ముందుంది ముప్పు!
ముందుంది ముప్పు!
Published Thu, Nov 3 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
– సుంకేసులలో పడిపోయిన నీటి నిల్వలు
– నగర వాసులకు 45 రోజులు మాత్రమే సరిపడా నీరు
– తుంగభద్ర జలాలపైనే ఆశలు
– ప్రత్యామ్నాలకు అనుమతులు ఇవ్వని ప్రభుత్వం
– సీఎం దృష్టికి తీసుకపోయినా స్పందన కరువు
కర్నూలు సిటీ: వేసవికి ముందే కర్నూలు నగర వాసులకు తాగు నీటి ఇబ్బందులు రానున్నాయా? ప్రస్తుతం సుంకేసుల బ్యారేజీ, ఎస్‌ఎస్ ట్యాంకుల్లో నిల్వ ఉన్న నీరు 45 రోజులకు మాత్రమే సరిపోనున్నాయా? టీబీ డ్యాం నుంచి రావాల్సిన వాటా నీరు ఇక వచ్చే అవకాశమే లేదా అంటే అధికార వర్గాలు అవుననే అంటున్నాయి.
తుంగభద్ర నదిలో ఈ ఏడాది నీటి లభ్యత తక్కువగా ఉండడంతో వేసవికి మూడు నెలల ముందే కర్నూలు నగర ప్రజలకు తాగు నీటి ముప్పు పొంచివుంది. అయినా నగర పాలక సంస్థ అధికారులు ప్రత్యామ్నాయాలు చూడటం లేదు. కేసీ ఆయకట్టుకు అందాల్సిన నీటిని తాగు నీటికి ఇస్తున్నారు. అయితే శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో నేటికీ కేసీ వాటా నీటిపైనే నగర వాసుల దాహార్తి ఆధారపడి ఉంది. ఈ ఏడాది తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న నీటి కొరత వల్ల సుంకేసుల బ్యారేజీలో నీరు కేసీ ఆయకట్టుకు ఇవ్వడంతో పూర్తి స్థాయిలో పడిపోయాయి. ప్రస్తుతం 06 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. బ్యారేజీ నుంచి రోజు 200క్యూసెక్కుల నీరు వదిలితే 21 కి.మీ వరకు వచ్చేది కేవలం 60 క్యూసెక్కుల నీరు కూడా రావడం లేదు. నగరపాలక సంస్థ అధికారుల అంచనాల ప్రకారం రోజుకు 77 మిలియన్ లీటర్లు సరఫరా చేయాలి. ప్రస్తుతం బ్యారేజీ, ఎస్‌ఎస్ ట్యాంకుల్లో ఉన్న నీరు కేవలం 45 రోజులకు మాత్రమే సరిపోతుందని జల వనరుల శాఖ ఇంజినీర్లు చెబుతున్నారు.
తుంగభద్ర జలాలు వచ్చేనా?
తుంగభద్ర జలాలు జిల్లాతో పాటు, కడప జిల్లాలో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్‌లో ఆయకట్టుకు ఈ జలాలు తక్కువగానే అందాయి. శ్రీశైలం ప్రాజెక్టు నీరు ఏస్కేప్ ఛానల్, హంద్రీనీవా నుంచి రెండు పంపులు మళ్లించడంతో 63 కి.మీ మినహా మిగతా ఆయకట్టుకు సాగు నీరు ఇబ్బందులు తగ్గాయి. అయితే సుంకేసుల బ్యారేజీ నుంచి 63 కి.మీ వరకు 10 వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. హంద్రీనీవా నీటిని మళ్లించడం వల్ల 63 కి.మీ నుంచి వెనకకు 20 కి.మీ నీరు వస్తుంది. మిగిలిన 43 కి.మీ మేర ఉన్న 8 వేల ఎకరాలకు ప్రస్తుతం 10 రోజులుగా సాగు నీరు అందడం లేదు. సుంకేసుల బ్యారేజీలో నీటి నిల్వలు తగ్గడం, టీబీ డ్యాం నుంచి కేసీ వాటాగా రావాల్సిన 1.4 టీఎంసీల నీరు ఇవ్వాలని 20 రోజుల క్రితం నుంచి అధికారులు ప్రభుత్వం వెంట పడుతున్నా ఏ ఒక్కరూ స్పందించడం లేదు. పైగా ఆ వాటాలో నుంచి టీఎంసీ నీటిని అనంతపురం జిల్లాకు మళ్లించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో బ్యారేజీలో ఉన్న నీరు కేసీ ఆయకట్టుకు ఇవ్వకుంటేనే నగర వాసులకు నెల రోజులు దాహం తీరుతుంది. లేకపోతే కష్షమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికి తోడు కేసీ అధికారులు 43 కి.మీ వరకు ఉన్న ఆయకట్టుకు నీరు ఇవ్వాలని రైతుల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో కలెక్టర్ అనుమతి తీసుకొని నీరు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ప్రతిపాదనలపై స్పందన కరువు
కర్నూలు నగరవాసుల దాహార్తి తీర్చేందుకు ఎస్‌ఎస్ ట్యాంకు నీరు ఏ మాత్రం సరిపోకపోవడంతో కల్లూరు ప్రాంతానికి తడకనపల్లె చెరువు, నంద్యాల చెక్ పోస్టు ప్రాంతాలకు గార్గేయపురం చెరువు నుంచి నీరు సరఫరా చేసేందుకు నగర పాలక సంస్థ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇంత వరకు ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అనుమతులు ఇచ్చింటే కొంత మేరకైనా నీటి సమస్య తీరేది. ఈ చెరువులకు హంద్రీనీవా నుంచి నీరు సరఫరా అవుతుంది. నగర వాసులకు తాగు నీరు ఇబ్బందులు ఉన్నాయని, ఎలాగైనా టీబీ డ్యాం నుంచి కేసీ వాటాగా ఉన్న 1.4 టీఎంసీ నీరు విడుదల చేయించాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి బుధవారం సీఎంను కోరగా చూద్దాంలే అనే సమాధానం వచ్చినట్లు తెలిసింది.
Advertisement
Advertisement