నష్టాల సాగుఈ ఏడాది రైతులకు కలిసి రాలేదు
ఖరీఫ్‌లో సాగు అధికం..నష్టాలూ భారీగానే
సాధారణ సాగు విస్తీర్ణం 4,93,181 హెక్టార్లు
సాగైన విస్తీర్ణం 5,50,826 హెక్టార్లు
(సకాలంలో వర్షాలు కురవక పత్తి దిగుబడి
గణనీయంగా తగ్గింది. వరికి దోమపోటుతో నష్టం వాటిల్లింది)
రబీ..రందీ
సాధారణ సాగు విస్తీర్ణం 1,96,740 హెక్టార్లు
ఇప్పటి వరకు సాగైంది 16,901 హెక్టార్లు
( సాగర్ ఎడమ కాలువకు ఆరుతడికి మాత్రమే వారబందీ పద్ధతిలో సాగునీటిని విడుదల చేస్తామని ప్రకటించడం, విద్యుత్‌ను ఆరు గంటలకు మించి ఇవ్వలేమని చెప్పడంతో రబీసాగు బాగాతగ్గింది.)
వరికి మద్దతు ధర ఇలా..
ఇవ్వాల్సింది రూ.1400 (క్వింటాకు)
ఇచ్చింది రూ.1300
(అధికశాతం దళారులు కొనుగోలు చేసి నిలువునా ముంచారు)
కరుణించని వరుణుడు..అడుగంటిన భూ గర్భజలాలు, విద్యుత్ కోతలు...అన్నింటినీ అధిగమించి సాగు చేసినా పంటలు చేతికందక రైతులు కుదేలయ్యారు. వీటికి తోడు దళారుల బెడద, కానరాని మద్దతు ధర..రైతును మరింత కుంగదీసింది. వరుస నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు చేసేదిలేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ఏడాది రైతన్న ఒడిదుడుకులపై సింహావలోకనం..
అన్నదాతకు ఈ ఏడాది వ్యవసాయం అచ్చిరాలేదు. కాలం కలిసిరాక ఒడిదుడకుల మధ్యన సాగు చేసిన పంటలు చేతికందక రైతన్న కుదేలయ్యాడు. వరుణుడు కరిణించక.. అడిగంటిన భూగర్భజాలలకు తోడు విద్యుత్ కోతలు తోడవ్వడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. బ్యాంకర్లు అప్పులివ్వకపోవడంతో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించిన అన్నదాత మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కష్టాలు తీరుతాయనకున్న రైతన్న కలలు కలగానే మిగిలాయి. పెట్టిన పెట్టుబడులు చేతికి రాక చేసిన అప్పులు తీరక అప్పులబాధలను తట్టుకోలేక జిల్లా వ్యాప్తంగా సుమారు 60 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పండించిన పంటకు మద్దతు ధర అందక, ప్రభుత్వ సంస్థలు సరిగ్గా కొనుగోళ్లు జరపక దళారుల చేతుల్లో దారుణంగా మోసపోయిన రైతాంగం ఈ ఏడాది కష్టాల మధ్యే సాగును చేపట్టారు. -నల్లగొండ అగ్రికల్చర్
కష్టాలు మిగిల్చిన ఖరీఫ్
కరువు, భూగర్భజలాలు అడుగంటి పోవడంతో పాటు ఎడాపెడా విద్యుత్ కోత, లోఓల్టేజీ సమస్యలను అధిగమించి రైతులు ఖరీఫ్‌లో పంటలు సాగు సాగుచేశారు. ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 4,93,181 హెక్టార్లు కాగా 5,50,826 హెక్టార్లలో వివిధ రకాల పంటలను సాగు చేశారు. అయితే ఖరీఫ్‌లో రైతులు వరి సాగు తగ్గించి పత్తి పంట సాగుపై మక్కువ చూపారు. వరి 1,71,136 హెక్టార్లలో సాగు చేయగా పత్తి 3లక్షల 32 వేల 200 హెక్టార్లలో సాగు చేయడం విశేషం. అయితే సకాలంలో వర్షాలు కురవక పోవడంతో పత్తి దిగుబడి గణనీయంగా పడిపోయింది. వరికి దోమకాటు సోకి వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నాన్‌ఆయకట్టు ప్రాంతాల్లో విద్యుత్ కోతల కారణంగా వరి చేలు ఎండిపోయి రైతులు కోట్లలో నష్టపోయారు. దీంతో అన్నదాతలకు అప్పులే చేతికివచ్చాయి.
ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీలో జాప్యం
2011 ఏప్రిల్ నుంచి గత ఖరీఫ్ వరకు జరిగిన పంటల నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీలో తీవ్ర జాప్య ం జరుతుంది. రూ.75.85 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినా ఇప్పటి వరకు కేవలం 53.77కోట్లను మాత్రమే పంపిణీ చేశారు. మిగతా రూ.10.94 కోట్లు వివిధ కారణాల కారణంగా రైతుల ఖాతాల్లో జమకాకుండా బ్యాంకుల్లోనే మూలుగుతున్నాయి. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం, బ్యాంకర్లు జీరో బ్యాలెన్స్ ఖాతాలను రైతులకు ఇవ్వకుండా పట్టించుకోవకపోవడం, రైతు ఖాతా నెంబర్లు సక్రమంగా లేవంటూ జాప్యం చేయడం వలన నష్టపోయిన రైతులకు శాపంగా మారింది.
మద్దతు ధరకు మంగళం
రైతులు అష్టకష్టాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. వరి క్వింటాల్‌కు రూ.1400లు మద్దతు ధరను ప్రకటించినప్పటికీ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తేమ శాతం ఎక్కువగా ఉందని సాకుగా చూపి రూ.1300లకు మించి కొనుగోలు చేయలేదు. అదే విధంగా గ్రామాల్లో దళారులు, మిల్లర్లు కూడా తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులు నిలువునా ముంచినా అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదు.
పడిపోయిన రబీ సాగు
జిల్లాలో రబీ సాగు పూర్తిగా పడిపోయింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఆరుతడికి మాత్రమే వారబందీ పద్ధతిలో సాగు నీటిని విడుదల చేస్తామని ప్రకటించడం తోడు విద్యుత్‌ను ఆరు గంటలకు మించి ఇవ్వమని చెప్పడంతో రబీసాగు బాగా తగ్గింది. కేవలం నాన్‌ఆయకట్టు ప్రాంతంలో మాత్రమే బోరు బావుల కింద రైతులు వరి సాగు చేస్తున్నారు. ఆయకట్టుతో పాటు నాన్‌ఆయకట్టు ప్రాంతాల్లో ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ సూచిస్తున్నప్పటికీ ఆరుతడి పంటలను సాగు చేయడానికి రైతులు ముందుకు రాని పరిస్థితి. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 1,96,740 హెక్టార్లకు గాను ఇప్పటి వరకు కేవలం 16 వేల 901 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 1,60,188 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు కేవలం 3578 హెక్టార్లలో సాగు చేశారు. సాగర్ ఆయకట్టులో సుమారు 50 వేల హెక్టార్లు వరిసాగుకు నోచుకోని పరిస్థితి. నాన్ ఆయకట్టు ప్రాంతంలో కూడా కరువు, విద్యుత్ కోతలతో పాటు అడుగంటిన భూగర్భజలాలను దృష్టిలో ఉంచుకుని రైతులు సాగుపై అనాసక్తిని చూపుతున్నారు.
రుణమాఫీ అపహాస్యం
జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం సుమారు 5లక్షల 24 వేల మంది రైతులు రూ.2532 కోట్ల మరకు పంట రుణాలను తీసుకున్నారు . ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు తాము తీసుకున్న రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించలేదు. తీరా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకం కింద 25శాతం మాత్రమే చెల్లిస్తున్నట్లు ప్రకటించి జిల్లాకు రూ.633 కోట్లను విడుదల చేయడం, దానికి వివిధ రకాల కొర్రీలను పెట్టడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది.
ఉసురు తీసుకున్న అన్నదాతలు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రైతుల ఆత్మహత్యలు జి ల్లా లో పెద్ద ఎత్తున నమోదయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవి ర్భావం తర్వాత దాదాపు 60మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. కరువు, పంటల సాగులో ఎదురవుతున్న కష్టాలకు తో డు కరెంటు కోతలు అన్నదాతల ఉసురు తీసుకున్నాయి. చాలా చోట్ల ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కూడా తగులబెట్టిన పరిస్థితులు హృదయాలను కదిలించాయి. పంట చూసి గుండెపగిలి కొందరు, మనోవేదనతో గుండెపోటుకు గురై, పురుగుల మందు తాగి మరికొందరు తనువు చాలించిన సంఘటనలు జిల్లాలో చెరగని చేదు గు రుతులుగా మిగిలిపోనున్నాయి. వీరి విషయంలో ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిం చాల్సి ఉందని, చిన్నచిన్న సాకులు చూపి వీరివి ఆత్మహత్యలు కావనేవిధంగా చిత్రీకరించడం భావ్యం కాదనే అభిప్రాయం రైతు వర్గాలు, రైతుసంఘాల నేతల్లో వ్యక్తమవుతోంది.
మొండిచేయి చూపిన బ్యాంకర్లు
రైతులకు, కౌలు రౌతులకు ఖరీఫ్‌లో పంట రుణాలను అందించడంలో బ్యాంకర్లు మొండిచేయి చూపారు. ఖరీఫ్‌లో రూ.1226 కోట్ల లక్ష్యంకు గాను కేవలం రూ.1000కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చా రు. రబీ లక్ష్యం రూ. 500 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.440 మాత్రమే చెల్లించారు.
కరువు మండలాలు
ప్రతిపాదనలకే పరిమితం
ఖరీఫ్‌లో ఏర్పడిని తీవ్ర దుర్భిక్ష పరిస్థితులకు తోడు వర్షపాతం నమోదు ఆధారంగా జిల్లాలోని 59 మండలాలను కరువు మండలాలుగా గుర్తించి జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటి వరకు ప్రతిపాదనలకే పరిమితమైన కరువు మండలాలకు ఎలాంటి సహకారాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు.
పెరిగిన ఎరువుల ధరలు
ఎరువుల ధరలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేయడంతో ఎరువుల కంపనీలు ఎరువుల ధరలు ఇష్టానుసారంగా పెంచి రైతన్నల నడ్డి విరిచాయి. డీఏపీ బస్తాపై ఒక్కో కంపెనీ రూ. 300ల వరకు పెంచాయి. అదే విధంగా కాంప్లెక్స్ ఎరువులు బస్తాపై రూ.450 వరకు, ఎంఓపీ బస్తాపై రూ.288వరకు ధరలను పెంచి రైతులపై మోయలేని భారం మొపాయి.