సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం అమలు తీరుతెన్నులు, క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాలను ఏ రోజుకారోజు ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు ఆరా తీస్తున్నారు. నేరుగా లబ్ధి పొందుతున్న రైతుల మనోగతం ఏంటని సీఎం ఆసక్తిగా అడిగి తెలుసుకుంటున్నారు. కౌలు రైతులకు ఇవ్వాలని, పెద్ద భూస్వాములకు ఎక్కువగా లబ్ధి జరుగుతోందన్న ప్రతిపక్షాల విమర్శలపై, రైతుల అభిప్రాయాలపై ఆరా తీస్తున్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, క్షేత్రస్థాయిలో ఎక్కువగా సంబంధాలున్న సీనియర్ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులతో సమాచారం తెలుసుకుంటున్నారు. చెక్కులు, పాసుపుస్తకాలు అందుకున్న రైతులు చాలా ఆనందంగా ఉన్నారని ఎక్కువ మంది నుంచి సమాచారం అందుతోంది. అయితే రెవెన్యూ సిబ్బంది తప్పుల వల్ల అక్కడక్కడా ఇబ్బందులు తలెత్తుతున్న అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తెస్తున్నారు.
సమస్యలపై దృష్టి పెట్టాలని ఆదేశం
క్షేత్రస్థాయిలో వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పథకం అమలు తీరు, రైతుల స్పందనపై రాజకీయంగా సత్ఫలితాలు ఇస్తుందనే విశ్వాసంతో కేసీఆర్ ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment