ఖరీఫ్‌లో 8 లక్షల ఎకరాలకు నీరు
► పాలమూరు ప్రాజెక్టుల సమీక్షలో మంత్రి హరీశ్‌రావు
► పనులు త్వరగా పూర్తి చేయాలని సూచన
సాక్షి, హైదరాబాద్: పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ ఖరీఫ్‌లోనే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులను ఆదేశించారు. జూలై చివరికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించకపోతే ఏజె న్సీలతో పాటు సంబంధిత ఇంజనీర్లపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు.
గురువారం ఆయన జలసౌధలో మంత్రి లక్ష్మారెడ్డితో కలసి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతిని సమీ క్షించారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ సాగునీటి పథకాలపై సమీక్షిం చారు. కల్వకుర్తి నుంచి 3లక్షలు, బీమా నుంచి 2 లక్షలు, నెట్టెంపాడు నుంచి 1.5 లక్షలు, కోయిల్‌సాగర్ నుంచి 50వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో సాగునీరు అందించాల్సిందేనన్నారు. జూరాల ప్రాజెక్టు కింద మొత్తం 8 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలన్నారు.
చెరువులు నింపాలి...
ఆయా ప్రాజెక్టుల కింద చెరువులను నింపేం దుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హరీశ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రాజెక్టుల నిర్వహణ విషయాలను తక్షణం సమీక్షించాలని ఇంజనీ రింగ్ అధికారులను కోరారు. పంప్ హౌస్‌లలో ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్లను వెంటనే నియమించాలని అడ్మినిస్ట్రేషన్ ఈఎన్‌సీ విజయప్రకాశ్‌కు సూచించారు. సకా లంలో పనులు చేయని ఏజన్సీలపై ‘60 సీ’ నిబంధన కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భూసేకరణపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లా కలెక్టర్లకు సూచించారు. అలాగే ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఫీల్డు చానల్స్‌లను తనిఖీ చేయాలని, ఆయా కాలువల్లో ఉన్న గడ్డి, రాళ్లు తొలగించాలని అధికారులకు సూచించారు. ఈ నెల మూడో వారంలో పాలమూరు ప్రాజెక్టుల పరిధిలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. సమీక్షలో ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్.జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, సీఈ ఖగేందర్‌రావు, ఓఎస్డీ దేశ్‌పాండే, వివిద ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.