కృషి.. పట్టుదల.. తపన ఉంటే ఎంతటి కష్టాన్నైనా సులువుగా సాధించవచ్చునని నిరూపించారు గ్రామీణ యువకులు. వరుస కరువులతో ఆర్థికంగా కుదేలైనప్పటికి.. వెరవ లేదు. తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగితే.. కుటుంబ ఆర్థిక పరిస్థితులతో పాటు గ్రామ స్వరూపాన్ని కూడా మార్చవచ్చునని భావించారు. ఆ దిశగానే శ్రమించారు. కరువుపై విజయ సాధించారు.
అమరాపురం : గౌడనకుంట.. జిల్లా పటంలో ఎక్కడో మారుమూల కనిపించే ఈ గ్రామంలో అందరూ విద్యావంతులే! జిల్లా కర్ణాటక సరిహద్దులో అభివృద్ధిలో అట్టడుగు స్థానాన నిలిచిన ఈ గ్రామం అమరాపురం మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. 550 కుటుంబాలు 2,230 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో అందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
చదువుతో తలరాత మార్చుకుని..
వర్షాభావ పరిస్థితులు జిల్లా రైతులను కుదేలు చేశాయి. కొన్నేళ్లుగా వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. ఈ పరిస్థితులు అమరాపురం మండలంలో మరింత తీవ్రంగా ఉన్నాయి. వ్యవసాయంపై ఆధారపడ్డ గౌడనకుంటలో రైతుల ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమయ్యాయి. తాము పడుతున్న కష్టం తమ పిల్లలకు రాకూడదని భావించారు తల్లిదండ్రులు. ఎంతటి కష్టమైనా.. వారిని బాగా చదివించే దిశగా ఆలోచించారు. అనుకున్నదే తడవుగా ప్రతి ఇంటి నుంచి పిల్లలను బడికి పంపడమే లక్ష్యంగా తల్లిదండ్రులు పెట్టుకున్నారు. 1995లో మొదలైన ఈ మార్పు.. విద్యావిప్లవానికి తెరలేపింది. తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన పిల్లలు సైతం కసిగా చదవడం మొదలుపెట్టారు. ఉన్నత ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా ఒకరిపై ఒకరు పోటీ పడుతూ చదువుల్లో రాణించారు. పిల్లల్లో పోటీతత్వాన్ని చూసిన తల్లిదండ్రులు సైతం తమకు తోచిన పుస్తకాలు చేత పట్టుకుని వారితో సమానంగా కూర్చొని చదవను, రాయను మొదలుపెట్టారు.
కొలువుల పంట
వరుస కరువులతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయినా.. అదే సమయంలో గౌడనకుంటలో చదువుల పంట సమృద్ధిగా పండింది. గ్రామం విద్యావంతుల నిలయంగా మారిపోయింది. చదువులతో సముపార్జించుకున్న విజ్ఞానంతో ఉద్యోగావకాశాలు కూడా గౌడనకుంట వాసులను వెతుక్కుంటూ వచ్చాయి. గ్రామంలో పది మంది వివిధ బ్యాంక్‌ల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. ఆరుగురు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మరో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులుగా బాధ్యతలు స్వీకరించారు. వీరు రగలించిన స్ఫూర్తితో మరికొందరు డిగ్రీలు పూర్తి చేసుకుని వివిధ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు ఓనమాలు నేర్వని గ్రామం.. నేడు విద్యావంతులకు నిలయంగా మారిపోయింది. అమరాపురం మండలంలోనే అత్యధికంగా ఉద్యోగాలు సాధించిన గ్రామంగా గౌడనకుంట ఖ్యాతిగడించింది.
బెంగళూరులో అధికంగా..
పొరుగున ఉన్న బెంగుళూరులో గౌడనకుంటకు చెందిన పలువురు యువకులు ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరికొందరు బెంగుళూరు కేంద్రంగా చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారు. గౌడనకుంట గ్రామంలో 75 మంది ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు ఉన్నారు. వీరందరూ బెంగుళూరులోని వివిధ కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నత శ్రేణి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరో ఎనిమిది మంది ఎంటెక్, ఎంబీఏ, 16 మంది డిప్లోమా, ఇద్దరు ఎంబీబీఎస్, ముగ్గురు బీఏఎంఎస్ చేస్తున్నారు. ఫార్మాసిస్ట్‌లుగా 15 మంది పనిచేస్తున్నారు. సాధారణ డిగ్రీ, ఇంటర్ పూర్తి చేసిన వారు 150 మంది ఉన్నారు.
పోటీతత్వంతో ఎదుగుతున్నారు
నాకు ప్రస్తుతం 70 సంవత్సరాలు, నేను టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాను. గతంలో ఈ ఊళ్లో వ్యవసాయం లాభసాటిగానే ఉండేది. అయితే కొన్నేళ్లుగా వర్షాబావం నెలకొనడంతో వ్యవసాయంపై ఇక్కడి రైతుల్లో ఆసక్తి తగ్గుతూ వచ్చింది. దీంతో పిల్లలను బాగా చదివిస్తూ వచ్చారు. పిల్లలు కూడా పోటీ తత్వంతో చదువుల్లో రాణిస్తూ ఉద్యోగాలు సాధిస్తున్నారు.– దొడ్డీరప్ప గ్రామపెద్ద,విశ్రాంత ఉపాధ్యాయుడు
తల్లిదండ్రుల బాధలుచూడలేకపోయా..
నా తల్లిదండ్రులు ఐదు ఎకరాల పొలంలో పంట సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. ఉన్న బోర్లలో నీటి మట్టం తగ్గి పంట సాగు చేయలేని పరిస్థితి. వారు పడుతున్న కష్టాన్ని చూడలేకపోయాను. ఓ రకమైన కసితో చదివి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ఉద్యోగం సాధించాను.– అనంతరాజు, ఎస్‌బీఐ ఉద్యోగి
ఊరికి సేవ చేస్తున్నా..
నేను ప్రస్తుతం విప్రో కంపెనీలో దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల జోనల్ మేనేజర్‌గా పనిచేస్తున్నా. మా గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల సహకారంతో గౌడనకుంట అబివృద్ధి ఫోరం స్థాపించాం. ఈ సంస్థ ద్వారా ప్రతి ఏటా సంక్రాంతి సెలవుల్లో మూడు రోజుల పాటు గ్రామంలోని మహిళలు, యువకులు, విద్యార్థులకు సరదాగా పోటీలు నిర్వహిస్తాం. గ్రామ పెద్దల చేతుల మీదుగా అందరికీ బహుమతులు అందిస్తాం. గౌడనకుంట గ్రామానికి అమరాపురం చెరువు నుంచి మట్టి రోడ్డు వేయించాం. ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులకు జనవరి నుంచి మార్చి వరకు సాయంకాలం పూట చిరుతిండ్లు ఇచ్చి, విద్యాభివృద్ధికి మావంతు సహకారం అందిస్తున్నాం. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాం.– డి.నాగరాజు, జోనల్ మేనేజర్, విప్రో
కష్టానికి తగ్గ ఫలితం
మాది చిన్న గ్రామం. నా ప్రాథమికోన్నత విద్య స్వగ్రామంలోనే పూర్తి అయింది. ఎస్సెస్సీ వరకు అమరాపురం, ఇంటర్, డిగ్రీ, ఎంఏ అనంతపురంలో పూర్తి చేశాను. ప్రస్తుతం డీఆర్‌డీఏ, వెలుగులో ప్రాజెక్ట్ మేనేజర్‌గా అనంతపురంలో పని చేస్తున్నాను. మాది పేద కుటుంబం. మా అమ్మనాన్నలు కూలీ పనులు చేస్తూ కుటుంబ పోషణ చేసేవారు. వారు పడుతున్న కష్టాన్ని చూడలేక బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించే దిశగా కష్టపడ్డాను. నేను గ్రామానికి వెళ్లినప్పుడల్లా.. అక్కడి రైతులతో మాట్లాడుతూ.. పిల్లల్ని బాగా చదివించాలని చెబుతుంటాను. మా ఊళ్లో చదువుకున్న వారితోనే గ్రామం అభివృధ్ధి జరుగుతోంది. నా వంతు సేవలను గ్రామానికి అందిస్తున్నా.– నరసయ్య, ప్రాజెక్టు మేనేజర్, వెలుగు, డీఆర్‌డీఏ
Comments
Please login to add a commentAdd a comment