నల్ల మట్టికి భళే డిమాండ్
పంటపొలాల్లో వేయిస్తున్న రైతులు
భూసారం పెంపునకు దోహదం
మోర్తాడ్ (బాల్కొండ) : జొన్నకోతలు పూర్తయ్యాయి. ఆ భూముల్లో ఖరీఫ్‌లో పసుపు విత్తేందుకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దుక్కి దున్నడం పూర్తిగా, ఆయా భూముల్లో భూసారం పెంచేందుకు నల్లమట్టి వేస్తున్నారు. దీంతో నల్లమట్టికి భారీగా డిమాండ్ ఏర్పడింది. రబీలో సాగు చేసిన ఎర్రజొన్న, మొక్కజొన్న కోతలు పూర్తి కావడంతో రైతులు ఆయా భూముల్లో నల్లమట్టి వేయిస్తున్నారు. వాణిజ్య పంటలను ఎక్కువగా పండించే మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి, మెండోరా, ముప్కాల్, బాల్కొండ, వేల్పూర్, ఆర్మూర్, నందిపేట్, జక్రాన్‌పల్లి, ధర్పల్లి మండలాల్లోని రైతులు భూసారం పెంపుపై దృష్టి సారించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ వద్ద సదర్‌మాట్ ప్రాజెక్టు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న పంట పొలాల్లో నల్లమట్టి సమృద్ధిగా లభిస్తోంది. పంట పొలాలను కోల్పోతున్న రైతులు ఎంతో కొంత సంపాదించుకోవడానికి ఇదే మార్గం అని భావించి నల్లమట్టిని విక్రయిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్‌లలో నల్లమట్టిని నింపి, అవసరం ఉన్న రైతులకు విక్రయిస్తున్నారు. నిర్మల్ ప్రాంతంతో పాటు భీమ్‌గల్ మండలంలోని బెజ్జోరా చెరువులోనూ నాణ్యమైన నల్లమట్టి లభిస్తుంది. ఇక్కడి గ్రామాభివృద్ధి కమిటీ నల్లమట్టి విక్రయానికి టెండర్ నిర్వహించి, ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. లారీ నల్లమట్టికి రూ.5 వేల నుంచి రూ.6 వేలు, ట్రాక్టర్ అయితే రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. పంట పొలాల దూర భారాన్ని దృష్టిలో ఉంచుకుని ధరలో మార్పు చేస్తున్నారు. సాధారణంగా మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టే చెరువుల పునరుద్ధరణలో భాగంగా నల్లమట్టిని ఉచితంగా తరలించుకునే వీలుంది.
అయితే ఈసారి సమృద్ధిగా వర్షాలు కురియడంతో చాలా చెరువుల్లో నీరు బాగా నిండింది. దీంతో చాలా చెరువుల్లో నీటిమట్టం ఎక్కువగా ఉండడంతో నల్లమట్టి తీసేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వేర్వేరు ప్రాంతాల నుంచి రైతులు తమ పొలాలకు నల్ల మట్టి తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పడిపోతున్న తరుణంలో, త్వరలోనే అక్కడి నుంచి కూడా నల్లమట్టి తరలించే అవకాశం కలుగుతుందని రైతులు చెబుతున్నారు. నల్లమట్టితో భూసారం అభివృద్ధి చెంది పంటల దిగుబడి బాగా వస్తుందని, అందుకే రూ.వేలు వెచ్చి కొనుగోలు చేస్తున్నామని వారు పేర్కొంటున్నారు.