అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : కోటి ఆశలతో ఖరీఫ్‌కు ‘అనంత’ అన్నదాత సిద్ధమయ్యాడు. ప్రతి ఏటా నష్టాలు చవిచూస్తున్నా నమ్ముకున్న నేల ఎప్పటికైనా గట్టెక్కించకపోతుందా అన్న ఆశతో ముంగారు సేద్యానికి సై అన్నాడు. ఖరీఫ్ సీజన్ ఆదివారం నుంచి ప్రారంభమైంది. జూన్- సెప్టెంబర్ వరకు కొనసాగే ఈ సీజన్‌లో ప్రధానమైన వేరుశనగతో పాటు ప్రత్యామ్నాయ పంటలు దాదాపు 9 లక్షల హెక్టార్లకు పైచిలుకు విస్తీర్ణంలో సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు.
ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రకృతి కరుణ ఉంటే తప్ప జిల్లాలో వ్యవసాయం ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలపై ఖరీఫ్ పంటల సాగు ఆధారపడి ఉంది. జిల్లా వార్షిక వర్షపాతం 552.3 మిల్లీమీటర్లు (మి.మీ) కాగా జూన్ నుంచి అక్టోబర్ వరకు అత్యధికంగా 338.4 మి.మీ కురవాల్సి ఉంటుంది. జూన్‌లో 63.9 మి.మీ, జూలైలో 67.4 మి.మీ వర్షపాతం నమోదైతే విత్తు కార్యక్రమం సాఫీగా జరుగుతుంది. పుణ్యకాలం దాటిన తరువాత వర్షాలు కురిసినా ప్రయోజనం ఉండదు.
మరోవైపు ఇంతవరకూ రాయితీ విత్తనం రైతులకు అందలేదు.పెట్టుబడుల కోసం పంట రుణాల పంపిణీ జరగలేదు. చంద్రబాబునాయుడు ప్రకటించిన రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే ఇంకా సేకరణ మొదలుకాకపోవడం, పంపిణీ చేసినా పూర్తి ధర చెల్లించాలనే నిబంధన పెట్టడంతో చేతిలో చిల్లిగవ్వ లేని రైతులు మండిపడుతున్నారు.
విత్తుకు జూలై నెలంతా మంచి అదను
వేరుశనగ విత్తుకునేందుకు జూలై నెల మంచి అదను. అవసరమైతే ఆగస్టు మొదటి వారంలోగా విత్తుకున్నా దిగుబడులకు ఢోకా ఉండదు. నీటి వసతి కింద విత్తుకోవాలంటే జూన్ 15 తరువాత వేసుకోవచ్చు. జూన్ 5 తరువాత నైరుతీ రుతుపవనాల్లో కదలిక ఉంటుందనే సమాచారం ఉంది. ఇప్పటికే జిల్లాలో రోజూ కొన్ని మండలాల్లో వర్షాలు పడుతున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుని పొలాలను దుక్కులు చేసుకుంటే పంటకాలంలో మంచి ఫలితం ఉంటుంది.
- డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, ఏరువాక కో ఆర్డినేటర్
విత్తన పంపిణీ ఆలస్యం
రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయితీ విత్తన పంపిణీకి అవరోధాలు ఎదురవుతున్నాయి. ఏటా మే నెలాఖరులో ప్రారంభించి జూన్ మూడో వారంలోగా మూడు విడతలుగా విత్తన పంపిణీ చేశాం. అయితే ఈ సారి కొత్త రాష్ట్రంగా అవతరించడం, ప్రభుత్వం కొలువులోకి రాకపోవడం వల్ల విత్తన పంపిణీ ఆలస్యమవుతోంది. ఈ నెల 8 తరువాత పంపిణీ కార్యక్రమం కొలిక్కివచ్చే అవకాశం ఉంది. 3.50 లక్షల క్వింటాళ్లు విత్తన వేరుశనగ, 8,500 క్వింటాళ్లు కందులు, అలాగే జొన్న, మొక్కజొన్న, ఆముదం విత్తనాలు కొంత వరకు తప్పకుండా అందజేస్తాం.
- పీవీ శ్రీరామ్మూర్తి, వ్యవసాయశాఖ జేడీ
రాయితీ విత్తనం కోసం ఎదురుచూస్తున్నాం
నాకున్న 5 ఎకరాల పొలంలో వేరుశనగ వేస్తున్నాను. విత్తనం ఇంకా సమకూర్చుకోలేదు. ప్రభుత్వం ఇచ్చే రాయితీ విత్తనం కోసం ఎదురుచూస్తున్నా. పంట సాగు కోసం, ఇతరులకు బాడుగ వెళ్లడానికి వీలుగా రూ.40 వేలు పెట్టి కాడెద్దులు కొన్నాను. ప్రకృతి కరుణించి.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం రైతులను ఆదుకుంటే తప్ప ముంగారు సేద్యం ముందుకు సాగదు.
-తలారి రామకృష్ణ, బండ్లపల్లి, నార్పల మండలం
కొత్త రూల్స్ పెట్టడం మంచిది కాదు
ముందు ఎపుడూ లేని విధంగా ఈసారి వేరుశనగకాయలు పూర్తి ధర పెట్టి కొనాలని రూల్స్ పెట్టడం రైతులకు కష్టమే. మళ్లీ రాయితీ సొమ్ము బ్యాంకుల్లోకి వేస్తామని చెప్పినా దాని కోసం ఎన్నాళ్లు ఎదురుచూడాలో.. కరువు జిల్లా రైతులకు ఇలాంటి కొత్త కొత్త రూల్స్ పెట్టడం మంచిదికాదు. నాకు 30 ఎకరాలు ఉండగా 20 ఎకరాల్లో వేరుశనగ వేస్తా. దాని కోసం ఇప్పటికే 4 మూటల విత్తనాలు సిద్ధం చేసుకున్నా. ఇంకా 8 మూటలు కావాలి. రాయితీ విత్తనం కోసం ఎదురుచూస్తున్నా.
- వెంకటరామిరెడ్డి, వడ్డుపల్లి, ఆత్మకూరు మండలం
కోటి ఆశలతో ఖరీఫ్‌కు స్వాగతం
Published Mon, Jun 2 2014 2:32 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement