
దోబూచులాడిన రుతుపవనాలు ఎట్టకేలకు వచ్చేశాయ్. కేరళను తాకి దేశంలోకి..
సాక్షి, ఢిల్లీ: భారత వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఇవాళే కేరళను తాకినట్లు అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందు రేపు(శుక్రవారం) రుతుపవనాలు కేరళను తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. అయితే.. ముందుగానే ఇవాళ చేరుకుంది.
రుతుపవనాల రాక ప్రభావంతో.. రానున్న 48 గంటల్లో కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలుపడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని చెబుతోంది. వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని పేర్కొంది.
ఈ ఏడాది దోబూచులాడిన రుతుపవనాలు.. ఆలస్యంగా ప్రవేశించాయి. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమట గాలులు కొనసాగుతున్నాయి. అంతకు ముందు పశ్చిమ గాలుల లోతులో పెరుగుదల, ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ తీర ప్రాంతాలపై మేఘావృతం ఉధృతం కావడం వంటి పరిణామాలు కనిపించాయి.
తెలంగాణలో మూడురోజులపాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది వాతావరణశాఖ. అయితే.. గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీకి ఉపశమనం కాస్త ఆలస్యం కావొచ్చని అంచనా వేస్తోంది.