– ప్రత్యామ్నాయ పంటల సాగు అంచనా 5.36 లక్షల హెక్టార్లు
- 48,942 క్వింటాళ్ల విత్తనాలు అవసరం
– ప్రధాన పంటలు 2.65 లక్షల హెక్టార్లు
– కమిషనరేట్‌కు ప్రణాళిక పంపిన అధికారులు
అనంతపురం అగ్రికల్చర్: వేరుశనగ లాంటి ప్రధాన పంటల సాగు సమయం ముగిసిపోవడంతో ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. ఈ నెల 1వ తేదీన బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఆరు జిల్లాల అధికారులు, శాస్త్రవేత్తలు సమావేశమై ప్రత్యామ్నాయ పంటల సాగు అంశంపై సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే.
వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరిజవహరలాల్, ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్‌వీ నాయుడు, ఎక్స్‌టెన్షన్ డైరెక్టర్ డాక్టర్ కె.రాజారెడ్డి సమక్షంలో ఖరీఫ్ పంటల సాధారణ సాగు, సాగైన విస్తీర్ణం, ఇంకా సాగులోకి రావాల్సిన విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటలు, విత్తనాలపై చర్చించి జిల్లాల వారీగా ప్రణాళిక తయారు చేశారు. అందులో భాగంగా జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మరోసారి సమావేశమై ప్రత్యామ్నాయ పంటలు, వాటికి అవసరమైన విత్తనాలు, ఏ రకం విత్తనాలు అనువైనవనే దానిపై ప్రతిపాదనలతో కూడిన విత్తన ప్రణాళిక గురువారం కమిషనరేట్‌కు పంపినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
ప్రధాన పంటలు 2.65 లక్షల హెక్టార్లు
జూన్, జూలై నెలల్లో కురిసిన అరకొర వర్షాలకు పంటల సాగు పడకేసింది. 8.01 లక్షల హెక్టార్ల సాధారణ సాగుకు గానూ జూలై 31వ తేదీ నాటికి అన్ని పంటలు కలిపి 1.94 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. అందులో 6.04 లక్షల హెక్టార్లలో వేయాల్సిన వేరుశనగ 1.60 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. ఆగస్టు మొదటి వారం వచ్చే నివేదిక ప్రకారం 2.65 లక్షల హెక్టార్లలో ప్రధాన పంటలు సాగులోకి రావచ్చని అంచనా వేశారు. ఇక మిగతా 5.36 లక్షల హెక్టార్లు బీళ్లుగా మిగిలే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు.
48,942 క్వింటాళ్ల విత్తనం అవసరం
5.36 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేశారు. జొన్న, ఉలవ, అలసంద, కొర్ర, సజ్జ, కంది, పొద్దుతిరుగుడు, పెసర, ఆముదం, మినుము పంటలకు సంబం«ధించి 48,942 క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదించారు. అయితే ఈ విత్తనాలు ఎపుడు సరఫరా అవుతాయి..? ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు..? ఉచితంగానా లేదంటే రాయితీతో ఇస్తారా...? అనేది రెండు మూడు రోజుల్లో తెలిసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.
ఖరీఫ్ కకావికలం
Published Thu, Aug 3 2017 9:54 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement