కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్ : తొలకరి పలకరించింది. వరుణుడు విరుచుకుపడ్డాడు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజామున మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు.. కుంటల్లో నీరు చేరింది. హొళగుంద, కోసిగి, కౌతాళం, చాగలమర్రి మండలాలు మినహా జిల్లాలోని 50 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. దాదాపు నాలుగు గంటల పాటు భారీ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు ప్రజలను బెంబేలెత్తించాయి. భారీ వర్షం అతలాకుతలం చేసింది. మద్దికెర మండలం బురుజులలో పిడుగుపాటుకు గడ్డివాము కాలిపోయింది.
దేవనకొండలో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. ప్యాపిలిలో అత్యధికంగా 10.4.2.. చాగలమర్రిలో అత్యల్పంగా ఒక మిల్లీమీటరు వర్షపాతం నమోదైంది. 20 మండలాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.1 మిల్లీమీటర్లు కాగా.. ఒక్క రోజులోనే జిల్లాలో సగటున 41.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. గత మూడేళ్లలో ఒకే రోజు ఇంత వర్షపాతం నమోదు కావడం మొదటిసారని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దేవనకొండ, మద్దికెర, గూడూరు, సి.బెళగల్, కోడుమూరు, క్రిష్ణగిరి, పత్తికొండ మండలాల్లో హంద్రీ నదికి వరద నీరు పోటెత్తింది. ప్రస్తుతం వ్యవసాయ పంటలు లేనందున రైతులకు నష్టం ముప్పు తప్పింది. అయితే ఒక్క మామిడి పంటకు మాత్రమే భారీ నష్టం వాటిళ్లింది.
ఖరీఫ్‌కు సన్నద్ధం
ఏకధాటిగా కురిసిన వర్షంతో రైతులు ఖరీఫ్ పనులకు సిద్ధమయ్యారు. ప్రధానంగా బీటీ పత్తి సాగు ఊపందుకుంది. కర్నూలు, నంద్యాల డివిజన్లలో విత్తన పనులు మొదలయ్యాయి. వ్యవసాయ పనులు ఊపందుకున్నా విత్తన పంపిణీ అతీగతీ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాకు 8.50 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లను అలాట్ చేసినా పలు కంపెనీల్లో ఇప్పటికీ పొజిషన్ చేయని పరిస్థితి. దీంతో వ్యాపారులు బ్లాక్‌లో విత్తనాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బీటీ-1 ప్యాకెట్ ధర రూ.830.. బీటీ-2 ప్యాకెట్ ధర రూ.930 కాగా.. వ్యాపారులు రూ.1000కు పైగా ధర వసూలు చేస్తున్నారు. వేరుశనగ 40 వేల క్వింటాళ్లు మంజూరు చేసినా ఇప్పటికీ పంపిణీ ఊసే కరువైంది. ఉద్యాన అధికారులు మాత్రమే 50 శాతం సబ్సిడీపై మిరప మినహా అన్ని రకాల కూరగాయల విత్తనాలను పంపిణీ చేస్తున్నారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న హగరి
హొళగుంద: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని మార్లమడికి గ్రామం వద్ద హగరి(వేదావతి) నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించనున్నాయి. హగరి ఎగువ భాగంలోని గుంతకల్లు, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నదిలో ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం హగరిలో 8 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది.
తొలకరి పులకింత
Published Wed, Jun 4 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement
Advertisement