చిక్కిపోయిన చిరు ధాన్యం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో చిరుధాన్యపు పంటలకు స్థానం లేకుండా పోయింది. గతంలో ఓ వెలుగు వెలిగిన ఈ పంటలు ఇటీవల కాలంలో కనుమరుగవుతూ వస్తున్నాయి. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, ఆరికలు, సామలు వంటి చిరుధాన్యాలు గతంలో ఇంటింటా నిల్వ ఉండేవి. ప్రజలు వీటిని ఆహారం కోసం వినియోగించేవారు. తీవ్ర కరువు కాటకాలు ఏర్పడినా ఒకట్రెండు సంవత్సరాలు అధిగమించేవారు. వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల కారణంగా చిరుధాన్యపు పంటలు క్రమేణా కనుమరుగవుతున్నాయి. వాటి స్థానాన్ని వాణిజ్య, పప్పుధాన్యపు పంటలు ఆక్రమిస్తున్నాయి.
అధికారిక గణాంకాలను పరిశీలిస్తే.. 1960-1980 మధ్యకాలంలో జిల్లాలో చిరుధాన్యపు పంటలదే పైచేయి. వేరుశనగ కన్నా అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసేవారు. ఇంట్లో ఏర్పాటు చేసుకున్న గరిసెలు, గాదెల్లో వాటిని ఏడాది పొడవునా నిల్వ చేసుకుని ఆహారం కోసం వాడుకునేవారు. 1961-62లో చిరుధాన్యపు పంటలను అత్యధికంగా 5.55 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. వేరుశనగ కేవలం 1.94 లక్షల హెక్టార్లలో వేశారు. 1971-72లోనూ చిరుధాన్యపు పంటలు 4.01 లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చాయి. అదే సంవత్సరం వేరుశనగ పంట 2.55 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగైంది. 1981-82లో మాత్రం వేరుశనగ విస్తీర్ణం (3.74 లక్షల హెక్టార్లు) పెరిగింది. ఆ ఏడాది చిరుధాన్యపు పంటలు మూడు లక్షల హెక్టార్లకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత కూడా చిరుధాన్యపు పంటల విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వచ్చింది. 1991-92లో 60 వేల హెక్టార్లు, 2001-02లో 30 వేల హెక్టార్లకు పరిమితమయ్యాయి. 2010-11లో పరిస్థితి మరీ ఘోరం. నామమాత్రంగా 20 వేల హెక్టార్లలో సాగయ్యాయి. గత ఏడాదీ ఇదే పరిస్థితి. జిల్లాలో కరువును ఎదుర్కోవాలంటే చిరుధాన్యపు పంటలను ప్రోత్సహించాలని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ సారథ్యంలోని కేంద్ర సాంకేతిక కమిటీ సిఫారసు చేసిన విషయం విదితమే. ఆ దిశగా ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది.
మార్కెట్‌లో మంచి డిమాండ్
చిరు ధాన్యాలకు మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉంది. డయాబెటిక్ (చక్కెర) వ్యాధిగ్రస్తులు వరి అన్నం తినడం మానేసి చిరుధాన్యాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్నారు. దీంతో జొన్నలు, కొర్రలు, రాగులకు నగరాలు, పట్టణాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది.
గృహిణులు సైతం చిరు ధాన్యాలతో ప్రస్తుతం పలు రకాల రుచికరమైన పిండి వంటలు చేస్తున్నారు. ఈ దృష్ట్యా వాటి ధర కూడా గతంతో పోలిస్తే ఇపుడు బాగా పెరిగింది.