సాక్షి, సిద్దిపేట: రైతును రాజుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేటలో వారు రైతుబంధు పథకం చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ భూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులకు పాస్‌పుస్తకాలు అందచేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు.
హరీశ్‌రావు మాట్లాడుతూ.. అన్నదాతలు పండించిన ప్రతి గింజను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రం లో ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని కొద్ది రోజుల్లో గోదావరి, కృష్ణా జలాలతో చెరువులు నింపుతామని స్పష్టం చేశారు. పోచారం మాట్లాడుతూ.. రైతు అయిన కేసీఆర్ సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. రైతుకు కావాల్సిన ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, పండిన పంటకు మద్దతు ధర, పెట్టుబడి సహాయం అందించడం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యం అయిందని అన్నారు.
రైతులు సమావేశమయ్యేం దుకు ప్రతి గ్రామంలో రూ.12 లక్షలతో సమన్వయ సమితి భవన నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ ఏర్పాటే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం రైతుల సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, సుధాకర్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ్‌కు మతిమరుపు వ్యాధి
చిన్నకోడూరు(సిద్దిపేట): సీఎం కేసీఆర్‌ను జాక్‌పాట్ ముఖ్యమంత్రిగా అభివర్ణించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీల్డ్ కవర్లద్వారా పదవులు పొందే జాక్‌పాట్ నాయకులు కాంగ్రేస్ వాళ్లేనని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో గురువారం రాత్రి ఆయన రైతుబంధు చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. కేసీఆర్ ఉద్యమంలో పాల్గొనలేదని ఉత్తమ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు మతిమరుపు వ్యాధి వచ్చిందన్నారు.
ఆకట్టుకున్న పోచారం పిట్టకథ
కాంగ్రెస్ బస్సు యాత్రపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభలో చెప్పిన పిట్టకథ అందరినీ నవ్వించింది. గాంధీభవన్ నుంచి బయలుదేరిన 50 మంది కాంగ్రెస్ నాయకుల బృందంలో బస్సు యాత్ర సిద్దిపేటకు రాగానే మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేసే రైతుబంధు చెక్కులు తీసుకునేందుకు 10 మంది దిగిపోయారని, అక్కడి నుంచి సిరిసిల్లకు వెళ్లగానే మంత్రి కేటీఆర్ చెక్కులు పంచుతుండగా మరో పది మంది, తర్వాత కరీంనగర్‌లో ఈటల చెక్కుల పంపిణీ చూసిన మరో పది మంది, కామారెడ్డిలో మరో పదిమంది దిగిపోయారని, నిజామాబాద్ రాగానే డ్రైవర్ కూడా దిగిపోవడంతో బస్సు నడిపేవారు లేక ఉత్తమ్, జానాఒకరి ముఖం మరొకరు చూసుకోవాల్సి వచ్చింద న్నారు. ఇలా కాంగ్రెస్ వారంతా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment