌కు చేరింది.
 
దర్శిలో ఉన్న కనిగిరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో నీటిశాతం 40 శాతానికి చేరింది. వీటి సామర్థ్యాన్ని చూస్తే నెలాఖరు వరకు నీళ్లు వస్తాయని సమాచారం. గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో 96 తాగునీటి మోటార్లుండగా ఇందులో కేవలం 25 మోటార్లలో మాత్రమే అంతంత మాత్రంగా నీరు వస్తోంది. దీంతో పట్టణంలోని ప్రజలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. పట్టణానికి తాగునీటి వసతి కల్పించేందుకు మండలంలోని దిగువమెట్ట సమీపంలో గల అడవుల్లో ఉన్న భైరేని గుండాల నుంచి సరఫరాచేసేందుకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మించారు. అటవీ అనుమతులు లేకపోవడంతో నిర్మాణం పూర్తయినా నీరు సరఫరా చేయడం లేదు. దీంతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిరుపయోగంగా మారింది. పట్టణానికి తాగునీటిని సరఫరా చేసేందుకు ట్యాంకర్లే దిక్కుగా ఉన్నాయి. పది రోజుల్లో ఎన్‌ఎస్‌పీ నుంచి నీరు రాకపోతే దర్శి నియోజకవర్గంలోని 158 గ్రామాలు , జిల్లాలో దాదాపు 400 గ్రామాల ప్రజలు  తాగు నీటికి ఇబ్బందుల పడే అవకాశం ఉంది.

ఒంగోలు
కార్పొరేషన్‌లో ఇప్పుడు నాలుగు రోజులకోసారి తాగునీరొస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వారానికోసారి తాగునీరు పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడనుంది.
 
మార్కాపురం, కనిగిరి, దర్శి సమ్మర్‌స్టోరేజీ ట్యాంకుల్లో నీళ్లు అడుగంటాయి. ఇంకా పట్టుమని పదిరోజులు కూడా ఈ నీళ్లు సరిపోయేట్టు లేవు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement