సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రపై సాధారణంగా ప్రభావం చూపుతున్నాయి. రాయలసీమలో బలహీనంగా ఉన్నాయి. మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణం దిశగా ఆవరించి ఉంది. వీటి ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. శనివారం కోస్తాంధ్రలో అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. నైరుతి దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. గడచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో అనేక చోట్ల వర్షాలు కురిశాయి. అమలాపురంలో 7, భీమవరంలో 4, హోలగుండలో 2, తుని, కొయ్యలగూడెం, కంభం, బెస్తవారిపేట, తిరువూరు, పొదిలి, అర్థవీడు, వీరఘట్టం, పోలవరం, గరుగుబిల్లి, పార్వతీపురంల్లో ఒక్కో సెంటీమీటరు వర్షం కురిసింది.
Comments
Please login to add a commentAdd a comment