ఆముదం, పత్తిలో సస్యరక్షణ
అనంతపురం అగ్రికల్చర్: ఇటీవల కురిసిన వర్షాలకు ఆముదం, పత్తి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న పంటలు ఆశాజనకంగా ఉన్నందున పురుగులు, తెగుళ్ల నివారణకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు.
+ ఈ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 6,700 హెక్టార్ల విస్తీర్ణంలో ఆముదం పంట వేశారు. జూన్, జూలైతో పాటు ఆగస్టులో పంట సాగుచేశారు. ప్రస్తుతం శాఖీయ దశ నుంచి గెల వేసే దశలో ఉంది. ఈ సమయంలో ఎరువులు, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పంట వేసిన 30, 60, 90 రోజుల సమయంలో తేమను ఉపయోగించుకుని ఎకరాకు 20 కిలోల యూరియా పైపాటుగా వేసుకోవాలి. రసంపీల్చు పురుగుల నివారణకు 2 మి.మీ డైమిథోయేట్ లేదా 1.5 గ్రాములు అసిఫేట్ లీటర్ నీటికి కలిపి ఆకులు అడుగుభాగం తడిచేలా పిచికారీ చేసుకోవాలి. నామాల పురుగు ఆశిస్తే పంట దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్‌లలో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. నివారణకు 1.5 గ్రాములు అసిఫేట్ లేదా 2 మి.లీ ప్రొపినోఫాస్ లేదా 1 మి.లీ నొవాల్యురాన్ లేదా 1.5 గ్రాములు థయోడికార్బ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగులు పెద్దవిగా ఉన్నపుడు ఏరివేసి నాశనం చేసినా ఫలితం ఉంటుంది. పక్షులు వాలేందుకు వీలుగా పొలంలో అక్కడక్కడా పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకుంటే పచ్చపురుగులను సమూలంగా అరికట్టవచ్చు.
+ ప్రత్యామ్నాయ పంటల కింద ఇటీవల సాగు చేసిన జొన్న, మొక్కజొన్న పంటల్లో కాండంతొలచు పురుగు ఆశించినందున నివారణకు ఎకరాకు 320 మి.లీ మోనోక్రోటోఫాస్ 36 ఎస్‌ఎల్ లేదా 60 మి.లీ రేనాక్షిపైర్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
+ వేరుశనగలో శనగపచ్చ పురుగు నివారణకు 1.5 గ్రాములు లార్విన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
+ పత్తిలో గులాబీరంగు పురుగు నివారణకు ఎకరాకు 4 నుంచి 6 ఫిరమోన్ ఎరలు ఉంచాలి. తొలుత 5 శాతం వేపగింజల కషాయం లేదా 5 మి.లీ వేపనూనె లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తి పూలు, కాయలలో పురుగు ఉన్నట్లు గమనిస్తే 2 మి.లీ క్వినాల్‌ఫాస్ లేదా 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లేదా 1 గ్రాము థయోడికార్బ్ లేదా 2 మి.లీ ప్రొపినోపాస్ లీటర్ నీటికి కలిపి బాగా తడిచేలా 10 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే చివరగా 2 మి.లీ ప్రొపినోపాస్ లేదా 1.5 గ్రాములు లార్విన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
+ సెప్టెంబర్‌లో ప్రత్యామ్నాయ పంటల కింద ఎర్ర నేలల్లో జొన్న, సజ్జ, పెసర, అలసంద, ఉలవ అలాగే నల్లరేగడి భూముల్లో జొన్న, కొర్ర, పెసర, అనుములు, ఉలవ, పొద్దుతిరుగుడు వేసుకోవచ్చు.