శాంపిల్ సేకరిస్తున్న తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు వ్యవసాయాధికారులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణ వడివడిగా కొనసాగుతోంది. ఇప్పటికే ఉభయ గోదావరితో పాటు కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఆయా జిల్లాల్లోని 123 మండలాల పరిధిలోని 774 రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రూ.189.62 కోట్ల విలువైన 98 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించారు.
గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతులకు చెల్లింపు చేస్తున్నారు. ఈ–క్రాప్ ఆధారంగా పంట కొనుగోళ్లకు శ్రీకారం చుట్టడంతో క్షేత్రస్థాయిలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తడంలేదు. ఇప్పట వరకు 8,277 మంది రైతులు ధాన్యం విక్రయించగా 1,977 మందికి తొలిసారిగా ఆధార్ నంబర్ ద్వారా నగదు జమచేశారు. గతేడాది రూ.8,868 కోట్లతో 47.33 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రస్తుతం 50 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించారు.
నిబంధనలు సడలింపు కోరుతూ..
వర్షాల కారణంగా కోస్తాలోని కొన్ని మండలాల్లో కోతలు నిలిపివేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు వారాల కిందటే కోతలు ప్రారంభించాల్సి ఉండగా తుపాను హెచ్చరిక నేపథ్యంలో రైతులు సాహసించడంలేదు. ఇక రాయలసీమ జిల్లాల్లో అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. అయితే.. రైతులెవ్వరూ ఆందోళన చెందక్కర్లేదని.. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 17లోపు ఉంటేనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే.. వర్షాలతో కోతకొచ్చిన పంటతో పాటు కల్లాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. ఆర్బీకేల వద్ద శాంపిళ్లను పరీక్షిస్తే తేమ శాతం 23కు పైగా ఉంటోంది. దీంతో తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా నిబంధనలను సడలించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
84.60 లక్షల గోతాలు అందుబాటులో..
రైతులకు గిట్టబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం 13 జిల్లాల్లోని 6,884 ఆర్బీకేల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తోంది. తేమ శాతం పేరుతో మధ్యవర్తులు, దళారీల చేతుల్లో రైతులు మోసపోకుండా కల్లాల్లోనే నమూనాలు సేకరించి ఆర్బీకేల్లో పరిశీలించేలా ఏర్పాట్లుచేసింది. గ్రేడ్–ఏ రకం క్వింటాకు రూ.1,960, సాధారణ రకం క్వింటాకు రూ.1,940 అందిస్తోంది. అలాగే.. ఆధార్ అనుసంధానంతో ధాన్యం విక్రయించిన 72 గంటల నుంచి 21 రోజుల్లో చెల్లింపులు పూర్తిచేస్తోంది. రైతులకు ఒక్క రూపాయి ఖర్చులేకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మిల్లులకు తరలిస్తోంది. అలాగే, ధాన్యం రవాణాకు 84.60 లక్షల గోతాలు అందబాటులో ఉంచారు.
ఆధార్ నంబర్‌తో చెల్లింపులు
రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియలో తొలిసారిగా ఆధార్ నంబర్ ద్వారా చెల్లింపులు చేస్తున్నాం. రైతులపై భారం పడకుండా కల్లాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మిల్లులకు తరలిస్తోంది. అలాగే, భారీ వర్షాలవల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిబంధనలను సడలించాలని కేంద్రానికి లేఖరాశాం. రైతులు అధైర్యపడాల్సినఅవసరంలేదు.
– వీరపాండియన్, ఎండీ, ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్
హమాలీ ఖర్చులు వెంటనే ఇచ్చేశారు
నా పేరు గొలుగూరి ఈశ్వర్‌రెడ్డి. మాది తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామం. మా ఊరి ఆర్బీకేలో బుధవారమే 202.8 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించాను. అక్కడి సిబ్బంది కల్లం వద్దకు వచ్చి శాంపిళ్లు తీసుకున్నారు. వారే వాహనంలో ధాన్యాన్ని తరలించారు. లోడింగ్‌కు హమాలీలను నేను ఏర్పాటుచేసుకున్నా. ఆ ఖర్చును కూడా క్వింటాకు రూ.25 చొప్పున నాకు రూ.5వేల చెక్కును వెంటనే ఇచ్చేశారు. ఇక ధాన్యానికి రూ.3.93 లక్షలను 21 రోజుల్లోనే జమచేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment