ఖరీఫ్‌కు సిద్ధం కండి
- వేసవి యాజమాన్య పద్ధతులతోనే లాభాలు
– డాట్ సెంటర్ శాస్త్రవేత్త రామసుబ్బయ్య
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధం కావాలని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. ముందస్తు పనుల్లో భాగంగా ప్రస్తుతం పంట పొలాల్లో ‘వేసవి’ యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు.
వేసవి యాజమాన్యం
+ వేసవిలో కురిసే వానలను ఉపయోగించుకుని లోతుగా దుక్కులు చేసుకోవాలి. భూమిలో ఉండే పంటలకు హానిచేసే కీటక నాశినిలు నశించడమే కాకుండా పంట కాలంలో తేమశాతం పెరుగుతుంది. బెట్ట పరిస్థితులు ఏర్పడినా కొద్దిరోజులు పంటకు ఇబ్బంది ఉండదు.
+ భూసార పరీక్షలు చేయించాలనుకునే రైతులు మట్టి నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరీక్షలు చేయించుకుని అందుకు అనుగుణంగా ఫలితాలను బట్టి ఎరువుల యాజమాన్యం చేపట్టాలి.
+ పొలాల్లో నేల కోతకు గురికాకుండా వాలుకు అడ్డంగా దున్నడం, అక్కడక్కడ చిన్నపాటి మట్టి, రాతి కట్టడాలు కట్టుకున్నా బాగుంటుంది. దీని వల్ల భూసారం కొట్టుకుపోకుండా నివారించుకోవచ్చు.
+ గత ఖరీఫ్‌కు సంబం«ధించి పొలాల్లో ఉన్న పత్తి, కంది, ఆముదం కట్టెలను ఏరివేసి వంటచెరకు గాను లేదా కుప్పలుగా వేసి కుళ్లిన తర్వాత సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు.
+ పొలంలో గట్టిపొర ఏర్పడితే ఇసుక తోలడం వల్ల భూమి బాగవుతుంది. వేసిన పంటల నుంచి ఊడలు సులభంగా భూమిలోకి దిగుతాయి.
+ నీటి లభ్యత ఉన్న రైతులు సేంద్రియ ఎరువు దిబ్బలు (కుప్పలు)పై నీటిని చిలకరించడం వల్ల తొందరగా ఎరువుగా మురుగుతుంది. వర్షాధార పంటలకు సేంద్రియ ఎరువులు కుళ్లకుండా వేయడం వల్ల పంటలు తొందరగా బెట్ట పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్రమంలో సేంద్రియ ఎరువులు బాగా కుళ్లిన తరువాతే పొలంలో వేసుకోవాలి.
+ ఎర్రనేలల్లో నీటిని నిలుపుకునే శక్తి తక్కువగా ఉంటుంది. పెరగాలంటే చెరువులో ఉన్న బంక మట్టి పొలంలోకి తోలుకోవాలి. నల్లరేగడి భూముల్లో నీటి నిలుపుకునే శక్తి పెరిగేలా యాజమాన్య పద్ధతులు పాటించాలి.
+ పంట సాగులో రైతులు ఏకపంటకు స్వస్తిపలకాలి. వేరుశనగ పంట ఒక్కటే కాకుండా అందులో సిఫారసు చేసిన నిష్పత్తిలో అంతర పంటలు సాగు చేయాలి. మేరసాళ్లు, ఎరపంటలు వేయడం వల్ల చీడపీడలు, పురుగుల వ్యాప్తి తగ్గుతుంది. వర్షపాతం తక్కువైనా పండే స్వల్పకాలిక పంటలైన సజ్జ, పెసర, అలసంద, మినుము, కొర్ర లాంటి పంటలపై రైతులు దృష్టి పెట్టాలి. ఒక పంట దెబ్బతిన్నా ఇతర పంటలు పండే అవకాశం ఉంటుంది.