ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ధాన్యంలో నిలిచిన నీటిని తీసేస్తున్న రైతు
ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం తీవ్ర పంట నష్టం కలిగించింది. కోతకొచ్చిన వరిపైరు దెబ్బతిన్నది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, కొనుగోలు కేంద్రాల్లో మక్కలు తడిసి పోయాయి. ఇందల్వాయి, వర్ని, సదాశివనగర్, నిజాంసాగర్, కామారెడ్డి, దోమకొండ, బాన్సువాడ, పిట్లం తదితర మండలాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజాము వరకు మోస్తారు వర్షం కురిసింది.
సాక్షి, కామారెడ్డి: వరుణుడు రైతులపై పగ బట్టినట్లున్నాడు.. ఖరీఫ్ సాగు ప్రారంభం నుంచి ముఖం చాటేశాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఎలాగోలా పంటలను కాపాడుకుంటూ వచ్చారు. తీరా చేతికందిన పంటను అమ్ముకునే సమయంలో వరుణుడు రైతులను నిండా ‘ముంచాడు’. జిల్లాలోని కొన్ని ప్రాంతా ల్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరు వాత ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం రైతుల ఆశల్ని నిలువునా ముంచేసింది. కామారెడ్డి డివిజన్ పరిధిలోని దోమకొండ మండలంలో అత్యధికంగా 73.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి పూట ఒక్కసారిగా వర్షం విరుచుకుపడడంతో కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు లబోదిబోమన్నారు. వర్షం నుంచి అప్పటికప్పుడు ధాన్యాన్ని కాపాడుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.
అలాగే, మక్కలు కూడా పెద్ద ఎత్తున తడిసి ముద్ద య్యాయి. పక్కనే ఉన్న బీబీపేట మండ లంలోని పలు గ్రామాల్లో కూడా వర్షం కురిసి పంటలకు నష్టం వాటిల్లింది. గాం ధారి మండలంలో 50.1 మి.మీ., తాడ్వాయిలో 36.6 మి.మీ., మాచారెడ్డిలో 23.1 మి.మీ., రామారెడ్డిలో 26.8 మి.మీ., సదాశివనగర్‌లో 12.8 మి.మీ. వర్షం కురిసింది. అలాగే బాన్సువాడ, కామారెడ్డి, నస్రుల్లాబాద్ తదితర మండలాల్లోనూ కురిసిన వర్షంతో ధాన్యం రాశులు తడిసి పోయాయి. నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లి, బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామాల్లో ధాన్యం నానిపోయింది. మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట నేలవాలింది. సదాశివనగర్ మండలంలో వర్షం తక్కువ కురిసినప్పటికీ ఈదురుగాలులతో కోతకొచ్చిన వరి నేలవాలింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ప్రకృతి పగ బట్టినట్టు చేసిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవస్థలు..
జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో అకాల వర్షంతో నానిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. కల్లాలు లేకపోవడంతో రోడ్లపై ఆరబెట్టాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువెళ్లిన రైతులు ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో ఏమీ చేయలేక పోయారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఆరబెట్టిన ధాన్యం నానిపోవడమే గాకుండా వర్షపు నీటితో కొట్టుకు పోయింది. బుధవారం ఉదయం నుంచి రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి పడిన ఇబ్బందులు అన్నిఇన్ని కావు. కష్టపడి పండించిన పంట చేతికందిన తరువాత కూడా ప్రకృతి తమకు పరీక్ష పెడుతోందని అన్నదాతలు వాపోతున్నారు.
నేలవాలిన వరి పైర్లు..
ఈదురుగాలులతో చాలా గ్రామాల్లో వరి నేలవాలింది. పంట కోయాల్సిన సమయంలో ఒక్కసారిగా ప్రకృతి బీభత్సం సృష్టించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. తెల్లారేసరికి పంటంతా నేలవాలడంతో ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే పెట్టుబడులు అడ్డగోలుగా పెరగడం, దిగుబడులు తగ్గుతుండడంతో ఏమీ మిగిలే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించి ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment