నీట మునిగిన పత్తిచేను వద్ద కన్నీళ్లు పెడుతున్న మహిళా రైతు పేరు బొలిశెట్టి రుక్కమ్మ.
పై చిత్రంలోని మహిళా రైతు పేరు బొలిశెట్టి రుక్కమ్మ పాత మంచిర్యాల శివారులో 11 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేసింది. ఈ ఏడాది జూలైలో వచ్చిన గోదావరి వరదతో చేను నీట మునగడంతో.. రెండోసారి విత్తనాలు వేసింది. కలుపు తీసి, ఎరువులు వేసి.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. తీరా ఇప్పుడు పంట చేతికొచ్చే దశలో కురిసిన వానలు మళ్లీ దెబ్బతీశాయి. ఎల్లంపల్లి నుంచి భారీగా నీటిని వదలడంతో గోదావరి పోటెత్తి పంట మొత్తం నీట మునిగింది. ఇప్పటివరకు రూ. 4 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టామని.. రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంట మొత్తం నీటిపాలైందని రుక్కమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నిండా మునిగి పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది.
సాక్షి, హైదరాబాద్/ నెట్‌వర్క్: రాష్ట్రంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి, చెరువులు అలుగులు పారి పొలాలు, చేన్లలో నీళ్లు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 6.20 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో 1.20 లక్షల ఎకరాల్లో పంటలు ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. పొలాల నుంచి నీళ్లు తొలగిస్తే.. మిగతా పంటలు గట్టెక్కే అవకాశం ఉందని అంటున్నాయి.
(చదవండి: బీజేపీని గెలిపిస్తే.. వంటగ్యాస్ రూ.1,500 దాటుతుంది)
14 జిల్లాల్లో అత్యధికంగా..
రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో పంటలు నీట మునిగినట్టు అధికారులు గుర్తించారు. ఇం దులో 14 జిల్లాల్లో అత్యధికంగా, నాలుగు జిల్లాల్లో పాక్షికంగా పంటలు దెబ్బతిన్నట్టు అంచనా వేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరి సిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అనేక చోట్ల పంటలు నీట మునిగినట్టు తేల్చారు. ఈ జిల్లాల్లో కుంభవృష్టి కురవడంతో వాగులు, వంకలు ఉప్పొం గాయి. పలుచోట్ల చెరువులు, ఒర్రెలు తెగడంతో నీళ్లన్నీ పొలాల్లో చేరాయి. పత్తి, వరి, పసుపుతో పాటు పునాస పంటలు మొక్కజొన్న, కందులు, నువ్వులు, వేరుశనగ దెబ్బతిన్నాయి.
► ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో పాక్షికంగా పంటలు నీట మునిగాయని అధికారులు అంచనా వేశారు. మిగతా జిల్లాల్లోనూ స్వల్పంగా పంటలు నీట మునిగాయని, కొన్నిచోట్ల దెబ్బతిన్నాయని పేర్కొంటున్నారు. అయితే ఈ వివరాలను వ్యవసాయశాఖ వర్గాలు అధికారికంగా వెల్లడించడం లేదు. పంట నష్టం వివరాలను సేకరిస్తున్నామని.. ప్రభుత్వం అడిగితే పైఅధికారులకు పంపిస్తామని చెప్తున్నారు.
(చదవండి: TSRTC: కారుణ్యం లేదు.. కనికరం లేదు)
1.22 కోట్ల ఎకరాల్లో సాగు
ఈసారి వానలు ముందే మొదలవడంతో జూన్ తొలివారంలోనే రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు మొదలైంది. 1.22 కోట్ల ఎకరాల్లో సాగు జరిగిందని.. అందులో 50.85 లక్షల ఎకరాలలో పత్తి, 49.87 లక్షల ఎకరాలలో వరి, 6.12 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 8.98 లక్షల ఎకరాల్లో కంది, 1.34 లక్షల ఎకరాల్లో పెసర, 3.48 లక్షల ఎకరాల్లో సోయా పంటలు వేసినట్టు అధికారులు చెప్తున్నారు.
పలు జిల్లాల్లో నష్టం తీరు
► పెద్దపల్లి జిల్లాలో 450 ఎకరాల్లో పత్తి, 50 ఎకరాల్లో వరి పంటలు నీట మునిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
► సంగారెడ్డి జిల్లాలో 5,387 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో పెసర, మినుము, సోయాబీన్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి చేన్లలో నీళ్లు నిలవడంతో మొక్కలు రంగు మారుతున్నాయి.
► మెదక్ జిల్లాలో 641 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు
► సిద్దిపేట జిల్లాలో 7,117 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 4,325 ఎకరాలు, పత్తి 1,870, మొక్కజొన్న 593, కంది 329 ఎకరాల్లో దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు.
► రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6,890 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించారు.
► నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 3,729 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. మరో 7,311 ఎకరాల్లో పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో పంట నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని రైతులు చెప్తున్నారు.
నష్ట పరిహారం ఎలా?
రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు బీమా అందే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కేంద్రం అమలు చేసే ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)’ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలగడమే దీనికి కారణం. కేంద్రం ఫసల్ బీమాను 2016–17లో ప్రారంభించింది. భారీ వర్షాలు, తుఫాన్లు వంటివాటితో జరిగే పంట నష్టాలకు పరిహారం అందుతుంది. ప్రీమియం సొమ్ములో రైతులు 2–5 శాతం వరకు చెల్లిస్తే.. మిగతా మొత్తంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం భరించాలి. తెలంగాణ ప్రభుత్వం 2020 వర్షాకాలం నుంచి ఫసల్ బీమాను రాష్ట్రంలో నిలిపివేసింది.
రైతు యూనిట్‌గా ఇవ్వాలని..: ఫసల్ బీమా పథకం కొన్ని పంటలకు గ్రామం యూనిట్‌గా, మరికొన్నింటికి మండలం యూనిట్‌గా అమలవుతుంది. కొందరికే నష్టం జరిగితే బీమా పరిహారం వచ్చే అవకాశం ఉండదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతు యూనిట్‌గా ఫసల్ బీమాను అమలు చేయాలని డిమాండ్ చేసింది. కానీ కేంద్రం మార్చలేదు. అంతేగాకుండా బీమా ప్రీమియం కింద ఎక్కు వగా సొమ్ము చెల్లించాల్సి రావడంతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని ఆపేయాలన్న నిర్ణయా నికి వచ్చిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే.. ఫసల్ బీమాను వద్దనుకున్న బిహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు సొంత పథకాలను ప్రారంభించాయి. ఏపీ కూడా కేవలం రూపాయి ప్రీమియంతో ఉచితంగా కేంద్ర పథకాన్ని అమలు చేస్తోంది. కానీ రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా పథకం చేపట్టక ఇప్పుడు పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం అందే పరిస్థితి లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి.
మూడుసార్లు మునిగి..
నాకు మూడెకరాల పొలం ఉంది. జూలైలోనే వరినాట్లు వేసినా అప్పట్లో కురిసిన కుంభవృష్టితో నారు మొత్తం కొట్టుకుపోయింది. వెంటనే మరోసారి నాట్లు వేశాను. మరో వారం తర్వాత కురిసిన వానలకు రెండోసారీ వృధా అయింది. నాకు వ్యవసాయమే బతుకుదెరువు. అందుకే మూడోసారి వరి నారు కొని నాట్లు వేసిన. పంట ఏపుగా పెరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ కురిసిన భారీ వర్షాలతో వరి మొత్తం కొట్టుకుపోయింది. ఏం చేయాలో అర్థంకావడం లేదు. ప్రభుత్వమే ఏదో ఒక విధంగా ఆదుకోవాలి.
-నిమ్మ రాజారెడ్డి, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా
పంట జాడే లేకుండా పోయింది
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సిత్యా తండాలో ఇసుక మేటలు వేసిన వరి పొలం ఇది. వాంకుడోతు సోమ అనే రైతు రెండున్నర ఎకరాల్లో వరి వేశాడు. ఇటీవలి వర్షాలకు బుంగ వాగు ఉప్పొంగి ఈ పంట నీట మునిగింది. ఒకటిన్నర ఎకరాల్లో ఇసుక, మట్టి మేట వేసి.. అసలు పంట వేసిన ఆనవాళ్లే లేకుండా పోయాయి. నెల రోజులైతే పంట చేతికి వచ్చేదని.. తమ శ్రమ అంతా మట్టిలో కలిసిపోయిందని సోమ ఆవేదనలో మునిగిపోయాడు. పొలంలో ఇసుక, మట్టి మేటలను తొలగించాలంటే లక్ష రూపాయలదాకా ఖర్చువుతుందని, ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన కోరుతున్నాడు.
కూతురి పెళ్లి అప్పు తీర్చాలనుకుంటే..
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మూడు వీరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం టాక్యా తండాకు చెందిన ఆయన.. నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఈసారి పంట బాగుంటే.. తన కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చవచ్చని ఆశపడ్డాడు. కానీ భారీ వర్షాలతో పత్తి చేను నీట మునిగింది. ఇప్పుడు అప్పులెలా తీర్చాలె, బతుకెట్లా గడవాలి అంటూ ఆందోళనలో పడ్డాడు.
పంట పోయింది.. ఏం చేయాలె?
మెదక్ జిల్లా రేగేడు మండల కేంద్రానికి చెందిన కుమ్మరి సాయిలు పత్తి చేను ఇది. సాయిలు తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. భారీ వర్షాలకు పంటంతా నీట మునిగింది. పత్తి కాయలు రాలిపోవటంతోపాటు రంగు మారింది. కనీసం పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేకుండా పోయిందని సాయిలు ఆందోళన చెందుతున్నాడు. ఇప్పుడేం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోదేపల్లికి చెందిన రైతు నోముల శ్రీధర్‌కు చెందిన మొక్కజొన్న చేను ఇది. ఆయన వేసిన రెండెకరాల మొక్కజొన్న ఇటీవలి భారీ వర్షాలకు నేలకొరిగింది. వానలు ఇంకా కొనసాగుతుండటంతో ఇక పంట ఏ మాత్రం చేతికందే పరిస్థితి లేదంటూ శ్రీధర్ ఆవేదనలో మునిగిపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment