వర్షించిన ఆశలు
వర్షించిన ఆశలు
Published Fri, Jun 16 2017 10:57 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM
జిల్లాలో భారీ వర్షం
- ఆస్పరిలో అత్యధికంగా 77 మి.మీ., వర్షపాతం
- ముమ్మరంగా ఖరీఫ్ పనులు
కర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతపవనాల ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా సాగుతోంది. కరువు కోరల్లో చిక్కుకొని అల్లాడుతున్న రైతులకు వర్షాలు ఊరటనిస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచే వర్షాలు పడుతుండటంతో సకాలంలో విత్తనం వేసుకునే అవకాశం లభించింది. గురువారం రాత్రి నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం వరకు అత్యధికంగా ఆస్పరిలో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. హాలహర్వి, తుగ్గలి, శ్రీశైలం మండలాలు మినహా జిల్లాలోని ఆన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఆస్పరి, ఆదోని, కౌతాళం, నందవరం మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. గడివేముల, వెలుగోడు, ఆత్మకూరు, కోడుమూరు, వెల్దుర్తి, హొళగుంద, చిప్పగిరి, మద్దికెర మండలాల్లో తేలికపాటి వర్షాలు పడగా.. మిగిలిన అన్ని మండలాల్లోనూ వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయి.
29 మండలాల్లో 10 మి.మీ.,కు పైగా వర్షపాతం నమోదయింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లా మొత్తం మీద సగటున 18 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.2 మి.మీ., ఉండగా 16 రోజుల్లోనే 71.7 మి.మీ., వర్షపాతం నమోదయింది. దాదాపు అన్ని మండలాల్లో వర్షాలు పడటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉక్కిరిబిక్కిరి చేసిన నీటి సమస్య ఇప్పుడిప్పుడే పరిష్కారం అవుతోంది. వర్షాల రాకతో పత్తి, ఆముదం, కంది విత్తనం పనులు ఊపందుకున్నాయి. కర్నూలు, ఆదోని డివిజన్‌లలో పత్తి సాగు ముమ్మరంగా సాగుతోంది. కాగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి కర్నూలు, కల్లూరు సహా వివిధ మండలాల్లో వర్షం కురిసింది.
గ్రామాల్లో నకిలీ బీటి పత్తి విత్తనాలదే హవా
వర్షాలు ఆశాజనకంగా పడుతుండటంతో నకిలీ విత్తనాలు గ్రామాల్లో వెల్లువెత్తుతున్నాయి. సకాలంలో వర్షాలు పడటం, పత్తి సాగు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో నకిలీలకు రెక్కలొచ్చాయి. ఈ ఏడాది 3 లక్షలకు పైగా హెక్టార్లలో పత్తి సాగు అయ్యే అవకాశం ఉంది. గుంటూరు ప్రాంతానికి చెందిన కొందరు జిల్లాలో తిష్టవేసి నకిలీలను మార్కెట్‌లోకి విస్తరింపచేస్తున్నట్లు తెలుస్తోంది. గద్వాల ప్రాంతానికి చెందిన కొందరు గ్రామాల్లో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నట్లు సమాచారం. ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, దేవనకొండ, కోడుమూరు, సి.బెళగల్, ఆస్పరి తదితర మండలాల్లో నకిలీ బిటీ విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతోంది.
జిల్లాలోని వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం
మండలం వర్షపాతం(మిల్లీమీటర్లలో)
ఆస్పరి 77
ఆదోని 51.2
కౌతాళం 46.4
నందవరం 44
కోసిగి 43.4
శిరువెళ్ల 39.4
కల్లూరు 37.6
కర్నూలు 36.4
మహనంది 36.2
బండిఆత్మకూరు 34.2
సంజామల 34.2
డోన్ 32.2
చాగలమర్రి 31.2
నంద్యాల 30
Advertisement
Advertisement