సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయాన్ని వదులుకునేందుకు ధనికులెవరూ పెద్దగా ఇష్టపడలేదు. పెట్టుబడి సొమ్ము వదులుకోవాలని (గివ్ ఇట్ అప్) స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చినా స్పందన కరువైంది. ఇప్పటివరకు కేవలం దాదాపు వెయ్యి మంది మాత్రమే రూ. 1.71 కోట్ల విలువైన సొమ్మునే వదులుకున్నారు.
అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు కూడా పంట పెట్టుబడి సాయం వదులుకోవడానికి ముందుకు రాలేదని సమాచారం. పెట్టుబడి పథకం కింద ఈ ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ. 4 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో ఇచ్చింది. ఇప్పటివరకు 43 లక్షల మంది రైతులు దాదాపు రూ. 4 వేల కోట్ల వరకు సొమ్ము తీసుకున్నారు.
అందులో దాదాపు లక్ష మందికిపైగా 20 ఎకరాలకు మించినవారున్నారని అంచనా. అందుకే స్వచ్ఛందంగా పెట్టుబడి సొమ్ము వదులుకునే వారిని ప్రోత్సహించాలని సర్కారు నిర్ణయించింది. ముందుగా ముఖ్యమంత్రే ముందుకు వచ్చారు. ఇతరులనూ ముందుకు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. కానీ చాలామంది పెద్దలు పెట్టుబడిపై మమకారం పెంచుకున్నారన్న ఆరోపణలున్నాయి.
మనసు రావడం లేదు...
రైతు బంధు పథకం కింద ఏడాదికి ఎకరాకు రూ.8 వేలు అందుతుంది. ఒక ధనిక రైతుకు 100 ఎకరాలుంటే, అతనికి ఏడాదికి ఏకంగా రూ.8 లక్షలు అందుతుంది. కొందరికి 10–15 ఎకరాలే ఉన్నా కోట్ల రూపాయల టర్నోవర్‌తో ఇతర వ్యాపారాలున్నాయి. అటువంటి వారు కూడా తమకొచ్చే డబ్బులు తీసుకున్నారు.
కొందరు సినిమావాళ్లు, పారిశ్రామికవేత్తలు కూడా డబ్బులు తీసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడి సొమ్మును వదులుకుంటే ఆ సొమ్మును రైతు కార్పొరేషన్‌కు అందజేస్తామని, దాన్ని రైతుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెప్పినా స్పందన రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్‌గా సురేశ్ బాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాంలకు ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్‌గా రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి సురేశ్ బాబు నియమితులయ్యారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు జూన్ 25 నుంచి విచారణకు రానున్నట్లు ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ కార్యాలయం డిప్యూటీ సెక్రటరీ పీఎస్ చక్రవర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి ఎలాంటి సమస్యలు, ఫిర్యాదులున్నా తమ కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా సూచించారు. రూ.30 లక్షల వరకు క్లెయిమ్‌లకు సంబంధించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment