సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘రైతు బంధు’పథకంతో గ్రామాల్లో టీఆర్‌ఎస్‌కు చాలా ప్రయోజనం కలుగుతుందని ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఏటా ఎకరానికి రూ.8 వేలు అందజేసే ఈ పథకం ద్వారా ప్రభుత్వం పై, పార్టీపై రైతుల్లో కృతజ్ఞతాభావం పెరుగుతుందని వారంటున్నారు.
‘రైతుబంధు’చెక్కులు అందుకున్న రైతులు సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారంటూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం పంపుతున్నాయి. ఈ పథకం పెద్దగా ప్రచారం చేసే అవసరం లేకుండానే.. పార్టీకి, ప్రభుత్వానికి పేరు తెచ్చిపెట్టునట్టు పేర్కొంటున్నాయి.
కేసీఆర్‌పై ప్రశంసలు..
ఇప్పటిదాకా రుణాల కోసం బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదని.. రైతు బంధు ద్వారా ఉచితంగానే, ఎలాంటి పైరవీలు లేకుండానే ఎకరానికి రూ.4 వేల సాయాన్ని అందుకుంటున్నామని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. రైతు క్షేమాన్ని ఆలోచించే నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోందంటున్నారు. ఇప్పటివరకూ కేసీఆర్ కు ఇంత పేరు తెచ్చిన పథకమేదీ లేదంటున్నారు.
అట్టహాసంగా కార్యక్రమాలు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ‘రైతు బంధు’ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించగా.. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులు చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లెల్లో ఎడ్లబండ్లపై ఊరేగింపులు, అలంకరణలు వంటివి చేసి సంబురాలు జరుపుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment