సాక్షిప్రతినిధి, నల్లగొండ : రైతుకు పెట్టుబడి పథకంపై ప్రభుత్వం కసరత్తులో మునిగింది. వచ్చే ఖరీఫ్‌నుంచి ఎకరాకు రూ.4 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో గ్రామాల వారీగా రైతుల జాబితాను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. రైతు పెట్టుబడి పథకం, పండించిన పంటలకు మద్దతు ధర, విత్తనాలు, ఎరువులు ఇలా వ్యవసాయ ఆధారిత ప్రభుత్వ పథకాలపై వచ్చే ఖరీఫ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సమీక్షల మీద సమీక్షలతో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగానే రైతులకు సహకారం అందించడంలో గ్రామాల్లోని రైతు సమన్వయ సమితులు, అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్లేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. జిల్లాలో 561 రెవె న్యూ గ్రామాల్లో ఇప్పటివరకు రైతు సమన్వయ సమితులు ఏర్పడ్డాయి. ఎప్పుడో సమన్వయ సమితులు ఏర్పడినా ఇప్పటివరకు బాధ్యతలు అప్పగించలేదు. దీంతో గ్రామస్థాయిలో సమన్వయ సమి తుల బాధ్యులు మాత్రం .. ఎప్పు డు ‘సమన్వయం’అంటూ నైరాశ్యంలో ఉన్నారు.
గ్రామస్థాయి సమితుల ఏర్పాటుతోనే బ్రేక్
భూ ప్రక్షాళన నుంచే రైతు సమన్వయ సమితులు కీలకం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించినా చాలా గ్రామాల్లో ఈ కమిటీలు నామమాత్రంగా మారాయి. రాష్ట్రస్థాయిలో చైర్మన్ నియామకం కాకపోవడం, విధివిధానాలు ఖరారు కాకపోవడంతో గ్రామస్థాయి సమితుల ఏర్పాటుతోనే వీటి కి బ్రేక్ పడింది. గ్రామస్థాయిలో చైర్మన్లను ఎన్నుకోవడంతోపాటు మండల, జిల్లా స్థాయిలో సభ్యులు, చైర్మన్లను నియమించాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల నుంచి చివరకు రాష్ట్రస్థాయి చైర్మన్ ఎంపిక జరగనుంది. గ్రామస్థాయి చైర్మన్ల ఎంపికతోనే ఈ ప్రక్రియను సరిపెట్టారు. ఇన్నిరోజుల నిలిచిపోయిన రైతు సమన్వయ సమితుల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పుడు పూర్తి చేయాలని భవిస్తోంది. వచ్చే ఖరీఫ్ నుంచి పెట్టుబడి పథకం అమలు చేస్తుండడం, రానున్న ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులు తదితర వ్యవసాయ ఆధారిత ప్రభుత్వ పథకాల్లో గ్రామ స్థాయి సమితులకు కీలకం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
పెట్టుబడి పథకం రైతులకు సరిగ్గా అందుతుందా..? లేదా..? అన్నది పరిశీలించడానికి అధికారులతో పాటు ఈ సమితుల బాధ్యులకు కూడా పరిశీ లించే బాధ్యతలను అప్పగించనుంది. జిల్లాలో మొత్తం 563 రెవెన్యూ గ్రామాలుంటే 561 గ్రామాలకు అధికారికంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో వీరు భూ ప్రక్షాళనలో క్రియాశీలకంగా పాల్గొనలేదు. ప్రభుత్వంనుంచి ఈ సమితులకు సంబంధించి జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ప్రభుత్వ దూకుడు చూసి సమన్వయ బాధ్యతలు ఇకనైనా ఉంటా యా..? అని గ్రామాల్లో ఎంపికైన సమన్వయ సమితుల చైర్మన్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఆశావహుల ఎదురుచూపు ..
గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు మరోవైపు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేద్దామనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రైతు సమన్వయ సమితి చైర్మన్లుగా ఎంపికైనవారు.. ప్రభుత్వం బాధ్యతలు ఇస్తే సర్పంచ్ ఎన్నికల పోటీ బరినుంచి తప్పుకోవాలనుకుంటున్నారు. ఇక అధికార పార్టీ మండలస్థాయి నేతలు మాత్రం మండల సమితి చైర్మన్ల కోసం పోటీ పడుతున్నారు. జిలాస్థాయి చైర్మన్లపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకున్నా ఈ పదవికి కూడా ఆ పార్టీలోని నేతలు సై అంటున్నారు. ఎవరికివారు తమకు ఈ పదవులు కావాలని ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యేలకు చెప్పారు. రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ ఏర్పడడం, దీనికి నిధులు కూడా భారీ ఎత్తున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో మండల, జిల్లాస్థాయి చైర్మన్ పదవులకు ఆశావహుల జాబితా పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment