సార్వత్రికమే టార్గెట్‌! | TRS Leaders Are Preparing For General elections | Sakshi
Sakshi News home page

సార్వత్రికమే టార్గెట్‌!

Published Sun, Jul 1 2018 9:41 AM | Last Updated on Wed, Aug 15 2018 9:10 PM

TRS Leaders Are Preparing For General elections - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయనే భ్రమలు తొలిగిపోవడంతో అధికార పార్టీ నేతలు సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికల దిశగా వేస్తున్న అడుగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా తోడయ్యారు. ఇటీవల బహిరంగ సభలోనే ఆయన ముందస్తు ఎన్నికలు జరుగుతాయని సూచనప్రాయంగా చెప్పడంతో టీఆర్‌ఎస్‌లోని సిట్టింగ్‌లు అలర్ట్‌ అయ్యారు. ముందస్తు ఎన్నికలు జనవరిలోగా పూర్తవుతాయని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన సర్వేలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాపై పూర్తి విశ్వాసం ఉంచినట్లు సమాచారం. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా, ఆయా నియోజకవర్గాల్లో పార్టీపై ప్రజల్లో 60 శాతం వరకు అనుకూలత ఉన్నట్లు తేలింది.

ఈ నేపథ్యంలో ప్రజల్లో తమపై ఉన్న వ్యక్తిగత వ్యతిరేకతను కూడా అధిగమించడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పంచాయతీ ఎన్నికల జంఝాటం తొలిగిపోవడంతో తమ ప్రతిష్టను పెంచుకునేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిట్టింగ్‌ సీట్లను కేసీఆర్‌ మార్చరని బలంగా నమ్ముతున్న కొందరు ఎమ్మెల్యేలు పడిపోయిన బలాన్ని, జారిపోయిన బలగాన్ని తిరిగి సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నాయకులను సైతం టీఆర్‌ఎస్‌లో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

రైతుబంధు, బీమాలపై గంపెడాశ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మొదటి దశ ముగి సింది. స్థానికంగా ఉన్న భూ వివాదాలు, ఇతర సమస్యల కారణంగా కొందరికి చెక్కులు, పాస్‌ పుస్తకాలు రాకపోయినా తొలిదశ విజయవంతమైందనే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అర్హులైన వారందరికి త్వరలోనే చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీ ఆర్‌డీవోలు, తహసీల్దార్‌లతో మా ట్లాడుతూ చెక్కుల పంపిణీ సజావుగా పూర్తిచేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అదే సమయంలో రైతులకు రూ.5లక్షల బీమా పథకం కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధిం చి మార్గదర్శకాలు ఇప్పటికే జిల్లాలకు అందాయి. వచ్చే రెం డు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసే పనిలో జిల్లాల యంత్రాంగం ఉంది. వచ్చే నవంబర్‌లో రెండో విడత రైతుబంధు కింద చెక్కుల పంపిణీ జరుగనుంది. డిసెంబర్‌ లేదా జనవరిలో ముందస్తు ఎన్నికలు జరగడానికి ముం దే ఈ చెక్కుల పంపిణీ కూడా పూర్తయితే రైతుల్లో ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఏర్పడుతుందని, ఎమ్మెల్యేల తప్పులు కూడా ఇందులో తుడిచిపెట్టుకుపోతాయని వారి అంచనా. ఈ నేపథ్యంలో పూర్తి ఆత్మవిశ్వాసంతో జిల్లాకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. 

సిట్టింగ్‌ల్లో ఎవరికి భయం..?
ఉమ్మడి జిల్లాలోని పది మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లపై ఒకరిద్దరికి అనుమానం ఉంది. స్థానికంగా ఉన్న పరిస్థితులకు తో డు పోటీ నాయకత్వం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ల్లో తెలియని ఆందోళన కనిపిస్తోం ది. ఇప్పుడున్న ఎమ్మెల్యేల సీట్లు మళ్లీ గెలవడం ఖాయమని తెలిసినప్పుడు అధిష్టానం ప్రయోగా లు చేయబోదనే విశ్వాసం ఉన్నప్పటికీ, పార్టీలోని బలమైన ప్రత్యర్థుల గురించే కొంత ఆందోళన. అయితే స్థానిక అంశాలు, కుల సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల బలాన్ని పరిగణలోకి తీసుకొనే కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టిక్కెట్ల కోసం పోటీ ఉంద ని భావించిన ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌ నియోజకవర్గాలలో సైతం ఎమ్మెల్యేలు తమదే పైచేయి అని నమ్ముతున్నారు. ప్రత్యర్థుల మైనస్‌ పాయింట్లను చాపకింది నీరులా ప్రచారంలోకి తెస్తున్నారు. అదే సమయంలో స్థాని కంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. 

ఎంపీల మార్పు కూడా ఉండదేమో..?
ఆదిలాబాద్‌ ఎంపీ జి.నగేష్‌ బోథ్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నగేష్‌ను కదల్చే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేదని ఓ ప్రజాప్రతినిధి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పా రు. ఆదివాసీ ఉద్యమం ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నగేష్‌ను కదల్చే సాహసం చేయబోరని ఆయన వాదన. నగేష్‌ ఎం పీగానే తిరిగిపోటీ చేస్తే బోథ్‌ నుంచి బాపూరావుకే తిరిగి సీటు ఖాయం. ఖానాపూర్‌లో సిట్టింగ్‌ ఎమ్మె ల్యే రేఖానాయక్‌కు స్థానికంగా మెజారిటీ ఓట్లు ఉన్న ఓ వర్గం మద్దతు ఉంది. ఇక్కడ రమేష్‌రాథో డ్‌ పోటీ చేయనున్నట్లు చెపుతున్నా, మహిళగా ఆమె పట్లనే సానుభూతి ఉంటుందని పార్టీ అంచనాకు వచ్చినట్లు టీఆర్‌ఎస్‌ నేతలు విశ్లేషిస్తున్నారు. రేఖానాయక్‌ భర్త ఆర్‌టీఏ అధికారి శ్యాంనాయక్‌ ఆదిలాబాద్‌ ఎంపీగా పోటీ చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుత ఆదివాసీ ఉద్యమ నేపథ్యంలో అది సాధ్యం కాదు. ఆసిఫాబాద్‌లో వివాదాస్పదం కావడంతో ఆయనను ఆదిలాబాద్‌కు బదిలీ చేయడంతో రాజకీయ ప్రస్థానంపై కొంత వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను కూడా అసెంబ్లీకి పోటీ చేయిస్తారనే ప్రచారం గత కొంతకాలంగా ఉంది. మాజీ ఎంపీ వివేక్‌ కోసం సుమన్‌ సీటును ఖాళీ చేయిస్తారని భావించినప్పటికీ, స్థానిక పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎవరిని కదిపినా పార్టీకి ఇబ్బంది కలుగుతుందని భావిస్తే ‘ఎక్కడి వారక్కడే’ అనే విధానాన్ని అవలంబించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెపుతున్నారు.
 

ఆదివాసీ ఉద్యమంపై ప్రత్యేక సర్వే
ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న ఆదివాసీలు ఎన్నికల్లో కాంగ్రెస్‌ వైపు వెళ్లకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికను అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. ఆదివాసీ రాష్ట్ర నాయకులుగా ఎదిగిన మాజీ ఎమ్మెల్యేలు సోయం బాబూరావు (బోథ్‌), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌) కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయ డం దాదాపు ఖాయమైన పరిస్థితుల్లో వీరి ప్ర భావం ఎన్నికల్లో ఎలా ఉంటుందనే అంశంపై పార్టీ దృష్టి పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే ఓసారి సర్వే చేయించిన పార్టీ నాయకత్వం మరోసారి ఆదివాసీల పల్స్‌ తెలుసుకునే ప్ర యత్నంలో ఉంది. ఆసిఫాబాద్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు ఎంపీ నగేష్‌ కూ డా ఆదివాసీనే కావడంతో వీరి నేతృత్వంలో ప్రత్యేక కార్యాచరణ తయారవుతోంది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement