ఔను.. వాళ్లు ఒక్కటయ్యారు!
♦ సిండికేట్‌గా ఏర్పడిన వ్యాపారులు
♦ అసోసియేషన్ పేరుతో దందా
♦ రైతుకు ‘మట్టి’కొట్టేందుకు ఎత్తుగడ
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టి తరలిస్తున్న వ్యాపారులంతా ఒక్కటయ్యారు. ప్రాజెక్ట్ నుంచి నల్లమట్టి తరలించే వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను పెంచి రైతులను దగా చేసేందుకు సిద్ధమయ్యారు. అన్నదాతకు ‘మట్టి’ కొట్టేందుకు ఆదివా రం సమావేశమైన వ్యాపారులు.. తెలంగాణ టిప్పర్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. అసోసియేషన్‌కు చెందిన పోస్టర్లను టిప్పర్లకు అతికించి మరీ నల్లమట్టిని తరలిస్తున్నారు. ఒక్కటైన వ్యాపారులంతా ఒకే ధరకు మట్టిని విక్రయించాలని నిబంధనలు విధించుకున్నారు. అంతే కాకుండా ధరల పట్టికను కూడా సిద్ధం చేశారు. ఫలితంగా అన్నదాత ఆరుగాలం కష్టపడి పోగేసిన డబ్బు ‘మట్టి’పాలయ్యే ప్రమాదం ఏర్పడింది.
ఇప్పుడే ఎందుకో..?
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి సుమారు రెండున్నర నెలలుగా నల్లమట్టిని రైతుల కోసమంటూ తరలిస్తున్నారు. రైతులకు ఎలాంటి భారం కాకుడదని ప్రాజెక్ట్ అధికారులు ఎలాంటి ఆంక్షలు లేకుండా మట్టిని తరలించేందుకు అనుమతించారు. ఇన్నాళ్లు ఎవరికి వారే మట్టిని తరలించిన వ్యాపారులు సిండి‘కేటుగాళ్లు’గా మారారు. అంతా కలిసి అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. అయితే, ఇన్నాళ్లుగా ఏర్పాటు చేయని అసోసియేషన్ ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అసోసియేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిం దో? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసోసియేషన్ ఏర్పాటుకు ముందు అధికారులు ఎక్కడా నల్లమట్టి తరలింపును అడ్డుకోలేదు. మరి అలాంటప్పుడు ‘అసోసియేషన్’ ఎందుకో వ్యాపారులకే తెలియాలి.
అసోసియేషన్‌కు సభ్యత్వ రుసుం..
తెలంగాణ టిప్పర్ అసోషియేషన్‌లో సభ్యత్వం కోసం డబ్బులు వసూలు చేసినట్లు కొందరు వ్యాపారులు చెబుతున్నారు. టిప్పరు రూ.1000, డంపర్‌కు రూ.2 వేల చొప్పున చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. ఇలా ఇప్పటివరకు సుమారు 150 వరకు టిప్పర్లు, డంపర్ల పేరుతో అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకున్నట్లు సమాచారం.
అందుకోసమేనా..?!
ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టి తరలించేందుకు కొందరు వ్యాపారులు తమిళనాడు, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో టిప్పర్లను తీసుకువచ్చారు. దీంతో పోటీ తీవ్రమైంది. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు తక్కువ ధరకే నల్లమట్టిని విక్రయించారు. దీనివల్ల రైతులకు కొంత ఊరట లభించింది. అయితే, పోటీ వల్ల దందా దెబ్బ తింటుందని భావించిన వ్యాపారులు.. ‘ఒకే ధర’ నిబంధనను అమలు చేసేందుకు అసోసియేషన్‌గా ఏర్పడినట్లు తెలిసింది. దీనివల్ల రైతులపై ధరాభారం పడనుంది. ప్రభుత్వానికి చిల్లి గవ్వ చెల్లించకుండా రైతుల పేరుతో మట్టి దందాకు శ్రీకారం చుట్టారు!
పోస్టర్ ఉంటేనే..
సభ్యత్వం తీసుకున్న టిప్పర్లకు ‘తెలంగాణ టిప్పర్ అసోషియేషన్’కు చెందిన పోస్టర్లను అతికించారు. ఎస్సారెస్పీ నుంచి నల్ల మట్టి తరలించే ప్రతి టిప్పర్‌కు అసోసియేషన్ పోస్టర్ ఉండాలి. లేదంటే నల్లమట్టి తరలించేందుకు వీలు లేదనే నిబంధన పెట్టారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నల్ల మట్టిని తరలించేందుకు ప్రాజెక్ట్ అధికారులకు సీనరేజ్ చెల్లించాలి. కానీ సీనరేజ్ చెల్లిస్తే ఆ భారం అంతిమంగా రైతుపైనే పడుతుందని చిలుక పలుకులు పలుకుతున్న వ్యాపారులకు.. అసోసియేషన్ సభ్యత్వ రుసుము భారం కూడా రైతులపైనే పడుతుందని తెలియదా..?