అదనులో దన్ను దక్కేనా? | Crop damages Kharif loans ON Farmers | Sakshi
Sakshi News home page

అదనులో దన్ను దక్కేనా?

Published Mon, Jun 9 2014 12:57 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

అదనులో దన్ను దక్కేనా? - Sakshi

అదనులో దన్ను దక్కేనా?

మండపేట, న్యూస్‌లైన్ :జిల్లాలో వరి, కొబ్బరి తదితర పంటలు సాగు చేసే రైతులు సుమారు ఆరు లక్షల మంది ఉండగా, వీరిలో 60 శాతానికి పైగా అంటే సుమారు 3.60 లక్షల మందికి పైగా కౌలు రైతులని అంచనా. వీరిలో చాలా మంది స్వయంగా పొలంలో దిగి చెమటోడ్చి కష్టించే వారే. వీరికి సాధారణ రైతులకులా రుణాలు, రాయితీలు, వడ్డీ మాఫీ పథకాలు, పంట నష్టపరిహారం అందకుండా పోతున్నాయి. అప్పులు చేసి సాగు చేయడం, తుపానులకు, వరదలకు పంట నష్టపోతే తిరిగి అప్పులు చేయడం సర్వసాధారణమవుతోంది. రుణ బాధ తాళలేక కొందరు ప్రాణత్యాగం చేసుకుంటున్న విషాదాలూ పరిపాటి అవుతున్నాయి. దీనిని గుర్తించిన దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కౌలురైతులతో ఉమ్మడిగా పూచీ పడే బృందాలను (జేఎల్‌జీ) ఏర్పాటు చేసి రుణ సౌకర్యం కల్పించారు. ఆయన మృతితో జేఎల్‌జీ కొండెక్కిపోయింది. కౌలు రైతుల కోసం 2011లో ప్రభుత్వం కౌలుదారుల చట్టం తెచ్చింది. దీని ప్రకారం కౌలు రైతులకుగుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. సాధారణ రైతుల్లా బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించడంతో పాటు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు ఇవ్వాలి. అయితే అధికారులు, బ్యాంకర్ల నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియ సక్రమంగా అమలు కావడం లేదు.
 
 అందరికీ అందని కార్డులు
 గుర్తింపు కార్డు దరఖాస్తులో కౌలుదారుని సమాచారంతో పాటు కౌలుకు చేస్తున్న భూమి వివరాలు నిక్షిప్తం చేయాల్సి ఉంది. వీటితో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళనలో వివరాలు తెలిపేందుకు భూమి సొంతదారులు వెనుకాడటంతో ఎక్కువ మంది కౌలు రైతులకు గుర్తింపుకార్డులు అందడం లేదు. ఈ చట్టం ప్రారంభమైన మొదటి సంవత్సరంలో సుమారు 50 వేల మంది కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఇవ్వగా, 2012-13లో 74,904 మందికి, 2013-14లో 82,298 మందికి కార్డులు వచ్చాయి. జిల్లాలో సుమారు 3.6 లక్షల మంది కౌలు రైతులు ఉంటే వారిలో అరకొర మందికి మాత్రమే గుర్తింపుకార్డులు అందాయి.
 
 రుణసాయం నామమాత్రమే
 గుర్తింపుకార్డులు పొందిన వారిలో కొద్దిమందికి మాత్రమే రుణాలందుతున్నాయి. అప్పటికే అసలు రైతు రుణం తీసుకుని ఉండటం, తాము పూచీ చూపించలేక పోవడంతో బ్యాంకర్ల నిరాకరణ వంటి కారణాలతో ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా 2012-13లో 27,290 మంది కౌలు రైతులకు రూ.38.27 కోట్ల రుణాలు మంజూరు చేయగా, 2013-14లో 20,018 మందికి సుమారు రూ.30.82 కోట్ల రుణం  మాత్రమే మంజూరైంది. మిగిలిన వారికి బ్యాంకర్ల నుంచి మొండిచెయ్యే ఎదురైంది. మరో వారం రోజుల్లో తొలకరి పనులు ప్రారంభం కానున్నా కౌలురైతుల పాత గుర్తింపు కార్డుల రెన్యువల్‌తో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు మంజూరు చేసే చర్యలు కానరావడం లేదు. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తించి కార్డులు మంజూరు చేయాలి. గత మూడు నెలలుగా ఎన్నికల హడావుడితో రెవెన్యూ శాఖ కౌలు రైతుల ఊసే మరిచింది. గుర్తింపుకార్డులు లేకపోతే రుణసాయం అందదు. దాంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కౌలు రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. అధికారులు స్పందించి తమ కోసం చేసిన చట్టం తమకు ఉపకరించేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు.
 
 రుణాల మంజూరుకు
 అధికారులు చర్యలు తీసుకోవాలి
  కొంత మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చినా రుణాలు మాత్రం ఇవ్వటం లేదు. కౌలు రైతులకు ఖరీఫ్‌కు  రుణాలు ఇచ్చే విధంగా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి.
 - కొండేపూడి శ్రీనివాసరావు, కౌలు రైతు,
 భట్లపాలిక, కె.గంగవరం మండలం
 
 గుర్తింపు కార్డులు ఇవ్వలేదు
 కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. గతంలో కొంత మందికి మాత్రమే ఇచ్చారు. గుర్తింపు కార్డులు ఇచ్చినా రుణాలు మాత్రం ఇవ్వలేదు. కౌలు రైతులందరికీ కార్డులిచ్చేలా చూడాలి.
 - తోకల శ్రీను, కౌలురైతు,
 తామరపల్లి, కె.గంగవరం మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement