సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ నాటికి పెన్‌గంగ నీళ్లు ఆదిలాబాద్ జిల్లా బీడు భూములను తడుపుతాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. చనాక–కోరటా బ్యారేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ ప్రాజెక్టుపై సభ్యుడు రాథోడ్ బాపూరావు అడిగిన ప్రశ్నలకు హరీశ్ సమాధానమిచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా బోథ్, జైనూర్ ఆదిలాబాద్ రూరల్ మండలాల్లోని 59 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చాలెంజ్‌గా తీసుకున్నామని, 2018లోపు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టును గత ప్రభుత్వాలు ఓట్ల కోసం వాడుకున్నాయని విమర్శించారు. ‘స్వయంగా నేనే ఏడు సార్లు మహారాష్ట్రకు వెళ్లి.. ప్రాజెక్టు పనులపై చర్చించి అనుమతులు తీసుకున్నా. ఉద్యమ సమయంలో ఈ ప్రాజెక్టు కోసం పాదయాత్ర కూడా చేశా. ఇప్పుడు నా నేతృత్వంలో ప్రాజెక్టు పనులు కొనసాగుతుండటం అదృష్టంగా భావిస్తున్నా’అని పేర్కొన్నారు.
ఎర్ర రొయ్యలు ఎప్పుడొస్తయి..
ఈ ఏడాది రొయ్య పిల్లల పెంపకాన్ని చేపట్టామని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాగార్జున సాగర్, సింగూరు, పాలేరు, కోయిల్ సాగర్, అలీ సాగర్, ఘనపురం, ఎల్లంపల్లి, సింగభూలపాల చెరువుల్లో రొయ్య పిల్లలను పెంచుతున్నామని చెప్పారు. ఎర్ర రొయ్యలు ఎప్పుడు వస్తాయని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అడిగిన ప్రశ్నలకు తలసాని పై విధంగా స్పందించారు.
మత్స్య కళాశాలల ఏర్పాటు, ప్రవేశాల ప్రక్రియ, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై సభ్యులు జీవన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, చిన్నారెడ్డి, రసమయి బాలకిషన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో, కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాం వద్ద మత్స్య పరిశ్రమ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పెబ్బేరు కళాశాలలో ఎంసెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కుంటలు, చెరువులతోపాటు అన్ని రిజర్వాయర్లలో 45 కోట్ల చేప పిల్లలను వదిలామని చెప్పారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
గిరిజన దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం
గిరిజన దేవాలయాలకు కూడా ధూపదీప నైవేద్య పథకం వర్తింపజేస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. సభ్యులు ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, కిషన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం 3 వేల దేవాలయాలు ఈ పథకం పరిధిలోకి వస్తున్నాయని అన్నారు. ధూపదీప నైవేద్య పథకం కింద రూ.2,000 పూజ సామాగ్రి కోసం, రూ.4,000 అర్చకుని వేతనంగా ఇస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment