మెతుకుసీమ రైతులపై కాలం కక్షగట్టింది. కాలం కలిసిరాక ఖరీఫ్‌లో తీవ్ర నష్టాలు చవిచూసిన రైతన్నలు రబీపై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే వర్షాభావం, కరెంటు కోతలు, భూగర్భ జలమట్టాలు తగ్గిపోవడం రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. దీంతో రబీలో 1.30 లక్షల సాధారణ విస్తీర్ణానికిగాను రైతులు ఇప్పటి వరకు కేవలం 27,510 హెక్టార్లలోనే పంటలు వేయగలిగారు. సాధారణ వర్షపాతం కంటే ఈసారి -45 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలమట్టాలు 15.57 మీటర్ల మేరకు పడిపోయాయి. వర్షాల జాడ లేకపోవటంతో సుమారు 75 శాతం మేర భూముల్లో రైతులు పంటలు వేయలేకపోయారు.
సాక్షి, సంగారెడ్డి: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జిలాల్లో రబీ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. అందులోనూ శనగ, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న తదితర పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. అక్కడక్కడా శనగ, పొద్దుతిరుగుడు, జొన్న, మొక్కజొన్న తదితర ఆరుతడిపంటలను రైతులు సాగు చేసినప్పటికీ వర్షాభావం ఈ పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుంది. వర్షాభావానికితోడు వా తావరణంలో తేమ శాతం తగ్గటం కూడా శనగపంట దిగుబడి తగ్గేందుకు కారణమవుతోందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
బోర్లకిందా పంటలేయని రైతులు!
ఈ రబీలో బోరుబావుల కింద సైతం పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. కరెంట కోతలు, ప్రభుత్వం హెచ్చరికలతో రైతులు వరి సాగు చేయలేదు. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 47,823 హెక్టార్లుండగా, రైతులు ఇప్పటి వరకు కేవలం 295 హెక్టార్లలో మాత్రమే వరి సాగు చేశారు. బోరుబావులున్న రైతులు కూడా వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటలు వేసుకున్నారు. కరెంటు కోతలు, భూగర్భ జలమట్టాలు పడిపోవటంతో ఆరుతడి పంటలకు కూడా పూర్తిస్థాయిలో సాగునీరు పెట్టలేని పరిస్థితి నెలకొంది.
అడపా దడపా వర్షాలు కురిస్తేనే ఆరుతడి పంటలకు, బోరుబావుల కింద సాగులో ఉన్న పంటలకు మేలు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వానల జాడ కానరాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వాతావరణ మార్పులతో వర్షాలు కురిస్తే రైతులు పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు వేసుకునేందుకు కొంత అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
భారీగా తగ్గిన విస్తీర్ణం
వర్షాభావం కారణంగా రబీలో పంటల సాగు భారీగా తగ్గింది. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1,30.962 హెక్టార్లు ఉండగా, రైతులు ఇప్పటి వరకు 27,510 హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. గత రబీ సీజన్‌లో రైతులు 1,27, 868 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. గత ఏడాదితో పోల్చిచూస్తే లక్ష ఎకరాల మేర సాగు విస్తీర్ణం తగ్గింది. రబీలో రైతులు ఎక్కువగా శనగ, జొన్న, మొక్కజొన్న పంటలు సాగు చేసేవారు. కాగా ఈ దఫా రబీలో 31,313 హెక్టార్ల మేర శనగ పంట సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 11,376 హెక్టార్లలో శనగ పంట సాగైంది.
అలాగే 12 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటకుగాను 6 వేల ఎకరాల్లోనే పంట సాగులో ఉంది. ఇక జొన్న 13,251 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా, 2,701 హెక్టార్లలో మాత్రమే రైతులు సాగు చేస్తున్నారు. 9 వేల హెక్టార్లలో పొద్దుతిరుగుడు పంటలు సాగుకావాల్సి ఉండగా, వర్షాభావ పరిస్థితుల్లో రైతులు 2,618 హెక్టార్లలోనే సాగు చేస్తున్నారు. ఇలా ప్రధాన పంటలతోపాటు ఉల్లి, గోధుమ, మిర్చి, పప్పుధాన్యాల పంటల సాగు విస్తీర్ణం కూడా జిల్లాలో గణనీయంగా తగ్గింది.
ఆశలన్నీ కరువు ప్రకటనపైనే
ఇప్పటికే ఖరీఫ్‌లో తీవ్ర నష్టాలు చవి చూసిన రైతులు రబీలోనే బయటపడదామనుకున్నారు. కానీ కరెంటుకోతలు, వర్షాభావంతో రబీలోనూ నష్టాలే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రభుత్వ కరువు ప్రకటనపైనే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు కరువు మండలాల ప్రకటనకు సంబంధించి అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందజేసినా, ఇంత వరకు ప్రకటన వెలువడలేదు. ఇకనైనా ప్రభుత్వం జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
రబీ..రంది
Published Sun, Dec 21 2014 10:26 PM | Last Updated on Mon, Oct 1 2018 4:26 PM
Advertisement
Advertisement