రాష్ట్రంలో ఈదురుగాలులు, వడగళ్ల వానలు చేసిన నష్టానికి చిన్న ఉదాహరణ ఇది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని భువనగిరి మార్కెట్ యార్డుకు తెస్తే.. అకాల వర్షానికి కొట్టుకుపోయింది. తమకీ కష్టం ఏమిటని రోదిస్తూ కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎత్తుతున్న మహిళా రైతు లచ్చమ్మ.
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలతో కోతకు వచ్చిన వరి పొలంలోనే నేలరాలింది. కోసి పెట్టిన ధాన్యం నీట మునిగింది. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు వరదకు కొట్టుకుపోయాయి. 4.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసినా.. ఒక్క వరి పంటే ఐదు లక్షల ఎకరాలకుపైగా దెబ్బతిన్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తోంది.
కొన్నిచోట్ల ఎకరా పొలంలో కనీసం క్వింటాల్ ధాన్యం కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఒక్క వరి మాత్రమే కాదు.. మామిడి, నువ్వులు, మిరప, మొక్కజొన్న, టమాటా వంటి ఇతర పంటలు కూడా వడగళ్ల బీభత్సానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా సంగారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట తదతర జిల్లాల్లో మామిడి భారీగా నేలరాలింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పంట నష్టం అత్యధికంగా.. ఖమ్మం, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో కాస్త తక్కువగా ఉంది.
ఈదురుగాలులు, వడగళ్లతో అధిక నష్టం
వేసవిలో అకాల వర్షాలు మామూలే అయినా.. ఈసారి తీవ్రమైన ఈదురుగాలులు, వడగళ్లతో ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తుండటం తీవ్ర నష్టానికి కారణం అవుతోందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల ఎకరానికి క్వింటాల్ వడ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని.. వరికోత కోసం తెచ్చే హార్వెస్టర్ అద్దెకు సరిపడా ధాన్యం కూడా వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు.
పొలాలను కౌలుకు తీసుకొని వరిసాగు చేసిన రైతులకు మరింత దెబ్బపడింది. కౌలు, పెట్టుబడి కలిపి ఒక్కో ఎకరాకు 20వేలకుపైనే నష్టపోతున్నామని, ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
తడిసిన ధాన్యం
ముందుగా వరి సాగు చేసిన నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నల్లగొండతోపాటు వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి తదతర జిల్లాల్లో కోతలు మొదలయ్యాయి. 2వేలకుపైగా కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇంకా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. రైతులు తెచ్చిన పంటను కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోశారు.
అకాల వర్షాలతో అంతా తడిసిపోయింది. పలుచోట్ల కొట్టుకుపోయింది. మొత్తంగా 5 లక్షల టన్నుల ధాన్యం తడిసినట్టు పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకృతి బీభత్సం నేపథ్యంలో వరి దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందని.. కోటి టన్నుల సేకరణ అంచనా వేసుకున్నా, అందులో సగమైనా వస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయని అంటున్నారు.
ఏడెకరాల్లో నష్టపోతే అర ఎకరమే రాశారు
నేను ఏడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. గత నెలలో కురిసిన వానలకు పంట పూర్తిగా నేలవాలింది. అయినా అధికారులు అర ఎకరమే నష్టం జరిగినట్లు రాశారు. మిగిలిన కాసింత పంటనూ వ్యాపారులు తక్కువ ధరకే అడుగుతున్నారు. నష్టమెలా పూడ్చుకోవాలో తెలియడం లేదు.
– వరి మేకల నాగయ్య, రైతు, సువర్ణాపురం, ముదిగొండ మండలం
రాళ్లవాన ముంచింది
మూడెకరాల్లో వరి వేసిన. తెల్లారి కోద్దామనుకుంటే.. రాత్రి మాయదారి రాళ్లవాన నిండా ముంచింది. గింజలన్నీ మట్టిలో కలిసిపోయాయి. సర్కారు ఆదుకోవాలి. లేకుంటే కుటుంబం రోడ్డుపడుతుంది.
– గుగులోతు నీల, మహిళా రైతు, ఆంధ్ర తండా, జనగామ జిల్లా
పావు మందమే వడ్లు మిగిలాయి
ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేసిన. వడగళ్ల వానతో పంటంతా నేలవాలి గింజలు రాలిపోయాయి. పావు మందమే వడ్లు మిగిలాయి. మిషిన్ పెట్టి కోయిస్తే గడ్డి మాత్రమే మిగులుతుంది.
– రైతు ఆవుల మహేందర్, గర్రెపల్లి, సుల్తానాబాద్
పంట నష్టం అంచనాలివీ..
ఉమ్మడి కరీంనగర్‌లో..
కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో లక్ష ఎకరాలకుపైగా వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో వరి పంటే 80 వేల ఎకరాల్లో నష్టపోయింది. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 50వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60వేల మంది రైతులపై వర్షం ప్రత్యక్ష ప్రభావం చూపినట్టు అంచనా.
మెదక్ ఉమ్మడి జిల్లాలో..
సిద్దిపేటలో పంట నష్టం అధికంగా ఉంది. ఈ జిల్లాలో 86,203 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఇందులో 79,350 ఎకరాల్లో వరికి నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మెదక్‌లో 13,632 ఎకరాల్లో వరి, 342 ఎకరాల్లో మామిడి దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లా పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో లక్షన్నర టన్నుల ధాన్యం తడిసినట్లు అనధికారిక అంచనా. సంగారెడ్డి జిల్లాలో నష్టం తక్కువగా ఉంది.
ఉమ్మడి నిజామాబాద్‌లో..
కామారెడ్డి జిల్లాలో 22 వేల మంది రైతులకు సంబంధించిన పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొత్తంగా 32 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో వరి, మొక్కజొన్న, నువ్వు, పొద్దుతిరుగుడు, పసుపు, ఉద్యాన పంటలకు 600 ఎకరాల్లో నష్టం జరిగింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు తడిసింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో లక్షన్నర ఎకరాల వరకు వివిధ పంటలు నష్టపోయినట్టు సమాచారం. అయితే 75,603 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఇందులో 58 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 7,603 ఎకరాల్లో ఇతర పంటలు ఉన్నట్టు పేర్కొన్నారు. జనగామలో వరి బాగా దెబ్బతింది.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో 2,379 ఎకరాల్లో వరి, 309 ఎకరాల్లో మామిడి.. ఆదిలాబాద్ జిల్లాలో 2వేల ఎకరాల్లో జొన్న పంటలకు నష్టం జరిగినట్టు అంచనా వేశారు. ఆసిఫాబాద్‌లో 3,419 ఎకరాల మేర పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు.
నల్లగొండ ఉమ్మడి జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలో 25వేల ఎకరాలకుపైగా వరికి నష్టం వాటిల్లగా, సుమారు 1,000 ఎకరాల్లో మామిడి తోటలు నాశనమయ్యాయి. యాదాద్రి జిల్లాలో 11వేల ఎకరాల్లో వరి దెబ్బతిన్నది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం జిల్లాలో వరి 8,169 ఎకరాల్లో, మొక్కజొన్న 1751 ఎకరాల్లో నష్టపోయినట్టు కలెక్టర్‌కు వ్యవసాయ శాఖ నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment