ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు ధీమా ఇస్తోంది. ప్రతిసారి ఏదో ఒక ప్రకృతి వైపరీత్యంతో నష్టపోతున్న రైతులకు బీమా భరోసా కల్పిస్తోంది. గత ఖరీఫ్ 2017లో వరిలో దిగుబడులు బాగా తగ్గి రైతులు ఆందోళన చెందిన విషయం విదితమే. ఇందుకు కూడా వాతావరణ ప్రతికూలతలు, దోమపోటు తదితర అనేక కారణాలు ఉన్నాయి. వ్యవసాయశాఖ నిర్వహించిన పంట ప్రయోగ ఫలితాలతో ఇదే విషయం తేలింది.
దీంతో వరి పంటలో గ్రామాన్ని యూనిట్‌గా ప్రకటించడంతో వరిపై ప్రీమియం చెల్లించిన రైతులకు, దిగుబడి తగ్గిన గ్రామాల్లో ఆ మేరకు లబ్ధి చేకూరేలా అమలుచేస్తున్న ఫసల్ బీమా రైతులకు ఇప్పుడు అండగా మారింది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారుల అందించిన వివరాల ప్రకారం జిల్లాలో వరిపై ప్రీమియం చెల్లించిన రైతుల్లో దాదాపు 7,386 మందికి రూ.7,40,88,530 పంట పరిహారం కింద విడుదలయ్యాయి. ఈ మేరకు జిల్లాలోని 14 బ్యాంకులు పరిహారం జమ చేసినట్లు అధికారులు తెలిపారు. పంటల బీమా కింద విడుదలైన పరిహారాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.
సాక్షి, కరీంనగర్: రెండేళ్లలో రూ.18.63 కోట్ల పరిహారం.. నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమప్రధానమంత్రి ఫసల్ బీమా కింద ఇప్పటివరకు పంటలు నష్టపోయిన రైతులకు రూ.18.63 కోట్లు అందజేశారు. 2014–15 రబీలో రూ.7.82 కోట్లు, 2016–17ఖరీఫ్‌లో రూ.3.40 కోట్లు, తాజాగా ఇప్పుడు ఖరీఫ్ 2017లో రూ.7.41 కోట్ల విడుదలయ్యాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వాటి వాటాను చెల్లించిన దరిమిలా ఇన్సూరెన్స్ కంపెనీ వారు బీమా పరిహారం మొత్తాన్ని ఆయా బ్యాంకులకు జమ చేస్తాయి.
ఈ మొత్తాన్ని సంబంధిత బ్యాంకులు వారి శాఖల ద్వారా రైతుల ఖాతాలలో వెంటనే జమచేయాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రక్రియ మొదలు కానుంది. రెండురోజుల క్రితం జరిగిన బ్యాంకర్ల సమీక్ష సమవేశంలో కూడా ఈ విషయమై బ్యాంకర్ల నుంచి ఏ రైతులకు ఎంతమేర పరిహారం విడుదలైంది వంటి స్పష్టమైన వివరాలు సేకరించారు. ఆ వివరాలను శాఖలవారీగా క్రోడీకరించి కన్వీనర్ లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు అందించాలని, దాని ప్రతిని ఒకటి జిల్లా వ్యవసాయ అధికారికి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా రైతుల ఖాతాలకు జమ చేయడంలో ఎటువంటి జాప్యమూ చేయరాదని కూడా స్పష్టంగా ఆదేశించడంతో వ్యవసాయశాఖ కసరత్తు ముమ్మరం చేసింది.
రబీ బీమా కోసం వ్యవసాయ శాఖ ప్రచా రం.. బీమా చెల్లింపునకు ఈనెల 31 చివరితేదీ
పంటల బీమాకు ప్రీమియం చెల్లించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడిప్పుడే కలెక్టర్ ప్రొద్బలంతో ప్రతికూలతలు అధిగమిస్తున్నామన్న ధీమాను వ్యవసాయశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రానున్న రబీ పంట కాలానికి సంబంధించి వడగళ్లతో పంటనష్టపోయే సందర్భాలు గతంలో అనేకం చూశామని, ఈ క్రమంలో రైతులందరూ తప్పనిసరిగా తమ వరిపంటకు బీమా చేయించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఈ సంవత్సరం బీమా పథకం, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా వారికి అప్పగించడం వల్ల రైతులు పంట రుణాలను కూడా సత్వరమే రెన్యువల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పంట రుణాలు తీసుకోని రైతులు బీమా ప్రపోజల్ ఫారమ్ నింపి, పంట బీమా ప్రీమియం, ధ్రువీకరించిన కామన్ సర్వీస్ సెంటర్లో లేదా సమీప బ్యాంకులో కట్టవచ్చని పోస్టర్లు, కరపత్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వరికి చెల్లించాల్సిన ప్రీమియం రూ.450 కాగా, చివరితేదీ ఈనెల 31వరకే ఉంది. ఇంకా మిగిలి ఉన్న బ్యాంకు పనిదినాలు ఐదురోజులు మాత్రమే ఉన్నందున రైతులు పూర్తి ఇంకా వివరాలకు సమీప వ్యవసాయ అధికారిని సంప్రదింంచి బీమా చేయించుకోవాలని సూచిస్తున్నారు.
బీమా చేసుకుంటే మేలు
రైతులు రబీ కోసం బీమా ప్రీమియం చెల్లించడానికి ఈనెల 31 చివరి తేదీ. ఇందులో బ్యాంకు పనిదినాలు కేవలం ఐదు రోజులే ఉన్నందున త్వరపడాల్సిన అవసరం ఉంది. రెండేళ్లుగా స్వయంగా పరిశీలిస్తున్న పంటకోత ప్రయోగాలు, వ్యవసాయ విస్తీర్ణాధికారులకు ఒక బాధ్యతగా నిర్వహిస్తున్నాం. వీటి ఫలితాల బట్టి రైతులకు బీమా పరిహారం అందుతుంది. జిల్లా కలెక్టర్ విరివిగా నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో పంటల బీమా ఆవశ్యకతను, ప్రయోజనం వర్తింపుపై అటు బ్యాంకర్లకు, ఇటు వ్యవసాయ శాఖ ఉద్యోగులకు ఒక ప్రాధాన్య అంశంగా చర్చిస్తున్నారు. గతంలో ఏ రైతుల వద్దకు వెళ్లి పథకం వివరాలు చెప్పినా రైతుల నుంచి నిరాశక్తత ఎదురయ్యేది... ఇప్పుడా పరిస్థితి లేదు. – వి.శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి
Comments
Please login to add a commentAdd a comment