సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వరుస కరువులతో జిల్లా యంత్రాంగం తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్, రబీ పంట నష్టం అంచనాలను అధికారులు మొక్కుబడిగా ప్రభుత్వానికి నివేదించగా ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. దీంతో జిల్లా రైతాంగం మరింత ఆందోళన చెందుతోంది. జూన్ ఒకటినుంచి మే 31 వరకు ఈ ఏడాది సాధారణ వర్షపాతం 871.5 ఎంఎం కాగా గత జూన్ నుంచి డిసెంబర్ వరకు కేవలం 385.2 ఎంఎం వర్షపాతమే నమోదైంది. రబీలో 43.5 శాతం మాత్రమే వర్షపాతం నమోదైంది. జనవరి నుంచి చినుకు లేదు. చెరువులు ఎండిపోయాయి. బోర్లు ఒట్టిపోయాయి. పశ్చిమ ప్రాంతంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. పశువులకు మేత, దప్పిక తీరే దారిలేని పరిస్థితి ఉంది. మొత్తంగా 88 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో సాగైన పంటలు ఆదిలోనే ఎండిపోయాయి. అరకొరగా పండినా దిగుబడులు తగ్గాయి. గిట్టుబాటు ధరల్లేకపోవడంతో సగం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. దీంతో జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.
జిల్లాలో 14 లక్షల ఎకరాలకుపైగా సాగు భూమి ఉండగా ఖరీఫ్, రబీలో రైతులు 10 లక్షల ఎకరాల్లో పత్తి, కంది, శనగ, మిర్చి పంటలు సాగు చేశారు. ఎకరాకు 30 వేలకు తగ్గకుండా పెట్టుబడులు పెట్టారు. ఇక కౌలు లెక్కలు సరేసరి. రైతులు ఎకరాల్లెక్కన పెట్టిన పెట్టుబడే రూ.3 వేల కోట్లు దాటింది. తీవ్ర వర్షాభావంతో ఇందులో 70 నుంచి 80 శాతం పంటలు చేతికి రాకుండా పోయాయి. ప్రధానంగా గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, కందుకూరు, మార్కాపురం తదితర పశ్చిమ ప్రకాశం ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోవాల్సి వచ్చింది. మొత్తంగా రైతులు రూ.2400 కోట్లు నష్టపోయారు. అయితే పంట నష్టం అంచనాలను గణించిన ప్రభుత్వ అధికారులు జిల్లాలోని కరువు కింద ప్రకటించిన 55 మండలాల పరిధిలో 1,23,233.58 హెక్టార్లలో అన్ని పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలు తేల్చారు.
1,65,086 మంది రైతులకు రూ.125,60,36,502 చెల్లించాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అధికారిక లెక్కల ప్రకారమే ఇందులో ప్రధానంగా 50 వేల హెక్టార్లలో కంది, 25 వేల హెక్టార్లలో శనగతో పాటు పత్తి, మిర్చి తదితర పంటలు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. వాస్తవానికి అధికారులు పేర్కొంటున్న 1.23 లక్షల హెక్టార్లలో కంది, మిర్చి, పత్తి, శనగ సాగుకు సైతం రైతులు రూ.863 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. అయితే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించింది కేవలం రూ.125 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. వాస్తవానికి 8 లక్షల ఎకరాల్లో రైతుల పెట్టుబడులు రూ.2,400 కోట్లు ఉన్నాయి. కానీ అధికారులు అంచనాలకు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పొంతన లేదు. మొక్కుబడిగా అధికారులిచ్చిన గణాంకాలను, దానికి సంబంధించిన పరిహారం ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment