ఖరీఫ్ ధాన్యం సేకరణ చెల్లింపులు వారంలో పూర్తి
61వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.830 కోట్లు జమ
4.97లక్షల మంది రైతులకు రూ.6538 కోట్ల మద్దతు ధర అందించిన ప్రభుత్వం
ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం సేకరణకు సన్నాహాలు
ఐదేళ్ల కింద ఇదే సమయంలో రైతులకు కుచ్చుటోపీ పెట్టిన చంద్రబాబు
మద్దతు ధరను ఆలస్యం చేసి రూ.4వేల కోట్లు పక్కదారి పట్టించిన టీడీపీ
చివరికి చంద్రబాబు దిగిపోతూ రూ.960 కోట్లు బకాయిలు పెట్టిన దుస్థితి
సీఎం జగన్ వచ్చి న తర్వాతే అత్యంత పారదర్శకంగా రైతుల ఖాతాల్లోకి మద్దతు ధర
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం రైతులకు బాసటగా నిలుస్తోంది. ధాన్యం కొనుగోలులో సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు.. దేశంలోనే తొలిసారిగా రైతులకు గన్నీ, హమాలీ, రవాణా (జీఎల్టి) చార్జీల కింద టన్నుకు రూ.2523 అదనంగా చెల్లిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఖరీఫ్ 2023–24లో 4.97లక్షల మంది రైతుల నుంచి రూ.6,538 కోట్ల విలువైన 29.91లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది.
వీటిల్లో 4.36లక్షల మంది రైతులకు రూ.5700 కోట్ల మద్దతు ధర చెల్లించింది. మిగిలిన 61 వేల మంది రైతులకు రూ.838 కోట్లు అందించేందుకు వీలుగా నిధులను సమీకరించింది. ఆర్బీకేల్లో షెడ్యూల్ చేసిన వివరాల ప్రకారం వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో మద్దతు ధర మొత్తాన్ని జమ చేయనుంది. తద్వారా ఖరీఫ్ కొనుగోళ్లలో సంపూర్ణ చెల్లింపులను చేయనుంది.
ఇక రబీ సేకరణకు సమాయత్తం
ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తవడంతో ఏప్రిల్ మొదటి వారం నుంచి రబీ కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ సమాయత్తం అవుతోంది. రబీ సీజన్‌లో 25లక్షల టన్నులకుపైగా ధాన్యం వస్తుందని అంచనా వేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా గోనె సంచులు, హమాలీలు, రవాణా సదుపాయాలను కల్పించేలా క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.
గోదావరి జిల్లాల్లో రబీలో సాగు చేసే జయరకం (దుడ్డు బియ్యం)ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు సేకరించనుంది. గతేడాది జయ రకం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించగా కేవలం 90వేల టన్నులు మాత్రమే వచ్చి ంది. ఈసారి 3లక్షల టన్నులు సేకరించేలా ప్రణాళిక రూపొందించింది. అయితే జయరకం ధాన్యాన్ని ప్రభుత్వం స్వయంగా మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటం రైతులకు లాభసాటిగా మారింది.
ఈ రకం ధాన్యం వినియోగం స్థానికంగా చాలా తక్కువ. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో దుడ్డు బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో గతంలో ప్రైవేటు వ్యాపారులు ఇచ్చి న రేటు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వ జోక్యంతో ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి దుడ్డు బియ్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
37.68 లక్షల మంది రైతులకు మద్దతు
టీడీపీ ఐదేళ్లలో కేవలం 17.94లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. కానీ, సీఎం జగన్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. అంటే టీడీపీ హయాంలో కంటే 20లక్షల మంది రైతులకు అదనంగా సీఎం జగన్ ప్రభుత్వం మద్దతు ధర అందించింది.
మొబైల్ బృందాలతో పరిశీలన..
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దళారీ, మిల్లర్ల వ్యవస్థకు చెక్‌పెడుతూ ఆర్బీకేల కేంద్రంగా ఈ–క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం సేకరణ చేసి వాస్తవ రైతుకు సంపూర్ణ మద్దతు ధరను అందిచే పటిష్ట వ్యవస్థను తీసుకొచ్చారు.
క్షేత్ర స్థాయికి ఆర్బీకే అసిస్టెంట్ వెళ్లి నాణ్యతను పరిశీలించడం, ఆన్‌లైన్‌లో ధాన్యం రైతు వివరాలు నమోదు, ట్రక్ షీట్ జనరేట్, చివరికి ధాన్యం తరలించాల్సిన మిల్లును కూడా ఆటోమేటిగ్గా ఎంపిక చేసే సాంకేతిక విధానాన్ని తీసుకొచ్చారు. లోడు పక్కదారి పట్టకుండా రవాణా వాహనాలకు జీపీఎస్‌ను సైతం అమర్చారు.
మిల్లుల్లో ధాన్యం నాణ్యత సమస్యలను రైతులతో సంబంధం లేకుండా పరిష్కరించేందుకు కస్టోడియన్ అధికారులను నియమించారు. ప్రస్తుతం ఎన్నికల సమయం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మండలానికి ఒక ప్రత్యేక మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేసి ధాన్యం రైతుల సమస్యలను పరిష్కరించేలా దృష్టి సారించారు. ప్రభుత్వ కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులతో పాటు స్థానికంగా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు.
దిగుబడిలో 60 శాతం కొనుగోలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా బీపీటీ, నెల్లూరు, స్వర్ణ రకాలను పండిస్తున్నారు. వీటికి జాతీయ, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంటుంది. ఇవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కాకుండా బయటకు వెళ్లిపోతాయి. మిగిలిన రకాల ధాన్యా న్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఇలా.. ఏపీలో ధాన్యం దిగుబడుల్లో రైతుల అవసరాలకు నిల్వ చేసిన తర్వాత 60 శాతం పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తోంది.
బాబు హయాంలో బకాయిలే!
గతంలో రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, మిల్లర్లకు దోచిపెట్టేవారు. పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు.
ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యక్షంగా రైతులు నష్టపోయేవారు. పైగా అప్పటి ఎన్నికల ముందు రైతులకు చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల ధాన్యం డబ్బులను చంద్రబాబు ప్రచార పథకాలకు మళ్లించడంతో సమయానికి డబ్బులు అందక రైతులు అల్లాడిపోయారు. చివరికి చంద్రబాబు దిగిపోతూ ఇంకా రూ.960 కోట్లు బకాయిలు పెట్టారు. వీటిని కూడా సీఎం జగన్ ప్రభుత్వమే చెల్లించింది.
Comments
Please login to add a commentAdd a comment