సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రక్రియలో దేనికైనా ఓ పద్ధతి అనుసరించడం తప్పనిసరి. నిబంధనల ప్రకారం నడుచుకుంటే వ్యవస్థలూ సజావుగా పనిచేస్తాయి. రైతన్నలకు ఓ రైతు భరోసా అయినా ఇన్‌పుట్ సబ్సిడీ అయినా టంఛన్‌గా క్యాలండర్ ప్రకారం అందుతున్నాయంటే ఇదే కారణం! గతేడాది దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాతలు ఇబ్బంది పడ్డారు. 2023 రబీలో కరువు బారిన పడ్డ ప్రాంతాల జాబితాను నిబంధనల ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి ప్రకటించాలి. ఇందుకు ఆరు ప్రామాణికాలను పాటించడం తప్పనిసరి.
ఈ క్రమంలో రబీ సీజన్‌లో రాష్ట్రంలో ఆరు జిల్లాల పరిధిలో 87 మండలాలు కరువు ప్రభావానికి గురైనట్లు నిర్ధారించారు. 63 మండలాల్లో తీవ్రంగా, 24 మండలాల్లో స్వల్పంగా కరువు ఉన్నట్లు లెక్క తేల్చారు. 2.37 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు. 2.52 లక్షల హెక్టార్లలో 33 శాతానికిపైగా వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లినట్లు తేలింది. ఈ మేరకు మార్చి 16వతేదీన గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కరువు మండలాలను గుర్తించిన సమయంలోనే ప్రాథమిక నష్టాన్ని అంచనా వేశారు. నిబంధనల ప్రకారం ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.
చంద్రబాబు బృందం ఫిర్యాదుతో రెండు నెలల పాటు ర్యాండమ్ శాంపిల్ సర్వేను ఎన్నికల సంఘం నిలిపివేసింది. పోలింగ్ ముగిశాక ఈసీ ఆంక్షలు సడలించడంతో ర్యాండమ్ శాంపిల్ సర్వే జరిపి తుది అంచనాల నివేదిక తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. మరి ఇందులో అలసత్వానికి ఎక్కడ తావుంది? రైతుల నోటి కాడ ముద్దను నేల పాలు చేస్తూ చంద్రబాబు బృందం ఫిర్యాదు చేయడం వల్లే కదా ఈసీ అడ్డుకుంది? జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఏంఏ) విధివిధానాల ప్రకారమే కరువు మండలాలను ప్రకటిస్తారు. అంతేగానీ డ్రైస్పెల్స్ ఆధారంగా కాదు. దీని ప్రకారమే 2023 ఖరీఫ్ సీజన్‌లో 80 మండలాల్లో తీవ్రంగా, 23 మండలాల్లో స్వల్పంగా కరువు ఉన్నట్లు గుర్తించారు.
రూ.2,558.07 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఎగ్గొట్టిన బాబు
కరువు మండలాల్లో ఆ సీజన్‌లో తీసుకున్న పంట రుణాలను ఆర్నెళ్ల పాటు రీ షెడ్యూల్ చేస్తారు. పంటలు కోల్పోయిన వారికి ఇన్‌పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) చెల్లిస్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ సీజన్‌లో నష్టపోతే అదే సీజన్ చివరిలో ఇన్‌పుట్ సబ్సిడీ అందించి ఆదుకుంటోంది. గత ఖరీఫ్‌లో కరువు ప్రభావిత మండలాల్లో పంట నష్టపోయిన 6.60 లక్షల మంది రైతులకు రూ.847.22 కోట్లు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే ఎన్నికల కోడ్ సాకుతో చంద్రబాబు బృందం రెండు నెలల పాటు అడ్డుకుంది.
పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కరువు సాయాన్ని జమ చేసి సీఎం జగన్ ప్రభుత్వం రైతుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏనాడూ సీజన్‌లో కరువు మండలాలను ప్రకటించిన పాపాన పోలేదు. సకాలంలో పరిహారం జమ చేసి రైతులకు అండగా నిలిచిన దాఖలాలు లేవు. 24.80 లక్షల మంది రైతన్నలకు రూ.2,558.07 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన చరిత్ర చంద్రబాబుదే.
ఈసీని పలుమార్లు అభ్యర్థించాం..
⇒ ప్రాథమిక అంచనా ప్రకారం ఆరు జిల్లాల్లో 87 మండలాలు కరువు ప్రభావానికి గురైనట్లు గుర్తించాం. ప్రాథమిక నివేదిక తయారీ సమయంలోనే నష్టపోయిన పంటల వివరాలు సేకరించాలని ఆదేశించాం. ఏప్రిల్‌లో పలుమార్లు ఎన్నికల కమిషన్‌ను కలిసి అనుమతి కోసం అభ్యరి్థంచాం. పంట కోతలు పూర్తయినప్పటికీ పొలంలో పంట ఉన్నప్పుడు సేకరించిన వివరాల ఆధారంగా ఎన్యుమరేషన్ పూర్తి చేసి సామాజిక తనిఖీతో జాబితాలు సిద్ధం అవుతాయి. తద్వారా రైతులెవరూ నష్టపోయే ఆస్కారం ఉండదు. – చేవూరు హరికిరణ్,
వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ ఎలాంటి జాప్యం జరగలేదు..
⇒ కేంద్ర వ్యవసాయ శాఖ కరువు మాన్యువల్ 2020 ప్రకారం ఖరీఫ్ కరువు మండలాలను అక్టోబర్ 31వ తేదీలోగా, రబీ కరువు మండలాలను మార్చి 31లోపు ప్రకటించాలి. దీని ప్రకారమే రబీ కరువు మండలాలను మార్చి 16న ప్రకటించారు. ఇందులో ఎలాంటి జాప్యం జరగలేదు. కరువు మాన్యువల్ ప్రకారం డ్రైస్పెల్ ఒక్కటే పరిగణలోకి తీసుకోడానికి వీల్లేదు. దేశవ్యాప్తంగా దశల వారీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర బృందం పర్యటన కొంత ఆలస్యమైంది. – కూర్మనాథ్, ఏపీ విపత్తుల సంస్థ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment