ఇన్‌సర్వీస్ కోటా వయో పరిమితిని 50 ఏళ్లుగా నిర్ణయించడం సరైనదే
హైకోర్టు ధర్మాసనం తీర్పు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా చేరిన వారికి పీజీ వైద్య విద్యను అభ్యసించే నిమిత్తం కేటాయించే ఇన్‌సర్వీస్ కోటా నిబంధనలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలై 20న జారీ చేసిన జీవో–85లోని పలు నిబంధనలను హైకోర్టు సమర్థించింది. ఇన్‌సర్వీస్ కోటా కింద రిజర్వేషన్ సీటు పొందాలంటే నీట్ పీజీ, సూపర్ స్పెషాలిటీ పరీక్ష నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి 50 ఏళ్లు దాటి ఉండకూడదన్న నిబంధన విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది.
అలాగే పీజీ కోర్సు పూర్తి చేసిన తరువాత రాష్ట్రంలో పదేళ్ల పాటు సేవలు అందించాలన్న నిబంధనను కూడా సమర్థించింది. అంతేకాక ఇన్‌సర్వీస్ కోటా ఒప్పందాన్ని ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాను రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచడాన్ని కూడా హైకోర్టు సమర్థించింది. జీవో–85లోని ఈ నిబంధనలను ఎంతమాత్రం ఏకపక్షంగా ప్రకటించలేమని తేల్చి చెప్పింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలు వరించింది. కాల వ్యవధి, జరిమానా పెంపు వంటి సవరణలను సవాల్ చేస్తూ మేదరమెట్ల ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ జి.చిట్టిబాబు పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment