
పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించదు. ప్రజలకు మంచి చేయడమే మా సంకల్పం. ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో నేను ఒకటే చెప్పా.. అయ్యా! మీరే బటన్ నొక్కండి.. నేరుగా మీరే నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు పంపించండి..! మేమే చేయా లని ఆరాట పడటం లేదు. క్రెడిట్ ఎవరికి వచ్చినా ఫర్వా లేదు. నాకు కావాల్సిందల్లా మంచి జరగాలి. ఇంతకన్నా నాకు వేరే అవసరం లేదని చెప్పా. – సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పోలవరం ప్రాజెక్టును 2025 ఖరీఫ్ కల్లా కచ్చితంగా పూర్తిచేసే పరిస్థితి వస్తుంది. 2025 జూలై, ఆగస్టులో 41.15 మీటర్ల పరిధిలో నీటిని నిల్వ చేసే పరిస్థితి కూడా ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టు, నిధులకు సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ వారికి అర్థమయ్యే రీతిలో చెప్పామన్నారు. ఇవన్నీ చేసిన నేపథ్యంలో వారిలో కొంత కదలిక వచ్చి సానుకూల వాతావరణంతో ధరలను రివైజ్ చేసి ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసేలా అడుగులు వేస్తున్నట్లు వివరించారు.
పోలవరం ముంపు ప్రాంతం కాంటూరు లెవల్ 41.15 మీటర్ల పరిధిలో ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఎన్నికలకు ముందే ఆరేడు నెలల్లోగా నష్టపరిహారం అందుతుందన్న నమ్మకం ఉందని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం అల్లూరి సీతారామ రాజు, ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ బాధితులను స్వయంగా కలుసుకుని క్షేత్రస్థాయిలో అమలైన సహాయ చర్యలను పరిశీలించారు. కూనవరం, గొమ్ముగూడెంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే..
బుద్ధి లేకుండా బాబు సంతకాలు..
పోలవరం డ్యామ్‌ను మూడు సంవత్సరాల్లో మూడు దశల్లో పూర్తిగా నింపుతారు. అందులో మొదటి స్టేజ్.. మొదటి ఏడాది 41.15 మీటర్ల వరకు నింపుతారు. దశలవారీగా నింపడం ద్వారా ఒక్కో దశలో ఏవైనా లీకేజీలు ఉంటే వాటికి మరమ్మతులు చేసే అవకాశం ఉంటుంది. మూడు సంవత్సరాల్లో మూడు ఫేజ్‌ల్లో డ్యామ్‌ను నింపాలని సీడబ్ల్యూసీ నిబంధనల్లో ఉంది. 41.15 మీటర్ల వరకు నింపితే కటాఫ్ అయిపోయే గ్రామాలు ఇంకా ఉంటాయి. వాటిని ఫస్ట్ ఫేజ్‌లోకి తేకుంటే ఆ ఊళ్లకు వెళ్లటానికి ఇబ్బంది అవుతుంది.
అందుకనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లైడార్ సర్వే నిర్వహించి 32 గ్రామాల్లో 48 హ్యాబిటేషన్లను (ఆవాస ప్రాంతాలు) మళ్లీ యాడ్ చేయించాం. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం కిందా మీదా పడుతున్నాం. మన ఖర్మకొద్దీ ఇదంతా ఎందుకు మొదలైందంటే గత ప్రభుత్వం 2013–2014 రేట్లతోనే పోలవరాన్ని పూర్తి చేస్తామని అండర్ టేకింగ్ ఇచ్చింది.
దీంతో అంతకంటే ఎక్కువ డబ్బులివ్వమని, నాటి మీ ముఖ్యమంత్రే ఇందుకు ఒప్పుకుని సంతకం చేశారని కేంద్ర ప్రభుత్వం మొండికేసింది. నేను నేరుగా ప్రధాని, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి వారికి అన్ని రకాలుగా నచ్చచెప్పా. 2013–14 రేట్ల ప్రకారం ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఎలా సాధ్యం?
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కూడా మారిపోతాయి. గత ప్రభుత్వంలో చంద్రబాబు బుద్ధి లేకుండా సంతకం చేశాడు గానీ మీరైనా ఆలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యక్రమం చేశా. శ్రీశైలం ప్రాజెక్టు ఎంతతో స్టార్ట్ చేశారు? ఎంతతో పూర్తైంది?
ఈ నెలాఖరు కల్లా శుభవార్త!
ఇవన్నీ వివరించిన తరువాత వారిలో (కేంద్రం) కొంత కదలిక వచ్చింది. సానుకూల వాతావరణం వచ్చింది. ఇప్పుడు ఉన్న రేట్లకు మళ్లీ రివైజ్ చేసి ప్రాజెక్టును పూర్తిచేసేలా అడుగులు వేశాం. ఇది జరగాలంటే కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సి ఉంది. దీనికోసం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎస్టిమేట్స్ తయారు చేసి సెంట్రల్ వాటర్ కమిషన్‌కు ఇప్పటికే పంపించింది. వాళ్లు మరో వారంలో అప్రూవల్ ఇస్తారు.
ఆ తర్వాత జల్‌శక్తి శాఖ వద్దకు వస్తుంది. అనంతరం కేబినెట్‌లో పెడుతుంది. దేవుడు ఆశీర్వదిస్తే నాకు తెలిసి బహుశా ఈ నెలాఖరు కల్లా కేబినెట్‌కు ఇది వచ్చే కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే పోలవరం తొలి ప్రాధాన్యతా పనుల కోసం రూ.17 వేల కోట్లు మనకు ఇచ్చేందుకు ఆమోదం లభిస్తుంది. దీనివల్ల అత్యంత ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయి.
డ్యామ్ పూర్తి హైట్‌కు కంప్లీట్ అవుతుంది. 41.15 మీటర్ల వరకు నీళ్లు నింపేందుకు ఆర్ అండ్ ఆర్ పూర్తిగా అందుతుంది. లైడార్ సర్వే ద్వారా గుర్తించిన 48 ఆవాస ప్రాంతాలను కూడా మొదటి పునరావాస ప్రాధాన్యత కింద ఆమోదించాలని కోరాం. దాని తర్వాత రెండో ఏడాది సెకండ్ ఫేజ్, అనంతరం మూడో ఏడాది మూడో దశ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కడుతోంది కాబ ట్టి! బహుశా జగనే కడితే మొదట మీకు (నిర్వా సితులకు) ఇచ్చి తర్వాత ప్రాజెక్టు గురించి ఆలోచన చేసేవాడినేమో! కేంద్ర ప్రభుత్వం డబ్బు లు ఇస్తోంది కాబట్టి ఫేజ్ ప్రకారం జరగాల్సిందే.
20 వేల కుటుంబాల తరలింపు!
నేను కూడా అనుకున్నంత వేగంగా చేయలేక పోయిన పని ఒకటి ఉంది. అది పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ఇప్పించడం. అది నా చేతుల్లో ఉండే పని కాకపోవడంతో కష్టపడాల్సి వస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ మీద ఆధార పడాల్సి వస్తోంది. వాళ్ల మీద ఒత్తిడి తెస్తూ అడుగులు ముందుకు వేస్తున్నా. ఏదైనా టైమ్ రావాలి. ఇవన్నీ జరిగేదాకా వారు డబ్బులివ్వరు. డబ్బులు ఇవ్వకపోతే పని జరగదు. పని జరగకపోతే, డబ్బులు ఇవ్వకపోతే మనం కూడా ఇవ్వలేం.
ఈ వాస్తవాన్ని కూడా మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరు కల్లా కేంద్ర కేబినెట్ ఆమోదం లభించి రూ.17 వేల కోట్లకు అప్రూవల్ వస్తే 41.15 మీటర్లకు, 48 హ్యాబిటేషన్లకు సంబంధించి రూ.5,200 కోట్లు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తాం. గట్టిగా ఒత్తిడి తెచ్చి వచ్చే జనవరికల్లా ఆర్ అండ్ ఆర్ పూర్తయ్యేలా చూస్తాం.
మన ప్రభుత్వం రాక ముందు కేవలం 3 వేల కుటుంబాలను మాత్రమే తరలించారు. గత నాలుగేళ్లలో ఇప్పటికే 12 వేల కుటుంబాలను షిఫ్ట్ చేశాం. మరో 8 వేల కుటుంబాలను అంటే మొత్తంగా 20 వేల కుటుంబాలను తరలిస్తున్నాం. తరలించాల్సిన 8 వేల కుటుంబాల కోసం రూ.800 కోట్లు డబ్బులు అవసరం. మనమే కిందమీద పడి ఎలాగో చేసేస్తాం. బహుశా ఈ నెలాఖరుకో లేకపోతే వచ్చే నెలకల్లా పూర్తి చేస్తాం.
కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, ఎంపీ కోటగిరి శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ప్రజాప్రతినిధులు , అధికారులు పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో వరద బాధితులతో సీఎం
వారికి మిగతా రూ.3.5 లక్షలు ఇస్తాం
పోలవరం ప్రాజెక్టుకు తొలుత నాన్న (వైఎస్సార్) హయాంలో భూసేకరణ జరిగినప్పుడు రూ.లక్ష, రూ.లక్షన్నరకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి నేను రూ.5 లక్షలు ఇస్తానని చెప్పా. ఆ మిగిలిన రూ.3.5 లక్షలు కచ్చితంగా ఇస్తాం. మీ బిడ్డ వల్ల నష్టపోయామనే మాట ఎక్కడా వినప డదని చెబుతున్నా. మీ బిడ్డ మంచే చేస్తాడు. చెడు మాత్రం ఎప్పుడూ చేయడని గుర్తు పెట్టుకోండి.
కేంద్రం రూ.6.8 లక్షలకు తోడు రాష్ట్రం రూ.3.2 లక్షల ప్యాకేజీ
ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6.8 లక్షల ప్యాకేజీకి తోడు రూ.3.2 లక్షల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనమే ఇస్తాం. ఇప్పటికే జీవో జారీ చేశాం. దీనికి మీ బిడ్డ కట్టుబడి ఉన్నాడని తెలియజేస్తున్నా. దేవుడు ఆశీర్వదిస్తే కేంద్రం నుంచి జరగాల్సిన మంచి ఆరేడు నెలల్లోనే జరుగుతుందన్న నమ్మకం ఉంది. మీ బిడ్డ మీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాడు.
బాబు ఘోర తప్పిదాలు
గత ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదం స్పిల్‌వే కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టారు. మొదట స్పిల్‌వే పూర్తి చేసి నీళ్లు డైవర్ట్ చేసి ఆ తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి. కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత డయాఫ్రం వాల్ తర్వాత వెనకాల కట్టాలి. అలా చేస్తే డ్యామేజ్ అనేది జరగదు. మన ఖర్మ కొద్దీ ఆ రోజుల్లో కేవలం కాంట్రాక్టర్లకు మంచి చేయడం కోసమే పనులు చేపట్టి ప్లానింగ్ లేకుండా ఇష్టమొచ్చినట్లు చేశారు.
స్పిల్‌వే పనులు అసంపూర్తిగా వదిలేశారు. కాబట్టే నీళ్లు అటువైపు నుంచి డైవర్ట్ చేయలేకపోయారు. నీళ్లు డైవర్ట్ చేయలేకపోయారు. కాబట్టి అటువైపు పంపించలేకపోయారు. పైగా అది పూర్తి కాకుండానే మధ్యలో కాఫర్ డ్యామ్ మొదలు పెట్టారు. వరదలకు డయాఫ్రం వాల్ కోతకు గురైంది.
కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తాం
ఇప్పుడు నిపుణులు అధ్యయనం చేసిన తర్వాత కొత్త డయాఫ్రం వాల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా మనం కాఫర్‌డ్యాంలు పూర్తిచేశాం. స్పిల్‌వే పూర్తిచేసి దానిమీదుగా నీళ్లు పంపిస్తున్నాం. ఇవన్నీ మనం చేయగలిగాం. గత సర్కారు నిర్వాకాల కారణంగా ప్రాజెక్టు మనం అనుకున్నంత స్పీడ్‌లో ముందుకు వెళ్లలేకపోయింది. వీటన్నింటినీ అధిగమించి ఇప్పుడు దేవుడి దయ వల్ల గాడిలో పడింది. 2025 ఖరీఫ్‌కల్లా కచ్చితంగా పోలవరం పూర్తి చేసి నీళ్లు నిల్వ చేసే పరిస్థితి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment