రైతు భరోసాపై చేతులెత్తేసిన ప్రభుత్వం
వానాకాలం సీజన్‌కు ఇవ్వలేమన్న మంత్రి తుమ్మల
అన్నదాతలకు శరాఘాతం
మంత్రివర్గ ఉప సంఘంతోనే కాలయాపన
అసెంబ్లీలో చర్చ లేదు.. మార్గదర్శకాల ముచ్చటే లేదు
పెట్టుబడి సాయం చేస్తామని ప్రకటించి చివరికిలా..
‘ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేం’.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం చేసిన ప్రకటన రైతులకు శరాఘాతమైంది. ఈ వానాకాలం సీజన్‌కు రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేసింది. – సాక్షి, హైదరాబాద్
ఆర్భాటంగా కేబినెట్ సబ్ కమిటీ
కాగా, జూలై 2వ తేదీన రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. అందులో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబులను సభ్యులుగా నియమించారు. అప్పటినుంచి 15 రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వాలి.
ఆ నివేదికపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. అసెంబ్లీ ఆమోదం తర్వాత మార్గదర్శకాలు జారీచేసి రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని సర్కారు ప్రకటించింది.
సమావేశాలు పెట్టి.. అభిప్రాయాలు సేకరించి..
జూలై 15వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. రైతు భరోసాపై అభిప్రాయాలు తీసుకున్నారు. ఆదిలాబాద్ సహా కొన్ని జిల్లాల్లోనూ అభిప్రాయాలు తీసుకున్నారు. జూలై 23వ తేదీ నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసా ఊసే ఎత్తలేదు. దీంతో మార్గదర్శకాలు ఖరారు కాలేదు.
ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వబోమని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శనివారం స్పష్టం చేయడంతో రైతులు కంగుతిన్నారు. రైతు భరోసాకు బదులుగా సన్న ధాన్యం పండించిన ప్రతి రైతుకు రూ.500 బోనస్ ఇస్తామని తుమ్మల ప్రకటించారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చిచెప్పారు.
కాగా, వరదలు, భారీ వర్షాలతో అన్నదాత కుదేలయ్యాడు. మరోవైపు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో లక్షలాది మంది రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేదు. ఖరీఫ్ ముగిసినా రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తారన్న నమ్మకంతో రైతులున్నారు. చివరికి ఇలా జరగడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కీలక పథకానికి తొలి ఆటంకం..
వాస్తవానికి సీజన్‌కు ముందే రైతు భరోసా ఇవ్వాలనేది పథకం ఉద్దేశం. రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, కూలీల ఖర్చును పెట్టుబడి సాయం ద్వారా అందించాలన్నది దీని లక్ష్యం. 2018 నుంచి ఏటా రెండు సీజన్లలో నిరాటంకంగా కొనసాగిన ఈ పథకం ఈ వానాకాలం సీజన్‌లో మాత్రం తొలిసారిగా నిలిచిపోయింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పథకం ఆగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత యాసంగిలో రైతుబంధు పథకం కింద పాత పద్ధతిలోనే పెట్టుబడి సాయం చేశారు. కనీసం అలాగైనా ఈ వానాకాలం సీజన్‌కు ఇచ్చినా బాగుండేదని రైతులు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా మొత్తాన్ని సీజన్‌కు ఎకరానికి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇస్తామని చెప్పింది. ఈ వానాకాలం సీజన్ నుంచే అమలు చేస్తామని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు నిబంధనలు పునఃసమీక్ష తర్వాత అర్హులకు రైతుభరోసా ఇస్తామని ప్రకటించింది.
మార్గదర్శకాలు ఎలా ఉంటాయో..?
ప్రభుత్వం ముఖ్యంగా రైతుభరోసాకు సీలింగ్ విధించాలన్న ఆలోచనలో ఉందని అంటున్నారు. అందరికీ కాకుండా ఐదు లేదా పదెకరాలకు దీనిని పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాగు చేసిన రైతులకు మాత్రమే ఇవ్వాలనేది ఉద్దేశం. గత యాసంగి సీజన్‌లో మొత్తం 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. అందులో ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మంది కాగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుబంధు అందుకున్న వారిలో ఐదెకరాల్లోపు రైతులే 90.36 శాతం ఉండటం గమనార్హం.
కాగా ఐదెకరాలకు పరిమితం చేస్తే 90 శాతం మందికి రైతుభరోసా ఇచ్చినట్లు అవుతుందనేది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు. ఇక ఎకరాలోపున్న రైతులు 22.55 లక్షల మంది, ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది, రెండెకరాల నుంచి మూడెకరాల్లోపున్న వారు 10.89 లక్షల మంది, మూడెకరాల నుంచి నాలుగెకరాల్లోపున్న వారు 6.64 లక్షల మంది, నాలుగెకరాల నుంచి ఐదెకరాల్లోపున్న రైతులు 5.26 లక్షల మంది ఉన్నారు.
ఇక 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య 5.72 లక్షల మంది కాగా.. వారి చేతిలో 31.04 లక్షల ఎకరాల భూమి ఉంది. పదెకరాల వరకు ఇస్తే, రైతు భరోసాకు వీరు కూడా తోడవుతారు. పీఎం కిసాన్ నిబంధనలను అమలు చేస్తే అనేక మందికి కోత పడుతుంది. భూములున్న ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు.. ఇలా చాలామందికి కోతపడే అవకాశాలున్నాయి. చివరికేం జరుగుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment