‘కాడి’ కన్నీరు!
ఈ‘సారీ’ రబీ అరకొరే.. అన్నదాతల ఆశలు గల్లంతు బావులు, బోర్లే ఆధారం
వరంగల్ : రైతులను రబీ కన్నీరు పెట్టిస్తోంది. అరకొరే సాగవడంతో దిగాలు చెందుతున్నారు. సేద్యానికి సెలవు పలకడానికి సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ కలిసిరాక పోవడంతో రబీపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. డిసెంబర్ సగం ముగిసినప్పటికీ అనుకూల పరిస్థితులు లేక పోవడంతో అవస్థలు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటడం, కరెంటు కోతలు, రుణాలు అందకపోవడం వంటి కారణాలతో గిట్టుబాటు కాదని సేద్యానికి ఎగనామం పెడుతున్నారు. ఇప్పటివరకు భూగర్భజలాలపై ఆధారపడి మాత్రమే పంటలు వేశారు. ఇందులో ప్రధానంగా ఆరుతడి పంటలకే ప్రాధాన్యత నిచ్చారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 28 శాతం పంటలు సాగయ్యూరుు. ఈ సీజన్ నిరాశజనకంగా ముగిసేట్టుగా కనిపిస్తోంది. ఈ రబీ సాగు తగ్గి, దిగుబడి పడిపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆహార ధాన్యాల దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉంది.
నిండని చెరువులు.. సాగని సాగు..
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు సాగుకు అడ్డంకిగా మారాయి. ఖరీఫ్‌లో వర్షాలు లేక పోవడంతోపాటు రబీ కూడా ఇదే దారిలో సాగుతోంది. ఈ సీజన్‌లో హుదూద్ తుపాన్ ప్రభావంతో రెండు రోజులపాటు కురిసిన చిన్నపాటి వర్షాలు తప్ప ఈశాన్య రుతుపవనాలు రైతులను కరుణించకపోవడంతో పంట ల సాగు ఆశించిన స్థాయిలో లేదు. చెరువులు, కుంటలు, బోర్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. అయినా కరెంట్ కోతలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వేళాపాళాలేని కరెంట్ కటకటతో రైతులు పంటలను సాగు చేయాలంటే జంకుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటే రబీ సాగు తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఖరీఫ్‌లో కష్టాలపాలైన రైతులు రబీసాగు చేపట్టాలంటే భయపడుతున్నారు.
ఆరు తడిపంటలు మేలు : జేడీఏ రామారావు
నీటి లభ్యత తగినంత లేనందున రైతులు ఆరుతడి పంటలు వేయాలి. తొందరపడి వరి సాగు వల్ల రైతులు ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది.కరెంట్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. భూగర్భజలాలపై ఆధారపడి సాగు చేస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కజొన్న, జొన్న, అపరాల సాగు వల్ల రైతుకు నష్టం వాటిల్లకుండా ఉంటుంది.