Black soil
-
ఖరీఫ్‌కు సిద్ధం కండి
- వేసవి యాజమాన్య పద్ధతులతోనే లాభాలు – డాట్ సెంటర్ శాస్త్రవేత్త రామసుబ్బయ్య అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధం కావాలని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. ముందస్తు పనుల్లో భాగంగా ప్రస్తుతం పంట పొలాల్లో ‘వేసవి’ యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. వేసవి యాజమాన్యం + వేసవిలో కురిసే వానలను ఉపయోగించుకుని లోతుగా దుక్కులు చేసుకోవాలి. భూమిలో ఉండే పంటలకు హానిచేసే కీటక నాశినిలు నశించడమే కాకుండా పంట కాలంలో తేమశాతం పెరుగుతుంది. బెట్ట పరిస్థితులు ఏర్పడినా కొద్దిరోజులు పంటకు ఇబ్బంది ఉండదు. + భూసార పరీక్షలు చేయించాలనుకునే రైతులు మట్టి నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరీక్షలు చేయించుకుని అందుకు అనుగుణంగా ఫలితాలను బట్టి ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. + పొలాల్లో నేల కోతకు గురికాకుండా వాలుకు అడ్డంగా దున్నడం, అక్కడక్కడ చిన్నపాటి మట్టి, రాతి కట్టడాలు కట్టుకున్నా బాగుంటుంది. దీని వల్ల భూసారం కొట్టుకుపోకుండా నివారించుకోవచ్చు. + గత ఖరీఫ్‌కు సంబం«ధించి పొలాల్లో ఉన్న పత్తి, కంది, ఆముదం కట్టెలను ఏరివేసి వంటచెరకు గాను లేదా కుప్పలుగా వేసి కుళ్లిన తర్వాత సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు. + పొలంలో గట్టిపొర ఏర్పడితే ఇసుక తోలడం వల్ల భూమి బాగవుతుంది. వేసిన పంటల నుంచి ఊడలు సులభంగా భూమిలోకి దిగుతాయి. + నీటి లభ్యత ఉన్న రైతులు సేంద్రియ ఎరువు దిబ్బలు (కుప్పలు)పై నీటిని చిలకరించడం వల్ల తొందరగా ఎరువుగా మురుగుతుంది. వర్షాధార పంటలకు సేంద్రియ ఎరువులు కుళ్లకుండా వేయడం వల్ల పంటలు తొందరగా బెట్ట పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్రమంలో సేంద్రియ ఎరువులు బాగా కుళ్లిన తరువాతే పొలంలో వేసుకోవాలి. + ఎర్రనేలల్లో నీటిని నిలుపుకునే శక్తి తక్కువగా ఉంటుంది. పెరగాలంటే చెరువులో ఉన్న బంక మట్టి పొలంలోకి తోలుకోవాలి. నల్లరేగడి భూముల్లో నీటి నిలుపుకునే శక్తి పెరిగేలా యాజమాన్య పద్ధతులు పాటించాలి. + పంట సాగులో రైతులు ఏకపంటకు స్వస్తిపలకాలి. వేరుశనగ పంట ఒక్కటే కాకుండా అందులో సిఫారసు చేసిన నిష్పత్తిలో అంతర పంటలు సాగు చేయాలి. మేరసాళ్లు, ఎరపంటలు వేయడం వల్ల చీడపీడలు, పురుగుల వ్యాప్తి తగ్గుతుంది. వర్షపాతం తక్కువైనా పండే స్వల్పకాలిక పంటలైన సజ్జ, పెసర, అలసంద, మినుము, కొర్ర లాంటి పంటలపై రైతులు దృష్టి పెట్టాలి. ఒక పంట దెబ్బతిన్నా ఇతర పంటలు పండే అవకాశం ఉంటుంది. -
నల్ల మట్టికి భళే డిమాండ్
పంటపొలాల్లో వేయిస్తున్న రైతులు భూసారం పెంపునకు దోహదం మోర్తాడ్ (బాల్కొండ) : జొన్నకోతలు పూర్తయ్యాయి. ఆ భూముల్లో ఖరీఫ్‌లో పసుపు విత్తేందుకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దుక్కి దున్నడం పూర్తిగా, ఆయా భూముల్లో భూసారం పెంచేందుకు నల్లమట్టి వేస్తున్నారు. దీంతో నల్లమట్టికి భారీగా డిమాండ్ ఏర్పడింది. రబీలో సాగు చేసిన ఎర్రజొన్న, మొక్కజొన్న కోతలు పూర్తి కావడంతో రైతులు ఆయా భూముల్లో నల్లమట్టి వేయిస్తున్నారు. వాణిజ్య పంటలను ఎక్కువగా పండించే మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి, మెండోరా, ముప్కాల్, బాల్కొండ, వేల్పూర్, ఆర్మూర్, నందిపేట్, జక్రాన్‌పల్లి, ధర్పల్లి మండలాల్లోని రైతులు భూసారం పెంపుపై దృష్టి సారించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ వద్ద సదర్మాట్ ప్రాజెక్టు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న పంట పొలాల్లో నల్లమట్టి సమృద్ధిగా లభిస్తోంది. పంట పొలాలను కోల్పోతున్న రైతులు ఎంతో కొంత సంపాదించుకోవడానికి ఇదే మార్గం అని భావించి నల్లమట్టిని విక్రయిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లలో నల్లమట్టిని నింపి, అవసరం ఉన్న రైతులకు విక్రయిస్తున్నారు. నిర్మల్ ప్రాంతంతో పాటు భీమ్‌గల్ మండలంలోని బెజ్జోరా చెరువులోనూ నాణ్యమైన నల్లమట్టి లభిస్తుంది. ఇక్కడి గ్రామాభివృద్ధి కమిటీ నల్లమట్టి విక్రయానికి టెండర్ నిర్వహించి, ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. లారీ నల్లమట్టికి రూ.5 వేల నుంచి రూ.6 వేలు, ట్రాక్టర్ అయితే రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. పంట పొలాల దూర భారాన్ని దృష్టిలో ఉంచుకుని ధరలో మార్పు చేస్తున్నారు. సాధారణంగా మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టే చెరువుల పునరుద్ధరణలో భాగంగా నల్లమట్టిని ఉచితంగా తరలించుకునే వీలుంది. అయితే ఈసారి సమృద్ధిగా వర్షాలు కురియడంతో చాలా చెరువుల్లో నీరు బాగా నిండింది. దీంతో చాలా చెరువుల్లో నీటిమట్టం ఎక్కువగా ఉండడంతో నల్లమట్టి తీసేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వేర్వేరు ప్రాంతాల నుంచి రైతులు తమ పొలాలకు నల్ల మట్టి తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పడిపోతున్న తరుణంలో, త్వరలోనే అక్కడి నుంచి కూడా నల్లమట్టి తరలించే అవకాశం కలుగుతుందని రైతులు చెబుతున్నారు. నల్లమట్టితో భూసారం అభివృద్ధి చెంది పంటల దిగుబడి బాగా వస్తుందని, అందుకే రూ.వేలు వెచ్చి కొనుగోలు చేస్తున్నామని వారు పేర్కొంటున్నారు. -
ఔను.. వాళ్లు ఒక్కటయ్యారు!
♦ సిండికేట్‌గా ఏర్పడిన వ్యాపారులు ♦ అసోసియేషన్ పేరుతో దందా ♦ రైతుకు ‘మట్టి’కొట్టేందుకు ఎత్తుగడ బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టి తరలిస్తున్న వ్యాపారులంతా ఒక్కటయ్యారు. ప్రాజెక్ట్ నుంచి నల్లమట్టి తరలించే వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను పెంచి రైతులను దగా చేసేందుకు సిద్ధమయ్యారు. అన్నదాతకు ‘మట్టి’ కొట్టేందుకు ఆదివా రం సమావేశమైన వ్యాపారులు.. తెలంగాణ టిప్పర్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. అసోసియేషన్‌కు చెందిన పోస్టర్లను టిప్పర్లకు అతికించి మరీ నల్లమట్టిని తరలిస్తున్నారు. ఒక్కటైన వ్యాపారులంతా ఒకే ధరకు మట్టిని విక్రయించాలని నిబంధనలు విధించుకున్నారు. అంతే కాకుండా ధరల పట్టికను కూడా సిద్ధం చేశారు. ఫలితంగా అన్నదాత ఆరుగాలం కష్టపడి పోగేసిన డబ్బు ‘మట్టి’పాలయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడే ఎందుకో..? శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి సుమారు రెండున్నర నెలలుగా నల్లమట్టిని రైతుల కోసమంటూ తరలిస్తున్నారు. రైతులకు ఎలాంటి భారం కాకుడదని ప్రాజెక్ట్ అధికారులు ఎలాంటి ఆంక్షలు లేకుండా మట్టిని తరలించేందుకు అనుమతించారు. ఇన్నాళ్లు ఎవరికి వారే మట్టిని తరలించిన వ్యాపారులు సిండి‘కేటుగాళ్లు’గా మారారు. అంతా కలిసి అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. అయితే, ఇన్నాళ్లుగా ఏర్పాటు చేయని అసోసియేషన్ ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అసోసియేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిం దో? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసోసియేషన్ ఏర్పాటుకు ముందు అధికారులు ఎక్కడా నల్లమట్టి తరలింపును అడ్డుకోలేదు. మరి అలాంటప్పుడు ‘అసోసియేషన్’ ఎందుకో వ్యాపారులకే తెలియాలి. అసోసియేషన్‌కు సభ్యత్వ రుసుం.. తెలంగాణ టిప్పర్ అసోషియేషన్‌లో సభ్యత్వం కోసం డబ్బులు వసూలు చేసినట్లు కొందరు వ్యాపారులు చెబుతున్నారు. టిప్పరు రూ.1000, డంపర్‌కు రూ.2 వేల చొప్పున చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. ఇలా ఇప్పటివరకు సుమారు 150 వరకు టిప్పర్లు, డంపర్ల పేరుతో అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్నట్లు సమాచారం. అందుకోసమేనా..?! ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టి తరలించేందుకు కొందరు వ్యాపారులు తమిళనాడు, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో టిప్పర్లను తీసుకువచ్చారు. దీంతో పోటీ తీవ్రమైంది. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు తక్కువ ధరకే నల్లమట్టిని విక్రయించారు. దీనివల్ల రైతులకు కొంత ఊరట లభించింది. అయితే, పోటీ వల్ల దందా దెబ్బ తింటుందని భావించిన వ్యాపారులు.. ‘ఒకే ధర’ నిబంధనను అమలు చేసేందుకు అసోసియేషన్‌గా ఏర్పడినట్లు తెలిసింది. దీనివల్ల రైతులపై ధరాభారం పడనుంది. ప్రభుత్వానికి చిల్లి గవ్వ చెల్లించకుండా రైతుల పేరుతో మట్టి దందాకు శ్రీకారం చుట్టారు! పోస్టర్ ఉంటేనే.. సభ్యత్వం తీసుకున్న టిప్పర్లకు ‘తెలంగాణ టిప్పర్ అసోషియేషన్’కు చెందిన పోస్టర్లను అతికించారు. ఎస్సారెస్పీ నుంచి నల్ల మట్టి తరలించే ప్రతి టిప్పర్‌కు అసోసియేషన్ పోస్టర్ ఉండాలి. లేదంటే నల్లమట్టి తరలించేందుకు వీలు లేదనే నిబంధన పెట్టారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టిని తరలించేందుకు ప్రాజెక్ట్ అధికారులకు సీనరేజ్ చెల్లించాలి. కానీ సీనరేజ్ చెల్లిస్తే ఆ భారం అంతిమంగా రైతుపైనే పడుతుందని చిలుక పలుకులు పలుకుతున్న వ్యాపారులకు.. అసోసియేషన్ సభ్యత్వ రుసుము భారం కూడా రైతులపైనే పడుతుందని తెలియదా..?