అంచనాలను మించి పత్తి సాగు
► ఖరీఫ్‌లో అన్ని పంటల సాగు 75 లక్షల ఎకరాలైతే... అందులో పత్తే 42 లక్షల ఎకరాలు
► ఊపందుకోని వరి నాట్లు... జలాశయాలు నిండకపోవడమే కారణం
► 144 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు
► వ్యవసాయశాఖ నివేదిక వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి అంచనాలకు మించి సాగవుతోంది. ఇప్పటికే వంద శాతం మైలు రాయిని దాటేసింది. ఇంకా సాగు పెరిగే అవకాశముందని వ్యవసా యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన పంటల సాగు పెద్దగా ఊపందుకోలేదు. ముఖ్యంగా ఆహారధాన్యాల పంటల సాగు గతేడాదితో పోలిస్తే తక్కువగా ఉంది. జలాశయాలు, చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరకపోవడంతో వరి నాట్లు అనుకున్నంత స్థాయిలో పుంజుకోలేదు. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. పత్తి తప్ప మిగతా పంటల సాగు సంతృప్తికర స్థాయిలో లేదని వ్యవసాయశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పుంజుకోని వరి నాట్లు...
ఖరీఫ్‌లో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 48.72 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 25.90 లక్షల ఎకరాల్లో (53%) సాగయ్యాయి. అందులో పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.35 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. గతేడాది ఇదే కాలానికి 12.12 లక్షల ఎకరాల్లో పప్పు ధాన్యాలు సాగయ్యాయి. ఇక వరి నాట్ల పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. చెరువులు, జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరకపోవడంతో నాట్లు పుంజుకోలేదని అంటున్నారు.
మరిన్ని వర్షాలు పడి వరదనీరు వచ్చి చేరితేనే నాట్లు ఊపందుకుంటాయని అంటున్నారు. ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 6.72 లక్షల ఎకరాల్లో (29%) నాట్లు పడ్డాయి. ఇక నూనె గింజల పంటల్లో కీలకమైన సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 5.10 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 3.77 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది ఇదే సమయానికి సోయా ఏకంగా 6.95 లక్షల ఎకరాల్లో సాగైంది.
144 మండలాల్లో లోటు వర్షపాతం
రాష్ట్రంలో 584 మండలాలకు గాను 144 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. 254 మండలా ల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 183 మండలాల్లో అధిక వర్షం కురిసింది. మూడు మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో 16 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లాలో 15 మండలాలు, నిర్మల్ జిల్లాలో 14, మంచిర్యాల జిల్లాలో 13, కొమురంభీమ్ జిల్లాలో 11, మెదక్ జిల్లాలో 10 మండలాల్లో లోటు వర్షపాతం రికార్డయింది.
42.17 లక్షల ఎకరాలకు చేరిన పత్తి..
రాష్ట్రంలో ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. అందులో ఇప్పటివరకు 75.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా 42.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇప్పటివరకు సాగైన అన్ని పంటల్లో ఒక్క పత్తే 55.78 శాతం సాగు కావడం నివ్వెరపరుస్తోంది. గతేడాది సర్కారు మాట విని ఇతర పంటలు అధికంగా వేయడం, పత్తిని నిర్లక్ష్యం చేయడం వల్ల పెద్ద ఎత్తున నష్టపోయామని భావించిన రైతులు ఇప్పుడు పత్తికి జై కొట్టారు. గతేడాది ఇదే సమయానికి పత్తి సాగు విస్తీర్ణం కేవలం 26.80 లక్షల ఎకరాలు మాత్రమే.