Crop damages
-
సాయంలో కొత్త ఒరవడి
వరద కష్టాల్లో ఉన్న ప్రజలకు తక్షణ సాయం అందాలి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. భోజనం, నీరు, వైద్యం అందించాలి. తొలుత ఆ పని చేయండి. ఆ తర్వాతే ఆయా గ్రామాల్లో ఉన్న నా అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను నేనే స్వయంగా వచ్చి అడుగుతాను. ఏ ఒక్కరి నుంచి కూడా నాకు అందాల్సింది అందలేదు.. కలెక్టర్ సరిగా స్పందించ లేదు.. వ్యవస్థలు సరిగా పని చేయలేదన్న మాట ఎక్కడా వినపడకూడదని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఇందులో భాగంగానే ఇప్పుడు పరిశీలించడానికి వచ్చాను. దీన్నొక సరికొత్త విధానంగా అమలు చేస్తూ కొత్త ఒరవడి సృష్టించాం. తక్షణ సాయం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నందుకు ఆనందంగా ఉంది. – లంక వాసులతో సీఎం జగన్ సాక్షి అమలాపురం: ‘గతంలో చాలాసార్లు వరదలు వచ్చాయి. నాయకులు అప్పటికప్పుడు రావడం, అధికారులంతా వారి చుట్టూ తిరగటం జరిగేది. పేపర్లలో.. టీవీల్లో ఫొటోల కోసం పోజులిచ్చి వెళ్లిపోయేవారు. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలి. కానీ వారు మంచి జరిగిందా లేదా అని చూడలేదు. మన ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని మార్చాం. ప్రతి బాధితునికి సాయం అందుతోంది. నాలుగేళ్లుగా ఈ మార్పు కనిపిస్తోంది. సాయం చేయడం, ఆదుకోవడం అంటే ఇదీ..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గోదావరి వరదల బారిన పడిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం ఆయన పర్యటించారు. ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని గురజాపులంక, లంకాఫ్ ఠానేల్లంక, కొండుకుదురులంకల్లో బాధితులతో మమేకమయ్యారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతి సందర్భంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజలకు తక్షణ సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు కావాల్సిన డబ్బులు వారి చేతుల్లో పెట్టామని చెప్పారు. వరద నష్టం ఎక్కువా, తక్కువా అని చూడకుండా బాధితులను ఉదారంగా ఆదుకోండని చెప్పామని తెలిపారు. ‘ఆయా జిల్లాల్లో కలెక్టర్లకు వారం రోజుల సమయం ఇచ్చాం. ప్రతి గ్రామంలోకి వెళ్లాలని, ప్రతి గ్రామంలో ఉన్న వ్యవస్థను చైతన్యం చేయాలని చెప్పాం. ఆ తర్వాత నేను స్వయంగా వచ్చి బాధితులకు సాయం అందిందీ లేనిదీ చూస్తానని చెప్పాను. నేను వచ్చినప్పుడు నాకు సహాయం అందలేదని ఏ ఒక్కరి నోటి నుంచి రాకూడదు’ అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. వరదలు వచ్చినప్పుడే మిమ్మల్ని పలకరించేందుకు వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని భావించే ఇలా చేశానని వివరించారు. కష్టాలలో ఉన్నప్పుడు మీ బిడ్డ వేగంగా ఆదుకుంటాడని పునరుద్ఘాటించారు. తొత్తరమూడివారిపేటలో స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారంగా ఉండాలన్నాను.. పేదలకు సాయం అందించడంలో ఉదారంగా ఉండాలన్న తన సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యంత్రాంగం పనిచేసిందని సీఎం కొనియాడారు. ఈ రోజు ప్రతి వ్యక్తికి పరిహారం అందించామంటే అందుకు మీ బిడ్డ జగన్ గ్రామీణ స్థాయిలో గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేయడమేనన్నారు. సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, ఆర్బీకేలు, వలంటీర్ల వ్యవస్థ వల్ల వరదల సమయంలో వేగంగా సాయం అందించడానికి మార్గం సుగమం అయిందన్నారు. ఈ వ్యవస్థ వల్లే ప్రతి పనిలోను పారదర్శకత చూపిస్తున్నామని తెలిపారు. నెలాఖరుకు పంట నష్ట పరిహారం పంట నష్టపోయిన రైతులకు నెలాఖరుకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ రైతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ‘రైతులకు ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే’ అని అన్నారు. మూడు నాలుగు రోజుల్లో జాబితా సిద్ధమవుతుందని, రైతుల పేరు, విస్తీర్ణం, పంట నష్టం వివరాలు ఆర్బీకేలలో ఉంటాయన్నారు. ఎవరి పేరు అయినా కనిపించకపోతే ఆర్బీకేలో ఫిర్యాదు చేస్తే, తిరిగి పరిశీలిస్తారని చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామన్నారు. అనంతరం గురజాపులంక, కూనలంకల్లో నష్టపోయిన వంగ, మునగ, బెండ, ఇతర కూరగాయ పంటలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. విలేజ్ క్లినిక్‌ల ద్వారా గ్రామీణుల ముంగిటకే వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పశువులకు కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నామని, టీఎంఆర్ (టోటల్ మిక్స్డ్ రేషన్–సమగ్ర పశు దాణా) దాణా అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని సచివాలయం, వలంటీర్ వ్యవస్థలు, విలేజ్ క్లినిక్‌లు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయని వివరించారు. ‘ఓఎన్జీసీ పరిహారం గురించి మీ అందరికీ తెలుసు. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక అది మీకు అందింది. అన్ని విధాలా మీకు మంచి చేసే విషయంలో దేవుడు మరింత అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్‌ను చూసేందుకు మహిళలు, యువత ఆసక్తి చూపించారు. సీఎం.. సీఎం.. అంటూ నినా దాలు చేశారు. గురజాపులంకలో పలువురు యువ కులు జగన్‌ను చూసి ‘వైనాట్ 175 జగనన్నా..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం జగన్ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గురజాపులంకలో ఓ కుటుంబంతో మాట్లాడుతున్న సీఎం జగన్ సీఎంకు ఘన స్వాగతం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలు, నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. సీఎం వెంట రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జోగి రమేష్, మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయెల్, కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాద్, పెండెం దొరబాబు, కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ నపూర్ అజయ్‌లు పాల్గొన్నారు. నేరుగా జనం మధ్యకే.. మంగళవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ నేరుగా గురజాపులంకకు హెలికాప్టర్లో చేరుకున్నారు. సాధారణంగా వరదల సమయంలో బాధితులను పరామర్శించేందుకు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు జిల్లాకు వచ్చారు. అప్పట్లో డివిజన్ కేంద్రమైన అమలాపురం, వరద ప్రభావిత ప్రాంతాల మండల కేంద్రాలలో వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, ఎంపిక చేసిన బాధితులను పరామర్శించి వెనుదిరిగేవారు. సీఎం జగన్ ఇందుకు భిన్నంగా నేరుగా లంక గ్రామాలలోకే రావడం బాధి తులను, పంట నష్టపోయిన రైతులను పరా మర్శించడంతోపాటు జరిగిన నష్టాన్ని స్వయంగా వీక్షించడం గమనార్హం. ఐదారు గంటలపాటు లంకవాసులతో సీఎం మమేకమ య్యారు. ఇదే విషయాన్ని లంకవాసులు, వరద బాధితులు గొప్పగా చెప్పుకున్నారు. తమ బాధలను తెలుసుకునేందుకు వచ్చిన తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగనే అని వారు సంబర పడ్డారు. 1996లో పెను తుపానుకు తమ గ్రామాలు ధ్వంసమైనప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు తమ గ్రామాలకు రానేలేదని వారు గుర్తు చేశారు. తమనే ఠానేలంకకు పిలిపించి మాట్లాడారని చెప్పారు. గత ఏడాది గోదావరికి రికార్డు స్థాయిలో వరద వచ్చిన సమయంలో కూడా సీఎం జగన్ జిల్లాలోని పి.గన్నవరం మండలంలోని జి.పెదపూడిలంక, ఉడుముడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో పర్యటించారని గుర్తు చేశారు. -
సీఎం కేసీఆర్ ప్లాన్.. అలా చేస్తే అకాల వర్షం ముప్పు తప్పుతుందా?
దేశీ రకాలతో ప్రయోజనం ► అన్నిరకాల కాలాలను తట్టుకునే దేశీ రకాల వరిని వేయడమే అకాల వర్షాల సమస్యకు పరిష్కారం. భారీ వర్షం, వడగళ్లతో పంట నేలకొరిగినా.. దేశీ వరి మళ్లీ నిలబడుతుంది. మొక్క గట్టిగా ఉంటుంది. వడగళ్లు, ఈదురుగాలులకు గింజలు రాలవు. ఇప్పు డు సాగుచేస్తున్న హైబ్రీడ్ రకాల్లో ఎరువులు ఎక్కువ వాడుతారు. మొక్కలు బలహీనంగా ఉంటాయి. నేలకొరుగుతాయి, గింజలు రాలిపోతాయి. స్థానిక వాతావ రణ పరిస్థితులను తట్టుకునేలా.. జిల్లా, మండలాల వారీగా వరి రకంపై నిర్ణయం జరగాలి. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు సాక్షి, హైదరాబాద్: వరుసగా అకాల వర్షాలు.. వడగళ్ల వానలు.. ఈదురు గాలులు.. కోతకు వచ్చిన వరి రాలిపోయింది, కోసి పెట్టిన ధాన్యం నానిపోయింది. ఈ ఒక్కసారే కాదు.. ఏటా ఇదే పరిస్థితి. ఈ సమస్యను తప్పించుకునేందుకు వ్యవసాయ సీజన్‌నే ముందుకు జరిపే ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో వ్యవసాయ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. సాధ్యాసాధ్యాల పరిశీలనతోపాటు రైతుల్లో అవగాహన కల్పించేందుకూ ఏర్పాట్లు చేస్తోంది. వానాకాలం పంటను మే చివరివారంలో, యాసంగిని అక్టోబర్ తొలి వారంలో ప్రారంభిస్తే.. అకాల వర్షాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇక యాసంగి వరి కోతలను మార్చి నాటికే పూర్తిచేస్తే.. ధాన్యం మిల్లింగ్‌లో నూకలు పెరిగే సమస్య తప్పుతుందని సీఎం కేసీఆర్ సూచించడం గమనార్హం. అయితే సీజన్లను ముందుకు జరిపితే వచ్చే లాభనష్టాలపై వ్యవసాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాగును ముందుకు జరపడం ఇబ్బందికరమని కొందరు చెప్తుంటే.. ప్రత్యామ్నాయ వంగడాలను వాడటం వంటివి మేలని మరికొందరు సూచిస్తున్నారు. మే చివరిలోనే సాగు మొదలైతే.. రాష్ట్రంలో నీటి వనరులు, భూగర్భ జలాలు పెరగడం వరి సాగుకు సానుకూలంగా మారిందని.. ఏటా మే నెలాఖరు, జూన్ తొలివారంలో వానాకాలం వరి సాగు మొదలయ్యేలా చూడాలని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల సెప్టెంబర్ చివర, అక్టోబర్ ప్రారంభానికల్లా వరి చేతికి వస్తుందని.. అక్టోబర్‌లో వచ్చే అకాల వర్షాల ప్రభావం నుంచి బయటపడొచ్చని అంటున్నారు. ఇక వానాకాలం వరి కోతలు పూర్తికాగానే, అక్టోబర్ తొలివారంలోనే యాసంగి సాగు ప్రారంభిస్తే.. ఫిబ్రవరి నెలాఖరు, మార్చి తొలివారం నాటికే పంట చేతికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మార్చి నెల మధ్య నుంచి అకాల వర్షాల ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని పేర్కొంటున్నారు. ఈ మేరకు రైతులను సమాయత్తం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాట్లు వేసే విధానానికి బదులు నేరుగా ధాన్యం వెదజల్లే పద్ధతి పాటించడంపై రైతుల్లో అవగాహన పెంచాలని నిర్ణయించారు. క్లిష్టమైన వ్యవహారం! వానాకాలం సీజన్లో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో జూన్ 15 నుంచి జూలై 15 వరకు నాట్లు వేస్తారు. నీటి వసతి లేని ప్రాంతాల్లో ఆగస్టు 15 వరకు కూడా నాట్లు కొనసాగుతాయి. జూన్–జూలైలో వేసిన పంట నవంబర్ చివరి నాటికి చేతికి వస్తుంది. ఆగస్టులో వేసేవి డిసెంబర్ నాటికి చేతికి వస్తాయి. వానాకాలం పంటలు కోసిన తర్వాత 20 రోజులు ఆరబెట్టాల్సి ఉంటుంది. ఇక యాసంగి సీజన్‌కు సంబంధించి నవంబర్ 15 నుంచి నాట్లు వేయాలి. కానీ వానాకాలం పంట ఆలస్యం వల్ల యాసంగి ఆలస్యం అవుతోంది. డిసెంబర్, జనవరిలో కూడా నాట్లు వేస్తున్నారు. దీనివల్ల ఏప్రిల్, మే వరకు పంటలు చేతికి రావడం లేదు. ► మొత్తంగా నీటి వసతి, కాల్వల నుంచి విడుదల, వరి వంగడాల్లో రకాలు, మార్కెటింగ్ వంటి సమస్యలు ఉన్నాయి. ఈ పరిస్థితులే పంటలు చేతికి వచ్చే కాలాన్ని నిర్దేశిస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. ► ఉదాహరణకు నల్లగొండ జిల్లా రైతులకు ఆగస్టులో కాల్వల నుంచి నీళ్లు విడుదల చేస్తారు. అదే నిజామాబాద్ రైతులకు జూన్, జూలై నెలల్లోనే నీళ్లు అందుతాయి. దీనివల్ల రాష్ట్రంలో ఒక్కోచోట ఒక్కో సమయంలో వరి చేతికి వస్తుంది. ► నిజామాబాద్ జిల్లాలో అనేక చోట్ల మేలోనే నారు పోస్తారు. కొన్నిచోట్ల ఆ నెల చివరి నాటికే నాట్లు కూడా వేస్తారు. ఇదే పరిస్థితి ఇతర జిల్లాల్లో ఉండదు. దేశీ రకాలతో ప్రయోజనం మార్చిలోగా వరి కోతలు పూర్తికావాలంటున్నారు. మార్చిలో కూడా వడగళ్ల వర్షాలు పడుతున్నాయి కదా.. దీనికి వరిలో అన్నిరకాల కాలాలను తట్టుకునే దేశీ రకాలను వేయడమే పరిష్కారం. అదికూడా స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకునే వరి రకాలు వేసుకోవాలి. జిల్లా, మండలాల వారీగా నిర్ణయం జరగాలి. ఆ ప్రకారం రైతులను సన్నద్ధం చేయాలి. దేశీ రకాల్లో మొక్క గట్టిగా ఉంటుంది. భారీ వర్షం, వడగళ్లు పడినప్పుడు పంట నేలకొరిగినా దేశీ రకం మళ్లీ నిలబడుతుంది. వడగళ్లు, ఈదురుగాలులకు గింజలు రాలవు. హైబ్రీడ్ రకంలో మొక్క బలహీనంగా ఉంటుంది. సహజ వ్యవసాయం, దేశీ వరి రకాలు వేస్తే ఖర్చు తక్కువ వస్తుంది. దేశంలో 300 నుంచి 400 దేశీ వరి రకాలు ఉన్నాయి. దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. రైతులకు అవగాహన కల్పించకపోవడం వల్ల వీటి గురించి తెలియడంలేదు. తమిళనాడులో ఒక రైతు దేశీ రకం వరి వేస్తూ అక్కడి వ్యవసాయ వర్సిటీలో బోధన చేస్తున్నాడు. ఎకరాకు 40–50 క్వింటాళ్ల వరి దిగుబడి సాధిస్తున్నాడు. ఇక వెదజల్లే పద్ధతికి సంబంధించి జర్మినేషన్పై అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దానిపై రైతులు ఆసక్తి చూపరు. ఒక్కో ప్రాంతంలో పరిస్థితిని బట్టి ఒక్కో రకం వరి వేసుకోవాలి. గంపగుత్తగా ఒకే విధంగా, ఒకే సమయంలో వేసుకోవాలని చెప్పడం సరికాదు. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు ముందస్తు సీజన్లు సాధ్యంకాదు సంక్రాంతికి అంటే జనవరి 15 సమయంలో యాసంగి పంట వేస్తారు. మార్చి చివరికి అంటే 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. డిసెంబర్లో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు నారు పెరగదు. మొక్క పెరగదు. అప్పుడు వరి వేయకూడదని రైతులకు చెప్పాలి. పైగా తెలంగాణ పీఠభూమి. పీఠభూమి మీద క్యుములోనింబస్ మేఘాల కారణంగా వడగళ్ల వర్షాలు పడతాయి. రైతులు జనవరి 15కు ముందు యాసంగి నారు వేయరు. అంతేకాదు ఫిబ్రవరిలోనూ రాళ్ల వర్షం వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత మార్చి, ఏప్రిల్ నెలల్లోనూ వస్తాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అంతేతప్ప ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటే రైతులు నష్టపోతారు. – సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం జాతీయ నాయకుడు నెలలో రెండు సార్లు దెబ్బ గత నెల రోజుల్లో రెండుసార్లు కురిసిన భారీ వడగళ్ల వానల ధాటికి రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. తొలివానలకు 5 లక్షల ఎకరాల్లో, రెండోసారి ఏకంగా 12 లక్షల ఎకరాల్లో నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంకా వ్యవసాయ శాఖ సర్వే కొనసాగుతోంది. పూర్తి అంచనాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ అకాల వర్షాలపై మంగళవారం సమీక్షించిన సీఎం కేసీఆర్.. పంటల సీజన్లను కాస్త ముందుకు జరపాలని, యాసంగి సీజన్ వరి కోతలు మార్చిలోగా పూర్తయ్యేలా చూడాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై వ్యవసాయ శాఖ దృష్టిపెట్టింది. -
Telangana: కల్లాల్లో కన్నీళ్లు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలతో కోతకు వచ్చిన వరి పొలంలోనే నేలరాలింది. కోసి పెట్టిన ధాన్యం నీట మునిగింది. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు వరదకు కొట్టుకుపోయాయి. 4.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసినా.. ఒక్క వరి పంటే ఐదు లక్షల ఎకరాలకుపైగా దెబ్బతిన్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తోంది. కొన్నిచోట్ల ఎకరా పొలంలో కనీసం క్వింటాల్ ధాన్యం కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఒక్క వరి మాత్రమే కాదు.. మామిడి, నువ్వులు, మిరప, మొక్కజొన్న, టమాటా వంటి ఇతర పంటలు కూడా వడగళ్ల బీభత్సానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా సంగారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట తదతర జిల్లాల్లో మామిడి భారీగా నేలరాలింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పంట నష్టం అత్యధికంగా.. ఖమ్మం, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో కాస్త తక్కువగా ఉంది. ఈదురుగాలులు, వడగళ్లతో అధిక నష్టం వేసవిలో అకాల వర్షాలు మామూలే అయినా.. ఈసారి తీవ్రమైన ఈదురుగాలులు, వడగళ్లతో ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తుండటం తీవ్ర నష్టానికి కారణం అవుతోందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల ఎకరానికి క్వింటాల్ వడ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని.. వరికోత కోసం తెచ్చే హార్వెస్టర్ అద్దెకు సరిపడా ధాన్యం కూడా వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు. పొలాలను కౌలుకు తీసుకొని వరిసాగు చేసిన రైతులకు మరింత దెబ్బపడింది. కౌలు, పెట్టుబడి కలిపి ఒక్కో ఎకరాకు 20వేలకుపైనే నష్టపోతున్నామని, ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు. తడిసిన ధాన్యం ముందుగా వరి సాగు చేసిన నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నల్లగొండతోపాటు వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి తదతర జిల్లాల్లో కోతలు మొదలయ్యాయి. 2వేలకుపైగా కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇంకా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. రైతులు తెచ్చిన పంటను కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోశారు. అకాల వర్షాలతో అంతా తడిసిపోయింది. పలుచోట్ల కొట్టుకుపోయింది. మొత్తంగా 5 లక్షల టన్నుల ధాన్యం తడిసినట్టు పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకృతి బీభత్సం నేపథ్యంలో వరి దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందని.. కోటి టన్నుల సేకరణ అంచనా వేసుకున్నా, అందులో సగమైనా వస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఏడెకరాల్లో నష్టపోతే అర ఎకరమే రాశారు నేను ఏడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. గత నెలలో కురిసిన వానలకు పంట పూర్తిగా నేలవాలింది. అయినా అధికారులు అర ఎకరమే నష్టం జరిగినట్లు రాశారు. మిగిలిన కాసింత పంటనూ వ్యాపారులు తక్కువ ధరకే అడుగుతున్నారు. నష్టమెలా పూడ్చుకోవాలో తెలియడం లేదు. – వరి మేకల నాగయ్య, రైతు, సువర్ణాపురం, ముదిగొండ మండలం రాళ్లవాన ముంచింది మూడెకరాల్లో వరి వేసిన. తెల్లారి కోద్దామనుకుంటే.. రాత్రి మాయదారి రాళ్లవాన నిండా ముంచింది. గింజలన్నీ మట్టిలో కలిసిపోయాయి. సర్కారు ఆదుకోవాలి. లేకుంటే కుటుంబం రోడ్డుపడుతుంది. – గుగులోతు నీల, మహిళా రైతు, ఆంధ్ర తండా, జనగామ జిల్లా పావు మందమే వడ్లు మిగిలాయి ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేసిన. వడగళ్ల వానతో పంటంతా నేలవాలి గింజలు రాలిపోయాయి. పావు మందమే వడ్లు మిగిలాయి. మిషిన్ పెట్టి కోయిస్తే గడ్డి మాత్రమే మిగులుతుంది. – రైతు ఆవుల మహేందర్, గర్రెపల్లి, సుల్తానాబాద్ పంట నష్టం అంచనాలివీ.. ఉమ్మడి కరీంనగర్లో.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో లక్ష ఎకరాలకుపైగా వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో వరి పంటే 80 వేల ఎకరాల్లో నష్టపోయింది. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 50వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60వేల మంది రైతులపై వర్షం ప్రత్యక్ష ప్రభావం చూపినట్టు అంచనా. మెదక్ ఉమ్మడి జిల్లాలో.. సిద్దిపేటలో పంట నష్టం అధికంగా ఉంది. ఈ జిల్లాలో 86,203 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఇందులో 79,350 ఎకరాల్లో వరికి నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మెదక్‌లో 13,632 ఎకరాల్లో వరి, 342 ఎకరాల్లో మామిడి దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లా పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో లక్షన్నర టన్నుల ధాన్యం తడిసినట్లు అనధికారిక అంచనా. సంగారెడ్డి జిల్లాలో నష్టం తక్కువగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్‌లో.. కామారెడ్డి జిల్లాలో 22 వేల మంది రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొత్తంగా 32 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో వరి, మొక్కజొన్న, నువ్వు, పొద్దుతిరుగుడు, పసుపు, ఉద్యాన పంటలకు 600 ఎకరాల్లో నష్టం జరిగింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు తడిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో లక్షన్నర ఎకరాల వరకు వివిధ పంటలు నష్టపోయినట్టు సమాచారం. అయితే 75,603 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఇందులో 58 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 7,603 ఎకరాల్లో ఇతర పంటలు ఉన్నట్టు పేర్కొన్నారు. జనగామలో వరి బాగా దెబ్బతింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో.. మంచిర్యాల జిల్లాలో 2,379 ఎకరాల్లో వరి, 309 ఎకరాల్లో మామిడి.. ఆదిలాబాద్ జిల్లాలో 2వేల ఎకరాల్లో జొన్న పంటలకు నష్టం జరిగినట్టు అంచనా వేశారు. ఆసిఫాబాద్‌లో 3,419 ఎకరాల మేర పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో.. సూర్యాపేట జిల్లాలో 25వేల ఎకరాలకుపైగా వరికి నష్టం వాటిల్లగా, సుమారు 1,000 ఎకరాల్లో మామిడి తోటలు నాశనమయ్యాయి. యాదాద్రి జిల్లాలో 11వేల ఎకరాల్లో వరి దెబ్బతిన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం జిల్లాలో వరి 8,169 ఎకరాల్లో, మొక్కజొన్న 1751 ఎకరాల్లో నష్టపోయినట్టు కలెక్టర్‌కు వ్యవసాయ శాఖ నివేదించింది. -
పంటలన్నీ వర్షార్పణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక జిల్లాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. మొలక దశలో ఉండటం వల్ల అనేక పంటలు కొట్టుకుపోగా కొన్నిచోట్ల వాటిపై పూర్తిగా ఇసుక మేటలు వేసింది. మరికొన్నిచోట్ల నీటిలో మొలకలు మురిగిపోయాయి. ప్రాథమిక అంచనా ప్రకారమే 11 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి నష్టం సంభవించింది. మరోవైపు ఇప్పటికే సాగు దశలో ఉన్న వరితోపాటు మొలక దశలో ఉన్న పత్తి నాశనమైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 1,200 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. అయితే అధికారికంగా పూర్తిస్థాయిలో అంచనాలు ఇంకా రూపొందించలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ విత్తనాలను వేయాలంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులు రూ. వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జూన్ మొదటి వారం నుంచే రైతులు పత్తి, మొక్కజొన్న విత్తడంతో మళ్లీ నష్టం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండోసారి నాటిన రైతులు వానలతో మూడోసారి విత్తనాలను విత్తాల్సిన పరిస్థితి. దీంతో ఖర్చు పెరిగిపోతుందని వాపోతున్నారు. భారీగా పత్తి నష్టం... ఈ సీజన్లో ఇప్పటివరకు పత్తి 38.48 లక్షల ఎకరాల్లో సాగు అయింది. వానలతో సుమారు 8 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. ఇప్పటివరకు ఒక్కో ఎకరానికి సుమారు రూ. 10 వేల వరకు సరాసరి రైతులు పెట్టుబడిగా పెట్టారు. మొత్తం పత్తి సాగుకు ఎకరానికి రెండు విత్తన ప్యాకెట్ల చొప్పున సుమారు 76.96 లక్షల విత్తన ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడి ప్రకారం పరిశీలిస్తే 8 లక్షల ఎకరాల్లో సుమారు రూ. 800 కోట్ల నష్టం ఒక్క పత్తిలోనే సంభవించిందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వరి, కంది, సోయాబీన్, మొక్కజొన్న పంటలకూ భారీగానే నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. సోయాబీన్‌కు అధిక వానలు మరింత నష్టాన్ని కలిగించాయి. వరి చాలా వరకు వరద నీటిలో మునగడంతో ఎర్రబారిపోయింది. కంది, మొక్కజొన్న మొలక దశకు చేరుకున్నప్పటికీ అధిక పదును, వరద నీరు పారడంతో కొట్టుకుపోయింది. ఈ పంటలన్నింటికీ కలిపి సుమారు రూ. 400 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. జిల్లాలవారీగా... నిజామాబాద్ జిల్లాలో 49,591 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 143 గ్రామాల్లో 2,900 మంది రైతులు 5,620 ఎకరాల్లో పంటను నష్టపోయారు. మంచిర్యాల జిల్లాలో 27,592 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 45,420 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1.03 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 29,085 మంది రైతులు నష్టపోయారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 20,293 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. మళ్లీ విత్తనాలు వేయాల్సిందే... వర్షాలకు పంటలు దెబ్బతిన్న సుమారు 11 లక్షల ఎకరాల్లోనూ తిరిగి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఉంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు అంటున్నాయి. అయితే రెండోసారి విత్తాల్సి ఉన్నా కొన్నిచోట్ల భూమి అనుకూలిస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇతర పంటల వైపు మళ్లాలా లేదా అనేది వ్యవసాయశాఖ అంచనా వేయాల్సి ఉంటుంది. విత్తనాలు సిద్ధంగా ఉంచాం.. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఎక్కడైనా రెండోసారి విత్తాల్సి వస్తే ఆ మేరకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను సిద్ధంగా ఉంచాం. పత్తి, వరి విత్తనాలను ప్రైవేటు కంపెనీలు సిద్ధం చేసినందున ఎక్కడా ఇబ్బంది తలెత్తదు. పంట నష్టం అంచనాపై ఇప్పటివరకు జిల్లాలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కొన్నాళ్లుగా విత్తనాలకు సబ్సిడీ ఇవ్వడంలేదు. కాబట్టి ఈసారి అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. – రఘునందన్‌రావు, కార్యదర్శి, వ్యవసాయశాఖ ప్రభుత్వం ఆదుకోవాలి... మూడెకరాల్లో పత్తి వేశా. విత్తనాలు, దుక్కులు, ఇతరత్రా ఖర్చులకు ఎకరానికి రూ. 30 వేల పెట్టుబడి పెట్టా. గోదావరి బ్యాక్‌వాటర్‌తో ఈసారి పంటంతా నీట మునిగింది. ఇసుక మేటలు వేసింది. పొలంలో విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో కరెంట్ బంద్ చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలి. – బోగిరి ప్రభాకర్, పోతారం, మంథని నష్టపరిహారం చెల్లించాలి... నాలుగు ఎకరాల్లో పత్తి వేశా. విత్తనాలు, కూలీలకు కలిపి మొత్తం రూ. 30 వేలు ఖర్చయింది. విత్తనాలు మొలకెత్తకముందే వర్షానికి కొట్టుకుపోయాయి. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలి. పంబలి సాయిలు, జంగంరెడ్డిపల్లి, అమ్రాబాద్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా -
Heavy Rains: పొలాల్లో నీళ్లు.. రైతు కన్నీళ్లు
పై చిత్రంలోని మహిళా రైతు పేరు బొలిశెట్టి రుక్కమ్మ పాత మంచిర్యాల శివారులో 11 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేసింది. ఈ ఏడాది జూలైలో వచ్చిన గోదావరి వరదతో చేను నీట మునగడంతో.. రెండోసారి విత్తనాలు వేసింది. కలుపు తీసి, ఎరువులు వేసి.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. తీరా ఇప్పుడు పంట చేతికొచ్చే దశలో కురిసిన వానలు మళ్లీ దెబ్బతీశాయి. ఎల్లంపల్లి నుంచి భారీగా నీటిని వదలడంతో గోదావరి పోటెత్తి పంట మొత్తం నీట మునిగింది. ఇప్పటివరకు రూ. 4 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టామని.. రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంట మొత్తం నీటిపాలైందని రుక్కమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నిండా మునిగి పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి, చెరువులు అలుగులు పారి పొలాలు, చేన్లలో నీళ్లు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 6.20 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో 1.20 లక్షల ఎకరాల్లో పంటలు ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. పొలాల నుంచి నీళ్లు తొలగిస్తే.. మిగతా పంటలు గట్టెక్కే అవకాశం ఉందని అంటున్నాయి. (చదవండి: బీజేపీని గెలిపిస్తే.. వంటగ్యాస్ రూ.1,500 దాటుతుంది) 14 జిల్లాల్లో అత్యధికంగా.. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో పంటలు నీట మునిగినట్టు అధికారులు గుర్తించారు. ఇం దులో 14 జిల్లాల్లో అత్యధికంగా, నాలుగు జిల్లాల్లో పాక్షికంగా పంటలు దెబ్బతిన్నట్టు అంచనా వేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరి సిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అనేక చోట్ల పంటలు నీట మునిగినట్టు తేల్చారు. ఈ జిల్లాల్లో కుంభవృష్టి కురవడంతో వాగులు, వంకలు ఉప్పొం గాయి. పలుచోట్ల చెరువులు, ఒర్రెలు తెగడంతో నీళ్లన్నీ పొలాల్లో చేరాయి. పత్తి, వరి, పసుపుతో పాటు పునాస పంటలు మొక్కజొన్న, కందులు, నువ్వులు, వేరుశనగ దెబ్బతిన్నాయి. ► ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో పాక్షికంగా పంటలు నీట మునిగాయని అధికారులు అంచనా వేశారు. మిగతా జిల్లాల్లోనూ స్వల్పంగా పంటలు నీట మునిగాయని, కొన్నిచోట్ల దెబ్బతిన్నాయని పేర్కొంటున్నారు. అయితే ఈ వివరాలను వ్యవసాయశాఖ వర్గాలు అధికారికంగా వెల్లడించడం లేదు. పంట నష్టం వివరాలను సేకరిస్తున్నామని.. ప్రభుత్వం అడిగితే పైఅధికారులకు పంపిస్తామని చెప్తున్నారు. (చదవండి: TSRTC: కారుణ్యం లేదు.. కనికరం లేదు) 1.22 కోట్ల ఎకరాల్లో సాగు ఈసారి వానలు ముందే మొదలవడంతో జూన్ తొలివారంలోనే రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు మొదలైంది. 1.22 కోట్ల ఎకరాల్లో సాగు జరిగిందని.. అందులో 50.85 లక్షల ఎకరాలలో పత్తి, 49.87 లక్షల ఎకరాలలో వరి, 6.12 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 8.98 లక్షల ఎకరాల్లో కంది, 1.34 లక్షల ఎకరాల్లో పెసర, 3.48 లక్షల ఎకరాల్లో సోయా పంటలు వేసినట్టు అధికారులు చెప్తున్నారు. పలు జిల్లాల్లో నష్టం తీరు ► పెద్దపల్లి జిల్లాలో 450 ఎకరాల్లో పత్తి, 50 ఎకరాల్లో వరి పంటలు నీట మునిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ► సంగారెడ్డి జిల్లాలో 5,387 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో పెసర, మినుము, సోయాబీన్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి చేన్లలో నీళ్లు నిలవడంతో మొక్కలు రంగు మారుతున్నాయి. ► మెదక్ జిల్లాలో 641 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ► సిద్దిపేట జిల్లాలో 7,117 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 4,325 ఎకరాలు, పత్తి 1,870, మొక్కజొన్న 593, కంది 329 ఎకరాల్లో దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు. ► రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6,890 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించారు. ► నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 3,729 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. మరో 7,311 ఎకరాల్లో పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో పంట నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని రైతులు చెప్తున్నారు. నష్ట పరిహారం ఎలా? రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు బీమా అందే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కేంద్రం అమలు చేసే ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)’ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలగడమే దీనికి కారణం. కేంద్రం ఫసల్ బీమాను 2016–17లో ప్రారంభించింది. భారీ వర్షాలు, తుఫాన్లు వంటివాటితో జరిగే పంట నష్టాలకు పరిహారం అందుతుంది. ప్రీమియం సొమ్ములో రైతులు 2–5 శాతం వరకు చెల్లిస్తే.. మిగతా మొత్తంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం భరించాలి. తెలంగాణ ప్రభుత్వం 2020 వర్షాకాలం నుంచి ఫసల్ బీమాను రాష్ట్రంలో నిలిపివేసింది. రైతు యూనిట్‌గా ఇవ్వాలని..: ఫసల్ బీమా పథకం కొన్ని పంటలకు గ్రామం యూనిట్‌గా, మరికొన్నింటికి మండలం యూనిట్‌గా అమలవుతుంది. కొందరికే నష్టం జరిగితే బీమా పరిహారం వచ్చే అవకాశం ఉండదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతు యూనిట్‌గా ఫసల్ బీమాను అమలు చేయాలని డిమాండ్ చేసింది. కానీ కేంద్రం మార్చలేదు. అంతేగాకుండా బీమా ప్రీమియం కింద ఎక్కు వగా సొమ్ము చెల్లించాల్సి రావడంతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని ఆపేయాలన్న నిర్ణయా నికి వచ్చిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే.. ఫసల్ బీమాను వద్దనుకున్న బిహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు సొంత పథకాలను ప్రారంభించాయి. ఏపీ కూడా కేవలం రూపాయి ప్రీమియంతో ఉచితంగా కేంద్ర పథకాన్ని అమలు చేస్తోంది. కానీ రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా పథకం చేపట్టక ఇప్పుడు పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం అందే పరిస్థితి లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. మూడుసార్లు మునిగి.. నాకు మూడెకరాల పొలం ఉంది. జూలైలోనే వరినాట్లు వేసినా అప్పట్లో కురిసిన కుంభవృష్టితో నారు మొత్తం కొట్టుకుపోయింది. వెంటనే మరోసారి నాట్లు వేశాను. మరో వారం తర్వాత కురిసిన వానలకు రెండోసారీ వృధా అయింది. నాకు వ్యవసాయమే బతుకుదెరువు. అందుకే మూడోసారి వరి నారు కొని నాట్లు వేసిన. పంట ఏపుగా పెరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ కురిసిన భారీ వర్షాలతో వరి మొత్తం కొట్టుకుపోయింది. ఏం చేయాలో అర్థంకావడం లేదు. ప్రభుత్వమే ఏదో ఒక విధంగా ఆదుకోవాలి. -నిమ్మ రాజారెడ్డి, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా పంట జాడే లేకుండా పోయింది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సిత్యా తండాలో ఇసుక మేటలు వేసిన వరి పొలం ఇది. వాంకుడోతు సోమ అనే రైతు రెండున్నర ఎకరాల్లో వరి వేశాడు. ఇటీవలి వర్షాలకు బుంగ వాగు ఉప్పొంగి ఈ పంట నీట మునిగింది. ఒకటిన్నర ఎకరాల్లో ఇసుక, మట్టి మేట వేసి.. అసలు పంట వేసిన ఆనవాళ్లే లేకుండా పోయాయి. నెల రోజులైతే పంట చేతికి వచ్చేదని.. తమ శ్రమ అంతా మట్టిలో కలిసిపోయిందని సోమ ఆవేదనలో మునిగిపోయాడు. పొలంలో ఇసుక, మట్టి మేటలను తొలగించాలంటే లక్ష రూపాయలదాకా ఖర్చువుతుందని, ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన కోరుతున్నాడు. కూతురి పెళ్లి అప్పు తీర్చాలనుకుంటే.. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మూడు వీరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం టాక్యా తండాకు చెందిన ఆయన.. నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఈసారి పంట బాగుంటే.. తన కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చవచ్చని ఆశపడ్డాడు. కానీ భారీ వర్షాలతో పత్తి చేను నీట మునిగింది. ఇప్పుడు అప్పులెలా తీర్చాలె, బతుకెట్లా గడవాలి అంటూ ఆందోళనలో పడ్డాడు. పంట పోయింది.. ఏం చేయాలె? మెదక్ జిల్లా రేగేడు మండల కేంద్రానికి చెందిన కుమ్మరి సాయిలు పత్తి చేను ఇది. సాయిలు తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. భారీ వర్షాలకు పంటంతా నీట మునిగింది. పత్తి కాయలు రాలిపోవటంతోపాటు రంగు మారింది. కనీసం పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేకుండా పోయిందని సాయిలు ఆందోళన చెందుతున్నాడు. ఇప్పుడేం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోదేపల్లికి చెందిన రైతు నోముల శ్రీధర్‌కు చెందిన మొక్కజొన్న చేను ఇది. ఆయన వేసిన రెండెకరాల మొక్కజొన్న ఇటీవలి భారీ వర్షాలకు నేలకొరిగింది. వానలు ఇంకా కొనసాగుతుండటంతో ఇక పంట ఏ మాత్రం చేతికందే పరిస్థితి లేదంటూ శ్రీధర్ ఆవేదనలో మునిగిపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. -
నష్టం అపారం.. కేంద్రం చూపాలి ఔదార్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల వివిధ రంగాలకు అపార నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న పంటలు నీట మునిగాయి. రహదారులు, చెరువులు, కాలువలు కొట్టుకుపోవడం, గండ్లు పడటంవల్ల మౌలిక సౌకర్యాలు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలిక మరమ్మతులుతోపాటు శాశ్వతంగా పునరుద్ధరించడం రాష్ట్ర ప్రభుత్వానికి పెను భారమే. కరోనా వల్ల ఆదాయాలు గణనీయంగా తగ్గిన సమయంలో వరద పోటు అన్ని రంగాలను కుంగదీసింది. వరద నష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించి సాయంపై సిఫార్సు చేసేందుకు కేంద్ర బృందం ఈనెల 9, 10వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరుతూ రంగాలవారీగా రూ.6,300 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రూపొందించింది. పెట్టుబడులు మట్టిపాలు కావడంపై తల్లడిల్లుతున్న రైతులకు త్వరగా నష్ట పరిహారం చెల్లించి అండగా నిలిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్నదాతలకు తీరని కష్టం కోస్తాలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోత దశలో ఉన్న వరి నీట మునగడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. అనంతపురం జిల్లాలో వేరుశనగ భారీ వర్షాలతో కుళ్లిపోయింది. ప్రధాన వాణిజ్య పంట పత్తి పాడైంది. మిరప, ఉల్లి, బొప్పాయి, అరటి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ► ఆగస్టు నుంచి అక్టోబరు వరకు భారీ వర్షాలు, వరదల వల్ల అధికారిక గణాంకాల ప్రకారమే 2,12,587 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా 1,40,485 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. వరి తర్వాత పత్తికి ఎక్కువగా నష్టం వాటిల్లింది. మొత్తం 3,68,679 మంది రైతులు నష్టపోయారు. ► 24,516.71 హెక్టార్లలో ఉద్యాన పంటలు పాడయ్యాయి. మిరప, కూరగాయలు, అరటి, బొప్పాయి, ఉల్లి, పసుపు వర్షాలతో దెబ్బతిన్నాయి. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 80,616.94 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లడం గమనార్హం. ► వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు రూ.279.36 కోట్ల పెట్టుబడి రాయితీ అందించాలని ప్రభుత్వం లెక్కలు రూపొందించింది. రంగాలవారీగా నష్టం ఇలా.. ► పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 3,125.91 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. మొత్తమ్మీద శాఖకు రూ.781.73 కోట్ల నష్టం వాటిల్లింది. జాతీయ విపత్తు సహాయ నిధి నిబంధనల ప్రకారం తాత్కాలిక పునరుద్ధరణ పనులకు రూ. 67.26 కోట్లు అవసరమని అంచనా. ► రహదారులు భవనాల శాఖకు చెందిన 5,583.32 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. 116 చోట్ల గండ్లు పడ్డాయి. శాఖకు రూ. 2,976.96 కోట్ల మేర నష్టం జరిగింది. మౌలిక సౌకర్యాల తాత్కాలిక పునరుద్ధరణ పనులకు రూ.283.75 కోట్లు అవసరమని అంచనా. ► జలవనరుల శాఖ పరిధిలోని 1,081 చిన్నతరహా నీటి వనరులు దెబ్బతిన్నాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడగా కొన్ని చోట్ల గట్లు కొట్టుకుపోయాయి. 142 మధ్యతరహా నీటి వనరులు, 443 భారీ నీటిపారుదల పనులు భారీ వరదల వల్ల దెబ్బతిన్నాయి. శాఖకు రూ.1,074.29 కోట్ల మేర నష్టం జరిగింది. ► పురపాలక శాఖ పరిధిలో 399.35 కిలోమీటర్ల పొడవున రహదారులు పాడయ్యాయి. 212.25 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజి, 90.66 కిలోమీటర్ల పైప్‌లైన్ దెబ్బతింది. తాత్కాలిక మరమ్మతుల కోసం జాతీయ విపత్తు సహాయ నిధి నిబంధనావళి ప్రకారం రూ.75.40 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. -
రైతు భరోసా పెద్ద వరం
రైతు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే దేవుడు. ఇప్పుడు భగవంతుడే మీ రూపంలో వచ్చాడు. గతంలో వ్యవసాయం ఎందుకు చేస్తున్నామా అనిపించేది. మీరు సీఎం అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిజంగా వ్యవసాయం అంటే పండుగగా మార్చారు. ఈ సంవత్సరం జగనన్న నామ సంవత్సరం. ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా ఎంతో మేలు జరుగుతోంది. వరికోత యంత్రాలను రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంచాలి. డ్రైన్లు ఆక్రమణలపై దృష్టి పెట్టాలి. ప్రతీ రైతు మీ వెనకే ఉన్నాడు. (సీఎం జోక్యం చేసుకుంటూ ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని ఆర్బీకేల్లో వరికోత యంత్రాలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. డ్రైన్స్ ఆధునికీకరణ చేస్తామన్నారు.) – రావుల ప్రసాద్, కరప మండలం, తూర్పుగోదావరి జిల్లా సాక్షి, అమరావతి: ‘రైతు భరోసా పథకం రైతులకు పెద్ద వరం లాంటిది. మా జీవనాధారమైన సాగును మీరు (సీఎం) పుష్కలం చేస్తున్నారు. పంట దెబ్బతిన్న సీజన్లోనే పరిహారం ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఆర్బీకేల్లో రైతులకు అవసరమైనవన్నీ ఇవ్వడం సంతోషంగా ఉంది’ అని పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ కింద రెండో ఏడాది రెండో విడత పెట్టుబడి సాయాన్ని సీఎం వైఎస్ జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని రైతులు ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. ఆర్బీకేలు రైతుల దేవాలయాలు ఖరీఫ్, రబీ సీజన్ల ఇన్పుట్ సబ్సిడీ ఆయా సీజన్లలోనే ఇస్తామనడం చాలా సంతోషదాయకం. దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. ఇందుకు మీకు ధన్యవాదాలు. రైతు భరోసా అనేది రైతులకు పెద్ద వరం. రైతు భరోసా కేంద్రాలు రైతుల పాలిట దేవాలయాలు. వాటి వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటోంది. మాకు కావాల్సిన పురుగు మందులు, ఎరువులు అన్నీ అక్కడే దొరుకుతున్నాయి. కాల్ సెంటర్ 155251 ద్వారా మాకు ఎన్నో సలహాలు అందుతున్నాయి. కలకాలం మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి. – చంద్రశేఖర్, రైతు, కర్నూలు ఆజన్మాంతం రుణపడి ఉంటాం పాదయాత్రలో మీరు రైతుల కష్టనష్టాలు కళ్లారా చూశారు. ఇప్పుడు అన్ని విధాలా ఆదుకుంటున్నారు. రైతు భరోసా ద్వారా వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతోంది. వేసవి దుక్కులకు, వరినార్లు్ల పోసుకునేందుకు మే నెలలో రూ.7,500 ఇచ్చారు. ఇప్పుడు కోతల సమయంలో రూ.4 వేలు అందిస్తున్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. మాకు జీవనాధారమైన సాగును పుష్కలం చేస్తున్నందుకు మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాం. – అల్లు సూర్యనారాయణ, ధర్మవరం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం పంట పరిహారం అదే సీజన్లో అందించడం సంతోషం ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇదివరకు ఎప్పుడో ఏళ్ల తర్వాత వచ్చేది. ఒక పంట నష్టపోతే అదే సీజన్లో పరిహారం అందించడమనేది గర్వించతగ్గ విషయం. మొన్న ఆగస్టు నెలలో పెసర, మినప పంటలు వేసి నష్టపోయిన నాతో పాటు నా తోటి రైతులందరికీ 60 రోజులు కాకముందే హెక్టారుకు రూ.10 వేలు చొప్పున డబ్బులు అందాయి. చాలా సంతోషంగా ఉంది. రైతు భరోసా కౌలు రైతులకు కూడా వర్తింప చేయడం గొప్ప విషయం. – వెంకటసుబ్బారావు, దండేపల్లి, కంచికచర్ల, కృష్ణా -
ఏపీలో కొత్త చరిత్ర
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మాం. దేశ చరిత్రలో ఎక్కడా కూడా రైతుకు ఏటా రూ.13,500 ఇచ్చిన దాఖలాలు లేవు. అది మన రాష్ట్రంలోనే ఉంది. రైతుల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నాం. ఇవన్నీ చూసి ఓర్చుకోలేని కొందరు.. ఈ నెల 16న వర్షాలు ముగిసినా, 10 రోజుల తర్వాత ట్రాక్టర్‌కు పూలు కట్టి మరీ పర్యటిస్తున్నారు. దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి మంచిగా వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులన్నీ నిండాయి. దీనికితోడు ఇప్పుడు ఇస్తున్న ఆర్థిక సాయంతో రైతులు పంటలు బాగా పండించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఈ ఖరీఫ్ సీజన్ ఇన్పుట్ సబ్సిడీని ఇదే సీజన్లో ఇస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లోనే పంట నష్టపరిహారం చెల్లించామని గర్వంగా చెబుతున్నామన్నారు. అక్టోబర్ నెలలో వరదలు, భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నవంబర్‌లోగా పరిహారం ఇస్తామని ప్రకటించారు. ‘వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్’ కింద రెండో ఏడాది రెండో విడత చెల్లింపులను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.1,115 కోట్లు జమ చేశారు. అలాగే రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఖరీఫ్ ఇన్పుట్ సబ్సిడీని అదే సీజన్లో చెల్లిస్తూ.. 1.66 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.135.73 కోట్లు జమ చేశారు. కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రాలు పొంది సాగుకు సిద్ధమైన రైతులకు కూడా రైతు భరోసా–పీఎం కిసాన్ పథకాన్ని వర్తింప చేశారు. ఆ మేరకు ఈ ఏడాది రెండు విడతలకూ కలిపి రూ.11,500 చొప్పున 1.02 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో దాదాపు రూ.118 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వివిధ జిల్లాల్లోని రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేసే అవకాశం దేవుడు తనకిచ్చారన్నారు. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ ఏడాది అర కోటికి పైగా రైతులకు దాదాపు రూ.6,800 కోట్లు సహాయంగా అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల ఇళ్లుంటే, వాటిలో 50 లక్షల ఇళ్లకు.. అంటే మూడో వంతు ఇళ్లకు మేలు కలిగేలా పెట్టుబడి సహాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. రైతులకు చెక్కు అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు కన్నబాబు, సుచరిత, వేణుగోపాలకృష్ణ, సీఎస్ నీలం సాహ్ని తదితరులు రైతులకు మెరుగైన భద్రత – మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలుత 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,173 కోట్లు గత ఏడాది ఇచ్చాం. ఈ ఏడాది 50.47 లక్షల రైతు కుటుంబాలకు సహాయం చేస్తున్నాం. – దేశ చరిత్రలోనే రైతులకు మెరుగైన భద్రత, ఉపాధి మన రాష్ట్రంలో లభిస్తోంది. రైతు భరోసా కింద ఇచ్చిన హామీ కంటే మిన్నగా, రూ.12,500 బదులు రూ.13,500 ఇస్తున్నాం. కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన గిరిజన రైతులకు, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా సాయం చేస్తున్నాం. – గతంలో ఏనాడూ అదే (సేమ్) సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. 2018లో నష్టానికి పరిహారం పూర్తిగా ఎగ్గొట్టారు. రైతుల మేలు కోసం ఎన్నెన్నో.. – 10,641 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని విధాలా అండగా నిలిచాం. – వైఎస్సార్ జలకళ ద్వారా ఉచితంగా బోరు బావుల తవ్వకంతో పాటు పేద రైతులకు మోటార్లను కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తాం. – రైతుల ఉచిత విద్యుత్ బకాయిలు రూ.8,655 కోట్లు, ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, విత్తనాల సబ్సిడీ రూ.384 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కింద రూ.1,046 కోట్లు చెల్లించాం. – ఫీడర్ల సామర్థ్యం పెంచాం. పంటల బీమా ప్రీమియమ్ రూ.1,030 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తోంది. గత ఏడాది రూ.15 వేల కోట్లతో వరి ధాన్యం కొనుగోలు చేశాం. రూ.3,200 కోట్లతో వివిధ పంటలు కొనుగోలు చేశాం. చరిత్ర సృష్టిస్తున్నారు ఇది చరిత్రాత్మక రోజు. ఈ ఖరీఫ్‌కు సంబంధించి ఇదే సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని కేవలం మీరు (వైఎస్ జగన్) మాత్రమే ఇస్తున్నారు. కరోనా సమయంలోనూ ఏదీ ఆపడం లేదు. రాష్ట్రంలో హరిత విప్లవం సాధిస్తున్నారు. – కె.కన్నబాబు. వ్యవసాయ శాఖ మంత్రి -
పంట నష్టం త్వరగా అంచనా వేయండి
సాక్షి, అమరావతి: భారీ వరదలు, వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు వెంటనే పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ తదితర నియోజకవర్గాల పరిధిలోని ముంపు ప్రాంతాలను, దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలను, లంక భూములు, నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. – వీలైనంత వేగంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలి. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే రైతులకు రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతుంది. – ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం ఇప్పటికే ఐదు నిత్యావసర సరుకులతో ఉచిత రేషన్‌ను అందిస్తోంది. – మిగిలిన జిల్లాల్లో కూడా వరదల్లో మునిగిన పంటలతో పాటు ఇళ్లు, పశువులు నష్టపోయిన వారిని గుర్తించి వెంటనే పరిహారం ఇవ్వాలి. – సీఎం వెంట హోం మంత్రి మేకతోటి సుచరిత, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, అధికారులు ఉన్నారు. ఆదుకునేందుకు పలు చర్యలు – భారీ వర్షాలు, వరదలపై ఇప్పటికే పలుమార్లు అధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి సాయం చేయాలని కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే. – ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.4,450 కోట్ల నష్టం జరిగిందని, బాధితులను ఆదుకోవడానికి రూ.2,250 కోట్ల సాయం అందించాలని కోరారు. తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. – వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. -
వదలని వానలు,కాలనీలు జలమయం
-
నీట మునిగిన పంటలు
-
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
-
ఎర్రజొన్న కొనాల్సిందే
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు ఎర్రజొన్న పంటను వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేయాల్సిందేనని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ అధికారులు, ఎర్రజొన్న వ్యాపారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతులతో నిర్వహించిన సమవేశంలో కలెక్టర్ మాట్లాడారు. రైతుల, వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సాగును మెల్ల మెల్లగా తగ్గించుకోవాలని గతేడాదే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలియజేశామని కలెక్టర్ పేర్కొన్నారు. అయితే కాల పరిమితి, తక్కువ తడులతో ఈ పంట అనుకూలంగా ఉన్నందున రైతులు దీనినే సాగు చేశారన్నారు. విత్తనాలు సరఫరా చేసే సమయంలో పంటను కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకున్న వ్యాపారులు ఇప్పుడు దిగుబడి పెరగడంతో ధర తక్కువ ఇస్తామని చెప్ప డం సరికాదన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రైతుబంధు, రైతు బీమా తదితర ప్రత్యేక పథకాలు అమలు చేస్తుంటే.. వ్యాపారులు మాత్రం రైతులకు అన్యాయం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. నోటి మాటలైనా, లిఖిత పూర్వక ఒప్పందమైనా పాటించాల్సిందేనని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చూస్తూ ఊరు కోమన్నారు. రైతులు వ్యాపారుల మోసానికి ప్రతిసారి బలికాకుండా ఇతర పంటల సాగుకు ఆలోచించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. పసుపును మార్కెట్‌కు తెచ్చేముందు బాగా ఆరబెట్టుకొని, తేమను తగ్గించి తేవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పంటల బీమా... రైతులకు ధీమా !
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు ధీమా ఇస్తోంది. ప్రతిసారి ఏదో ఒక ప్రకృతి వైపరీత్యంతో నష్టపోతున్న రైతులకు బీమా భరోసా కల్పిస్తోంది. గత ఖరీఫ్ 2017లో వరిలో దిగుబడులు బాగా తగ్గి రైతులు ఆందోళన చెందిన విషయం విదితమే. ఇందుకు కూడా వాతావరణ ప్రతికూలతలు, దోమపోటు తదితర అనేక కారణాలు ఉన్నాయి. వ్యవసాయశాఖ నిర్వహించిన పంట ప్రయోగ ఫలితాలతో ఇదే విషయం తేలింది. దీంతో వరి పంటలో గ్రామాన్ని యూనిట్‌గా ప్రకటించడంతో వరిపై ప్రీమియం చెల్లించిన రైతులకు, దిగుబడి తగ్గిన గ్రామాల్లో ఆ మేరకు లబ్ధి చేకూరేలా అమలుచేస్తున్న ఫసల్ బీమా రైతులకు ఇప్పుడు అండగా మారింది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారుల అందించిన వివరాల ప్రకారం జిల్లాలో వరిపై ప్రీమియం చెల్లించిన రైతుల్లో దాదాపు 7,386 మందికి రూ.7,40,88,530 పంట పరిహారం కింద విడుదలయ్యాయి. ఈ మేరకు జిల్లాలోని 14 బ్యాంకులు పరిహారం జమ చేసినట్లు అధికారులు తెలిపారు. పంటల బీమా కింద విడుదలైన పరిహారాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. సాక్షి, కరీంనగర్: రెండేళ్లలో రూ.18.63 కోట్ల పరిహారం.. నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమప్రధానమంత్రి ఫసల్ బీమా కింద ఇప్పటివరకు పంటలు నష్టపోయిన రైతులకు రూ.18.63 కోట్లు అందజేశారు. 2014–15 రబీలో రూ.7.82 కోట్లు, 2016–17ఖరీఫ్‌లో రూ.3.40 కోట్లు, తాజాగా ఇప్పుడు ఖరీఫ్ 2017లో రూ.7.41 కోట్ల విడుదలయ్యాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వాటి వాటాను చెల్లించిన దరిమిలా ఇన్సూరెన్స్ కంపెనీ వారు బీమా పరిహారం మొత్తాన్ని ఆయా బ్యాంకులకు జమ చేస్తాయి. ఈ మొత్తాన్ని సంబంధిత బ్యాంకులు వారి శాఖల ద్వారా రైతుల ఖాతాలలో వెంటనే జమచేయాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రక్రియ మొదలు కానుంది. రెండురోజుల క్రితం జరిగిన బ్యాంకర్ల సమీక్ష సమవేశంలో కూడా ఈ విషయమై బ్యాంకర్ల నుంచి ఏ రైతులకు ఎంతమేర పరిహారం విడుదలైంది వంటి స్పష్టమైన వివరాలు సేకరించారు. ఆ వివరాలను శాఖలవారీగా క్రోడీకరించి కన్వీనర్ లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు అందించాలని, దాని ప్రతిని ఒకటి జిల్లా వ్యవసాయ అధికారికి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా రైతుల ఖాతాలకు జమ చేయడంలో ఎటువంటి జాప్యమూ చేయరాదని కూడా స్పష్టంగా ఆదేశించడంతో వ్యవసాయశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రబీ బీమా కోసం వ్యవసాయ శాఖ ప్రచా రం.. బీమా చెల్లింపునకు ఈనెల 31 చివరితేదీ పంటల బీమాకు ప్రీమియం చెల్లించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడిప్పుడే కలెక్టర్ ప్రొద్బలంతో ప్రతికూలతలు అధిగమిస్తున్నామన్న ధీమాను వ్యవసాయశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రానున్న రబీ పంట కాలానికి సంబంధించి వడగళ్లతో పంటనష్టపోయే సందర్భాలు గతంలో అనేకం చూశామని, ఈ క్రమంలో రైతులందరూ తప్పనిసరిగా తమ వరిపంటకు బీమా చేయించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం బీమా పథకం, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా వారికి అప్పగించడం వల్ల రైతులు పంట రుణాలను కూడా సత్వరమే రెన్యువల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పంట రుణాలు తీసుకోని రైతులు బీమా ప్రపోజల్ ఫారమ్ నింపి, పంట బీమా ప్రీమియం, ధ్రువీకరించిన కామన్ సర్వీస్ సెంటర్లో లేదా సమీప బ్యాంకులో కట్టవచ్చని పోస్టర్లు, కరపత్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వరికి చెల్లించాల్సిన ప్రీమియం రూ.450 కాగా, చివరితేదీ ఈనెల 31వరకే ఉంది. ఇంకా మిగిలి ఉన్న బ్యాంకు పనిదినాలు ఐదురోజులు మాత్రమే ఉన్నందున రైతులు పూర్తి ఇంకా వివరాలకు సమీప వ్యవసాయ అధికారిని సంప్రదింంచి బీమా చేయించుకోవాలని సూచిస్తున్నారు. బీమా చేసుకుంటే మేలు రైతులు రబీ కోసం బీమా ప్రీమియం చెల్లించడానికి ఈనెల 31 చివరి తేదీ. ఇందులో బ్యాంకు పనిదినాలు కేవలం ఐదు రోజులే ఉన్నందున త్వరపడాల్సిన అవసరం ఉంది. రెండేళ్లుగా స్వయంగా పరిశీలిస్తున్న పంటకోత ప్రయోగాలు, వ్యవసాయ విస్తీర్ణాధికారులకు ఒక బాధ్యతగా నిర్వహిస్తున్నాం. వీటి ఫలితాల బట్టి రైతులకు బీమా పరిహారం అందుతుంది. జిల్లా కలెక్టర్ విరివిగా నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో పంటల బీమా ఆవశ్యకతను, ప్రయోజనం వర్తింపుపై అటు బ్యాంకర్లకు, ఇటు వ్యవసాయ శాఖ ఉద్యోగులకు ఒక ప్రాధాన్య అంశంగా చర్చిస్తున్నారు. గతంలో ఏ రైతుల వద్దకు వెళ్లి పథకం వివరాలు చెప్పినా రైతుల నుంచి నిరాశక్తత ఎదురయ్యేది... ఇప్పుడా పరిస్థితి లేదు. – వి.శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి -
అకాల దెబ్బ
ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం తీవ్ర పంట నష్టం కలిగించింది. కోతకొచ్చిన వరిపైరు దెబ్బతిన్నది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, కొనుగోలు కేంద్రాల్లో మక్కలు తడిసి పోయాయి. ఇందల్వాయి, వర్ని, సదాశివనగర్, నిజాంసాగర్, కామారెడ్డి, దోమకొండ, బాన్సువాడ, పిట్లం తదితర మండలాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజాము వరకు మోస్తారు వర్షం కురిసింది. సాక్షి, కామారెడ్డి: వరుణుడు రైతులపై పగ బట్టినట్లున్నాడు.. ఖరీఫ్ సాగు ప్రారంభం నుంచి ముఖం చాటేశాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఎలాగోలా పంటలను కాపాడుకుంటూ వచ్చారు. తీరా చేతికందిన పంటను అమ్ముకునే సమయంలో వరుణుడు రైతులను నిండా ‘ముంచాడు’. జిల్లాలోని కొన్ని ప్రాంతా ల్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరు వాత ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం రైతుల ఆశల్ని నిలువునా ముంచేసింది. కామారెడ్డి డివిజన్ పరిధిలోని దోమకొండ మండలంలో అత్యధికంగా 73.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి పూట ఒక్కసారిగా వర్షం విరుచుకుపడడంతో కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు లబోదిబోమన్నారు. వర్షం నుంచి అప్పటికప్పుడు ధాన్యాన్ని కాపాడుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. అలాగే, మక్కలు కూడా పెద్ద ఎత్తున తడిసి ముద్ద య్యాయి. పక్కనే ఉన్న బీబీపేట మండ లంలోని పలు గ్రామాల్లో కూడా వర్షం కురిసి పంటలకు నష్టం వాటిల్లింది. గాం ధారి మండలంలో 50.1 మి.మీ., తాడ్వాయిలో 36.6 మి.మీ., మాచారెడ్డిలో 23.1 మి.మీ., రామారెడ్డిలో 26.8 మి.మీ., సదాశివనగర్‌లో 12.8 మి.మీ. వర్షం కురిసింది. అలాగే బాన్సువాడ, కామారెడ్డి, నస్రుల్లాబాద్ తదితర మండలాల్లోనూ కురిసిన వర్షంతో ధాన్యం రాశులు తడిసి పోయాయి. నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లి, బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామాల్లో ధాన్యం నానిపోయింది. మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట నేలవాలింది. సదాశివనగర్ మండలంలో వర్షం తక్కువ కురిసినప్పటికీ ఈదురుగాలులతో కోతకొచ్చిన వరి నేలవాలింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ప్రకృతి పగ బట్టినట్టు చేసిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవస్థలు.. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో అకాల వర్షంతో నానిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. కల్లాలు లేకపోవడంతో రోడ్లపై ఆరబెట్టాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువెళ్లిన రైతులు ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో ఏమీ చేయలేక పోయారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఆరబెట్టిన ధాన్యం నానిపోవడమే గాకుండా వర్షపు నీటితో కొట్టుకు పోయింది. బుధవారం ఉదయం నుంచి రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి పడిన ఇబ్బందులు అన్నిఇన్ని కావు. కష్టపడి పండించిన పంట చేతికందిన తరువాత కూడా ప్రకృతి తమకు పరీక్ష పెడుతోందని అన్నదాతలు వాపోతున్నారు. నేలవాలిన వరి పైర్లు.. ఈదురుగాలులతో చాలా గ్రామాల్లో వరి నేలవాలింది. పంట కోయాల్సిన సమయంలో ఒక్కసారిగా ప్రకృతి బీభత్సం సృష్టించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. తెల్లారేసరికి పంటంతా నేలవాలడంతో ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే పెట్టుబడులు అడ్డగోలుగా పెరగడం, దిగుబడులు తగ్గుతుండడంతో ఏమీ మిగిలే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
పరిహారం..పరిహాసం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వరుస కరువులతో జిల్లా యంత్రాంగం తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్, రబీ పంట నష్టం అంచనాలను అధికారులు మొక్కుబడిగా ప్రభుత్వానికి నివేదించగా ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. దీంతో జిల్లా రైతాంగం మరింత ఆందోళన చెందుతోంది. జూన్ ఒకటినుంచి మే 31 వరకు ఈ ఏడాది సాధారణ వర్షపాతం 871.5 ఎంఎం కాగా గత జూన్ నుంచి డిసెంబర్ వరకు కేవలం 385.2 ఎంఎం వర్షపాతమే నమోదైంది. రబీలో 43.5 శాతం మాత్రమే వర్షపాతం నమోదైంది. జనవరి నుంచి చినుకు లేదు. చెరువులు ఎండిపోయాయి. బోర్లు ఒట్టిపోయాయి. పశ్చిమ ప్రాంతంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. పశువులకు మేత, దప్పిక తీరే దారిలేని పరిస్థితి ఉంది. మొత్తంగా 88 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో సాగైన పంటలు ఆదిలోనే ఎండిపోయాయి. అరకొరగా పండినా దిగుబడులు తగ్గాయి. గిట్టుబాటు ధరల్లేకపోవడంతో సగం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. దీంతో జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. జిల్లాలో 14 లక్షల ఎకరాలకుపైగా సాగు భూమి ఉండగా ఖరీఫ్, రబీలో రైతులు 10 లక్షల ఎకరాల్లో పత్తి, కంది, శనగ, మిర్చి పంటలు సాగు చేశారు. ఎకరాకు 30 వేలకు తగ్గకుండా పెట్టుబడులు పెట్టారు. ఇక కౌలు లెక్కలు సరేసరి. రైతులు ఎకరాల్లెక్కన పెట్టిన పెట్టుబడే రూ.3 వేల కోట్లు దాటింది. తీవ్ర వర్షాభావంతో ఇందులో 70 నుంచి 80 శాతం పంటలు చేతికి రాకుండా పోయాయి. ప్రధానంగా గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, కందుకూరు, మార్కాపురం తదితర పశ్చిమ ప్రకాశం ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోవాల్సి వచ్చింది. మొత్తంగా రైతులు రూ.2400 కోట్లు నష్టపోయారు. అయితే పంట నష్టం అంచనాలను గణించిన ప్రభుత్వ అధికారులు జిల్లాలోని కరువు కింద ప్రకటించిన 55 మండలాల పరిధిలో 1,23,233.58 హెక్టార్లలో అన్ని పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలు తేల్చారు. 1,65,086 మంది రైతులకు రూ.125,60,36,502 చెల్లించాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అధికారిక లెక్కల ప్రకారమే ఇందులో ప్రధానంగా 50 వేల హెక్టార్లలో కంది, 25 వేల హెక్టార్లలో శనగతో పాటు పత్తి, మిర్చి తదితర పంటలు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. వాస్తవానికి అధికారులు పేర్కొంటున్న 1.23 లక్షల హెక్టార్లలో కంది, మిర్చి, పత్తి, శనగ సాగుకు సైతం రైతులు రూ.863 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. అయితే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించింది కేవలం రూ.125 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. వాస్తవానికి 8 లక్షల ఎకరాల్లో రైతుల పెట్టుబడులు రూ.2,400 కోట్లు ఉన్నాయి. కానీ అధికారులు అంచనాలకు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పొంతన లేదు. మొక్కుబడిగా అధికారులిచ్చిన గణాంకాలను, దానికి సంబంధించిన పరిహారం ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. -
పింఛన్ల కోసం వైఎస్సార్సీపీ ధర్నా
శింగనమల: అర్హులకు పింఛన్లు ఇవ్వాలని, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. అనంతపురం జిల్లా శింగనమల మండలకేంద్రంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పార్టీ మండల కన్వీనర్ చెన్నకేశవులు, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్ విజయకుమారికి వినతిపత్రం అందజేశారు. -
పంటనష్ట పరిహారం పెంచుతాం: జైట్లీ
బూందీ(రాజస్థాన్): అకాల వర్షాలు, వడగండ్ల వల్ల పంట నష్టపోయిన రైతులకు సహాయం చేసేందుకు పంటనష్ట పరిహార పరిమితిని పెంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ విషయమై రాష్ట్రాలతో చర్చిస్తామని చెప్పారు. ఇటీవలి అకాల వర్షాలతో భారీగా పంటలు దెబ్బతిన్న రాజస్థాన్ బూందీ జిల్లాలోని తిమేలీ గ్రామంలో జైట్లీ ఆదివారం పర్యటించి, రైతులతో మాట్లాడారు. కేంద్రం రైతులకు అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అకాల వర్షాలకు అత్యంత ప్రభావితమైన ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు పర్యటించాలని ప్రధాని మోదీ ఆదేశించారని చెప్పారు. -
పంట నష్ట పరిహారం చెల్లింపులో అవకతవకలు
దోమ: పంట నష్ట పరిహారం మంజూరులో అధికారులు అవినీతికి పాల్పడ్డారని, అర్హులకు అన్యాయం జరిగింద ని ఆగ్రహిస్తూ మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన రైతులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 2013 నవంబరులో భారీ వర్షాల కారణంగా మండలంలో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అప్పట్లో వీఆర్ఓలు, వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి పంపించారు. అధికారులు అందించిన వివరాల మేరకు ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం సంబంధిత రైతులకు పంట నష్టపరిహారం డబ్బులు విడుదల చేసింది. మైలారం గ్రామంలో 57మందిని అర్హులుగా ఎంపిక చేసి నష్టపరిహారం మంజూరు చేశారు. అయితే నిజంగా పంట నష్టపోయిన రైతులకు కాకుండా అనర్హులకు పరిహారం మంజూరు చేశారంటూ గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పక్కనే ఉన్న వ్యవసాయ కార్యాలయాన్ని మూసి వేయించారు. వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటయ్యను చుట్టు ముట్టి అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం భూమి కూడా లేనివారికి, వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలియని వారికి పరిహారం మంజూరైందని ఆరోపించారు. పైరవీలు చేసి ఎంతో కొంత ముట్టజెప్పిన వారికే అధికారులు పరిహారం మంజూరు చేయిం చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే సర్వే నెంబరుపై నలుగురైదుగురికి పరిహారం ఎలా వస్తుందంటూ ప్రశ్నించారు. అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి తహసీల్దార్ జనార్దన్ స్పందిస్తూ రైతుల ఆందోళన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని వారికి నచ్చజెప్పారు. అయితే రెండు, మూడు రోజుల్లో తమకు న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో ఎంపీటీసీ సుశీలతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
అదనులో దన్ను దక్కేనా?
మండపేట, న్యూస్‌లైన్ :జిల్లాలో వరి, కొబ్బరి తదితర పంటలు సాగు చేసే రైతులు సుమారు ఆరు లక్షల మంది ఉండగా, వీరిలో 60 శాతానికి పైగా అంటే సుమారు 3.60 లక్షల మందికి పైగా కౌలు రైతులని అంచనా. వీరిలో చాలా మంది స్వయంగా పొలంలో దిగి చెమటోడ్చి కష్టించే వారే. వీరికి సాధారణ రైతులకులా రుణాలు, రాయితీలు, వడ్డీ మాఫీ పథకాలు, పంట నష్టపరిహారం అందకుండా పోతున్నాయి. అప్పులు చేసి సాగు చేయడం, తుపానులకు, వరదలకు పంట నష్టపోతే తిరిగి అప్పులు చేయడం సర్వసాధారణమవుతోంది. రుణ బాధ తాళలేక కొందరు ప్రాణత్యాగం చేసుకుంటున్న విషాదాలూ పరిపాటి అవుతున్నాయి. దీనిని గుర్తించిన దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కౌలురైతులతో ఉమ్మడిగా పూచీ పడే బృందాలను (జేఎల్‌జీ) ఏర్పాటు చేసి రుణ సౌకర్యం కల్పించారు. ఆయన మృతితో జేఎల్‌జీ కొండెక్కిపోయింది. కౌలు రైతుల కోసం 2011లో ప్రభుత్వం కౌలుదారుల చట్టం తెచ్చింది. దీని ప్రకారం కౌలు రైతులకుగుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. సాధారణ రైతుల్లా బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించడంతో పాటు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు ఇవ్వాలి. అయితే అధికారులు, బ్యాంకర్ల నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియ సక్రమంగా అమలు కావడం లేదు. అందరికీ అందని కార్డులు గుర్తింపు కార్డు దరఖాస్తులో కౌలుదారుని సమాచారంతో పాటు కౌలుకు చేస్తున్న భూమి వివరాలు నిక్షిప్తం చేయాల్సి ఉంది. వీటితో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళనలో వివరాలు తెలిపేందుకు భూమి సొంతదారులు వెనుకాడటంతో ఎక్కువ మంది కౌలు రైతులకు గుర్తింపుకార్డులు అందడం లేదు. ఈ చట్టం ప్రారంభమైన మొదటి సంవత్సరంలో సుమారు 50 వేల మంది కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఇవ్వగా, 2012-13లో 74,904 మందికి, 2013-14లో 82,298 మందికి కార్డులు వచ్చాయి. జిల్లాలో సుమారు 3.6 లక్షల మంది కౌలు రైతులు ఉంటే వారిలో అరకొర మందికి మాత్రమే గుర్తింపుకార్డులు అందాయి. రుణసాయం నామమాత్రమే గుర్తింపుకార్డులు పొందిన వారిలో కొద్దిమందికి మాత్రమే రుణాలందుతున్నాయి. అప్పటికే అసలు రైతు రుణం తీసుకుని ఉండటం, తాము పూచీ చూపించలేక పోవడంతో బ్యాంకర్ల నిరాకరణ వంటి కారణాలతో ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా 2012-13లో 27,290 మంది కౌలు రైతులకు రూ.38.27 కోట్ల రుణాలు మంజూరు చేయగా, 2013-14లో 20,018 మందికి సుమారు రూ.30.82 కోట్ల రుణం మాత్రమే మంజూరైంది. మిగిలిన వారికి బ్యాంకర్ల నుంచి మొండిచెయ్యే ఎదురైంది. మరో వారం రోజుల్లో తొలకరి పనులు ప్రారంభం కానున్నా కౌలురైతుల పాత గుర్తింపు కార్డుల రెన్యువల్‌తో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు మంజూరు చేసే చర్యలు కానరావడం లేదు. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తించి కార్డులు మంజూరు చేయాలి. గత మూడు నెలలుగా ఎన్నికల హడావుడితో రెవెన్యూ శాఖ కౌలు రైతుల ఊసే మరిచింది. గుర్తింపుకార్డులు లేకపోతే రుణసాయం అందదు. దాంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కౌలు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. అధికారులు స్పందించి తమ కోసం చేసిన చట్టం తమకు ఉపకరించేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు. రుణాల మంజూరుకు అధికారులు చర్యలు తీసుకోవాలి కొంత మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చినా రుణాలు మాత్రం ఇవ్వటం లేదు. కౌలు రైతులకు ఖరీఫ్‌కు రుణాలు ఇచ్చే విధంగా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. - కొండేపూడి శ్రీనివాసరావు, కౌలు రైతు, భట్లపాలిక, కె.గంగవరం మండలం గుర్తింపు కార్డులు ఇవ్వలేదు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. గతంలో కొంత మందికి మాత్రమే ఇచ్చారు. గుర్తింపు కార్డులు ఇచ్చినా రుణాలు మాత్రం ఇవ్వలేదు. కౌలు రైతులందరికీ కార్డులిచ్చేలా చూడాలి. - తోకల శ్రీను, కౌలురైతు, తామరపల్లి, కె.గంగవరం మండలం