సాక్షి, హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు కె. లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాఫెల్ విషయంలో పార్టమెంట్‌లో వివరణ ఇచ్చినా.. కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ మాటలు నమ్మి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని పగటికలలు కంటోందని ఎద్దేవా చేశారు.
రాహుల్ నిరాశతో మాట్లాడుతున్నారని, ఆయనలో ఇమ్మెచ్యుర్డ్ కనిపిస్తోందని విమర్శించారు. పదకొండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రాహుల్ వచ్చిన తర్వాత ఒక్క పంజాబ్‌కే పరిమితం అయిందని ఎద్దేవా చేవారు.ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను పెట్టలేక ఎన్నికలకు దూరంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికల్లో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు.రాహుల్ గాంధీ తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించే ముందు.. తెలంగాణ ప్రజలకు క్షమాణచెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే కేంద్రంపై ఆరోపణలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. పాలనలో కాంగ్రెస్, తెరాస దొందు దొందేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటలకు,చేతలకు సంబంధం లేదని విమర్శించారు.
జాతీయ పార్టీలు విఫలమయ్యాయంటున్న కేసీఆర్ ఇరవై ఒక్క రాష్ట్రాల్లో బీజేపీ ఎలా అధికారంలోకి వచ్చిందో చెప్పాలన్నారు. నాలుగేళ్ల మోదీ పాలనలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి.. నలభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధమేనని పేర్కొన్నారు. కేంద్రంలో, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురువేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment