మెరిసేనా..సేను మురిసేనా మోము! | Seed shortage for khariff | Sakshi
Sakshi News home page

మెరిసేనా..సేను మురిసేనా మోము!

Published Tue, May 30 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

మెరిసేనా..సేను  మురిసేనా మోము!

మెరిసేనా..సేను మురిసేనా మోము!

ఖరీఫ్‌ చుట్టూ కష్టాలే!
► రెండు రోజుల్లో సీజన్‌ మొదలు
► ఇప్పటికీ జాడలేని వరుణుడు
►  విత్తనానికి సిద్ధం కాని భూములు
►  వరుస కరువుతో పెట్టుబడుల కోసం అవస్థలు
► మొదలు కాని పంట రుణాల పంపిణీ
► దళారీల గుప్పిట్లో బ్యాంకులు
►  వేదిస్తున్న విత్తనాల కొరత


కర్నూలు(అగ్రికల్చర్‌) : వరుస కరువు రైతన్నను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కనికరం చూపాల్సిన ప్రభుత్వం కనీస జాలి చూపని పరిస్థితి నెలకొంది. పీకల్లోతు కష్టాల్లోని అన్నదాత ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సాగు సాఫీగా సాగడం ప్రశ్నార్థకం అవుతోంది. గత ఏడాది వర్షాలు జూన్, జూలై నెలల్లో మురిపించి.. ఆ తర్వాత ఉసూరుమనిపించడంతో రైతుల ఇంట కన్నీటి వరద పారింది. ఖరీఫ్‌ సాధారణ సాగు 6,36,403 హెక్టార్లు కాగా.. 16,18,950 మెట్రిక్‌ టన్నుల ఉత్పాదకతను సాధించాలని జిల్లా వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

ఒకవైపు విత్తనాల కొరత, మరోవైపు పెట్టుబడుల సమస్య.. ఇంకోవైపు ఖరీఫ్‌ ముంచుకొస్తున్నా వరుణుడి జాడ లేకపోవడం, ఇతరత్రా సమస్యలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మామూలుగా అయితే ఈ పాటికి భూములను ఖరీఫ్‌ సీజన్‌కు సిద్ధం చేసుకోవాల్సి ఉంది. జూన్‌ నెల ప్రారంభంతో ఖరీఫ్‌ మొదలవుతుంది. కానీ ఇంతవరకు వానలు లేకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మే నెల సాధారణ వర్షపాతం 38.5 మిల్లీమీటర్లు. ఈ మేరకు వర్షాలు పడితే రైతులు వేసవి దుక్కులు చేసుకొని జూన్‌ నెల ప్రారంభంతోనే విత్తన పనులు మొదలు పెడతారు.

అయితే ఇంతవరకు భూములను విత్తనానికి సిద్ధం చేసుకునేందుకు వీలుగా వర్షాలే పడకపోవడంతో ఖరీఫ్‌ గట్టెక్కేనా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మే నెల సాధారణ వర్షపాతం 38.5 మి.మీ., ఉండగా.. నెల ముగుస్తున్నా 26.4 మిల్లీమీటర్లకే పరిమితమైంది. అంటే సాధారణ వర్షపాతంలో 31 శాతం తక్కువ నమోదయింది. ఈ సమయానికి ఉష్ణోగ్రతలు తగ్గాల్సి ఉంది. కానీ అలాంటి పరిస్థితి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది మే నెల చివరి నుంచే వర్షాలు మొదలయ్యాయి. గత ఏడాది ముందస్తు వర్షాలతో ఖరీఫ్‌ ప్రారంభమైనా.. ఈ సారి వర్షాలు సకాలంలో కురుస్తాయో లేదోననే ఆందోళన వ్యక్తమవుతోంది. నైరుతి రుతుపవనాలు ఇంతవరకు రాష్ట్రంలోకి ప్రవేశించక పోవడమే తొలకరి జాప్యానికి కారణంగా తెలుస్తోంది. ఖరీఫ్‌ మరో మూడు రోజుల్లో ప్రారంభం అవుతుండగా రైతులు ఆకాశంతో పాటు బ్యాంకుల వైపు ఆశగా చూస్తున్నారు.

సమస్యగా మారిన పెట్టుబడులు
వరుస కరువుతో అల్లాడుతున్న రైతులకు ఖరీఫ్‌లో పెట్టుబడి పెద్ద సమస్యగా మారింది. రైతులు  బ్యాంకుల వైపు   చూస్తున్నా ఇప్పటి వరకు పంట రుణాల పంపిణీ ప్రక్రియను చేపట్టలేదు. కొన్ని బ్యాంకులు పంపిణీని చేపట్టినా రెన్యూవల్‌కు మాత్రమే పరిమితం అవుతున్నాయి. పంట రుణాల పంపిణీలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, ఎస్‌బీఐలదే ప్రధాన పాత్ర. అలాంటిది.. ఏపీజీబీలో దళారీలను ఆశ్రయిస్తే తప్ప పంట రుణాలు పొందలేని పరిస్థితి. కమీషన్ల మత్తులో బ్యాంకర్లు దళారీలను ఏర్పాటు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇకపోతే పంట రుణంగా ఇచ్చిన మొత్తంలో కూడా 25 శాతం డిపాజిట్‌ చేసుకుంటున్నారు. కమీషన్లు, డిపాజిట్లు పోతే రైతు చేతికొస్తున్నది అంతంత మాత్రమే కావడం గమనార్హం.

పొంచి ఉన్న విత్తనాల కొరత
ఖరీఫ్‌ సీజన్‌కు విత్తనాల కొరత పొంచి ఉంది. ప్రధానంగా పత్తి, వరి, వేరుశనగ సాగు చేస్తారు. అయితే అంచనా సాగుకు, కేటాయించిన విత్తనాలకు పొంతన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేరుశనగ విషయంలో అవసరమైన విత్తనంలో సగమే కేటాయించడం గమనార్హం. పత్తి విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ ఏడాది దాదాపు 3లక్షల హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉన్నా.. బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు 10.15 లక్షలు మాత్రమే కేటాయించారు. ఇవి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో బ్లాక్‌ మార్కెట్‌ అధికమైంది.

కొత్త రుణాలు ఇవ్వట్లేదు
గిట్టుబాటు ధర లేక గతేడాది సాగు చేసిన శనగ పంటనంతా ఇంట్లోనే ఉంచుకున్నా. ప్రస్తుతం పొలాల గుత్తలు కట్టేందుకు, పంటల సాగుకు అవసరమైన పెట్టుబడులు లేక ఇబ్బంది పడుతున్నా. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు పెరిగినాయి. బ్యాంకుల్లో కొత్త రుణాలు ఇవ్వడం లేదు. – తిప్పారెడ్డి, రైతు, కోడుమూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement