అయ్యేలా లేదు..!
అనంతపురం అగ్రికల్చర్ : ఈ ఖరీఫ్‌లో రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రహసనంగా మారింది. పంపిణీ మొదలు పెట్టాలని వ్యవసాయ శాఖ ఖరారు చేసిన మూడు (మే 26,29, జూన్ 12) తేదీల్లోనూ సాధ్యపడలేదు. ఈ నెల 20న పంపిణీకి ముహూర్తం పెట్టినా విత్తన సేకరణ, సరఫరా చేసేది లేదని ఏజెన్సీలు నిర్ణయించడంతో సందిగ్ధం నెలకొంది. తదుపరి తేదీ ఎప్పుడనేది తెలుసుకోవడానికి ఈ నెల 19 వరకు ఓపిక పట్టాల్సిందే. ఈ ఏడాది జిల్లాలో 6.95 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగు చేయవచ్చని ప్రణాళిక శాఖ అంచనా వేసింది. ఇందుకు మొత్తం 14 లక్షల క్వింటాళ్ల విత్తనకాయలు అవసరం.
గతంలో ప్రభుత్వం ఏటా ఐదు లక్షల క్వింటాళ్లు రాయితీపై రైతులకు పంపిణీ చేసేది. నాలుగైదేళ్లుగా సకాలంలో ఇవ్వకపోవడం, ఇచ్చినా నాసిరకం, కల్తీ విత్తనం ఎక్కువగా ఉండడం, సవాలక్ష నిబంధనలు పెడుతుండటంతో చాలా మంది రైతులు రాయితీ విత్తనకాయలపై అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల 2012 ఖరీఫ్‌లో 3.25 లక్షల క్వింటాళ్లు, 2013లో 2.95 లక్షల క్వింటాళ్లు మాత్రమే అమ్ముడుబోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి 3.50 లక్షల క్వింటాళ్లకు మాత్రమే జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపగా, వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఓకే చెప్పింది.
తొలుత పూర్తి ధర పెట్టి తీసుకెళితే తరువాత రైతుకు వర్తించే రాయితీ సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని మెలిక పెట్టారు. క్వింటా పూర్తి ధర రూ.4,600గా నిర్ణయించారు. ఇందులో 33 శాతం రాయితీ (రూ.1,500) ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా... విత్తన సేకరణ, ఏర్పాట్లలో అధికారులు విఫలమయ్యారు. 3.50 లక్షల క్వింటాళ్లు సేకరించే బాధ్యత ఆయిల్‌ఫెడ్, హాకా, మార్క్‌ఫెడ్, ఏపీ సీడ్స్‌కు అప్పగించారు. మే 24 నాటికి 50 వేల క్వింటాళ్లు జిల్లాలో నిల్వ చేయాలని నిర్దేశించినా...సాధ్యపడ లేదు. కోటా ప్రకారం విత్తనం సేకరించి జిల్లాకు సరఫరా చేయడానికి ఏజెన్సీలు వెనుకాడాయి. సేకరణ ధర రూ.4,600 గిట్టుబాటు కాదంటూ మొండికేశాయి. క్వింటా రూ.5,300 ప్రకారం పెంచితే తప్ప రంగంలోకి దిగేదిలేని తేల్చిచెప్పాయి. ఈ క్రమంలో పంపిణీ తేదీలు మారిపోతూ వచ్చాయి. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో ఏపీ సీడ్స్, మార్క్‌ఫెడ్, హాకా ఏజెన్సీలు మాత్రం శనివారం నాటికి 8,200 క్వింటాళ్లు సేకరించి 35 మండల కేంద్రాల్లో నిల్వ చేశాయి. ఆయిల్‌ఫెడ్ మాత్రం ఇప్పటికీ క్వింటా కూడా సేకరించలేదు. ఈ పరిస్థితుల్లో రైతులు, రైతు సంఘాలు, విపక్షాలు విత్తన వేరుశనగ పంపిణీ వెంటనే చేపట్టాలని పెద్దఎత్తున డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత ఈ నెల 11న హైదరాబాద్‌లో కమిషనర్, ఏజెన్సీల అధికారులతో సమావేశం నిర్వహించారు. విత్తన సేకరణ ధర రూ.4,600 నుంచి రూ.5,100లకు పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అలాగే పాతపద్ధతి ప్రకారం రాయితీతోనే విత్తన పంపిణీ చేపట్టాలని సూచించారు. ఇక సమస్య పరిష్కారమైందని భావించిన జిల్లా అధికారులు ఈ నెల 20 నుంచి పంపిణీ మొదలు పెట్టాలని నిర్ణయించారు. కానీ.. మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడక పోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
పాత పద్ధతి ప్రకారం ధరలు, రాయితీలు, మార్గదర్శకాలు విడుదల చేయాలని కమిషనరేట్ అధికారులు భావించడంతో మరోసారి బ్రేకులు పడ్డాయి. నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి ఈనెల 19న అధికారికంగా మార్గదర్శకాలు ప్రకటించే అవకాశం ఉందని జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ర్ట వ్యాప్తంగా 5.25 లక్షల క్వింటాళ్ల వేరుశనగ సరఫరాకుసంబంధించి శనివారం ప్రభుత్వం షార్ట్‌టెండర్లు పిలిచినట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం నుంచి విత్తన సేకరణ, సరఫరా నిలిపేశారు. ఈ నెల 20 తరువాతనే ప్రక్రియలో కదలిక వచ్చే పరిస్థితి నెలకొంది.