రైతు ఇంట లక్ష్మీకళ! | Improved Results In Achievement Of Loan Objectives | Sakshi
Sakshi News home page

రైతు ఇంట లక్ష్మీకళ!

Published Tue, Dec 31 2019 8:41 AM | Last Updated on Tue, Dec 31 2019 8:41 AM

Improved Results In Achievement Of Loan Objectives - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఖరీఫ్, రబీ సీజన్‌ ఏదైనా వ్యవసాయ పంటల సాగుకు ఏటా పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ఎరువులు, విత్తనాల ధరలు, మరోవైపు కూలీలు, ట్రాక్టర్ల అద్దె తడిసిమోపెడవుతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు గ్రామాల్లో కూలీలు దొరకని పరిస్థితి. అదును దాటిపోకూడదనే ఉద్దేశంతో రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నారు. ఆ సమయంలో బ్యాంకుల నుంచి పంట రుణాలు తెచ్చుకోవడానికి అవస్థలు పడేవారు. ఈ సంవత్సరం మాత్రం అన్నదాతలకు ఆ తిప్పలు తప్పాయి. పంటలను బట్టి రుణాలు సాఫీగా మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం స్పందించింది. రుణపరిమితి కూడా గత ఏడాది కన్నా ఈ ఖరీఫ్‌లో అదనంగా పెంచడానికి జిల్లా స్థాయి బ్యాంకుల కమిటీ ఆమోదముద్ర వేసింది. జిల్లాలో అత్యధికంగా పండే వరి సహా ప్రధాన పంటల రుణపరిమితి పెరిగింది. రుణాల లక్ష్య సాధనలోనూ మెరుగైన ఫలితాలు కనిపించాయి.

ఖరీఫ్‌లో 91 శాతం లక్ష్యసాధన.. 
జిల్లాస్థాయి బ్యాంకుల కమిటీ నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2019 ఖరీఫ్‌లో రూ.3,006 కోట్లు, రబీలో రూ.1,762 కోట్లు రుణాల మంజూరుచేయాల్సి ఉంది. ఖరీఫ్‌లో 3,18,153 మంది రైతులకు రూ.2,264 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలి. టర్మ్‌ రుణాలు 73,237 మంది రైతులకు రూ.742 కోట్లు మంజూరు చేయాలి. ఈ లక్ష్య సాధనకు బ్యాంకులు, వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు కృషి చేశారు. ఫలితంగా 3,19,547 మంది రైతులకు పంటరుణాల కింద రూ.2,102 కోట్లు (93 శాతం) మంజూరయ్యాయి. అలాగే 72,469 మందికి రూ.647 కోట్లు మేర (87 శాతం) టర్మ్‌ రుణాలు వచ్చాయి. ఖరీఫ్‌ సీజన్‌లో మొత్తంమీద 3,92,016 మంది  రైతులకు రుణల రుపేణా రూ.2,749 కోట్లు (91 శాతం) మంజూరయ్యాయి.

రబీలో సాఫీగా రుణాల ప్రక్రియ..
ఈ సంవత్సరం ప్రకృతి సహకరించడంతో రైతులు ఉత్సాహంగా రబీ సీజన్‌కూ సిద్ధమయ్యారు. జిల్లాలో 2,23,217 మంది రైతులకు పంటరుణాలు కింద రూ.863 కోట్లు మంజూరు చేయాలి. ఇప్పటివరకూ1,43,759 మందికి రూ.573 కోట్లు (66 శాతం) మంజూరయ్యాయి. టర్మ్‌ రుణాలు కూడా 73,237 రైతులకు గాను ఇప్పటివరకూ 42,157 మందికి రూ.498 కోట్లు మంజూరయ్యాయి. లక్ష్యం రూ.899 కోట్లలో ఇది 55 శాతం. 

‘వైఎస్సార్‌’ పథకంతో రైతుకు భరోసా..
గతంలో కన్నా ఈసారి రైతులు ఎక్కువగా బ్యాంకు రుణాల వైపు చూపడానికి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం ప్రధాన కారణమైంది. అతివృష్టి, అనావృష్టిలతో పంటలు నష్టపోయే రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకునేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. పంటల బీమా ప్రీమియంలో రైతు తన వంతుగా ఒక్క రూపాయి చెల్లిస్తే మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింది. రబీ సీజన్‌ నుంచి రైతులు ఆ ఒక్క రూపాయి కూడా చెల్లించాలి్సన అవసరం లేదు. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. గతంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై)లో పంటల వారీగా బీమా సంస్థలు నిర్ణయించిన ప్రీమియం విలువలో రైతులు 2 నుంచి 5 శాతం వరకూ సొమ్ము చెల్లించేవారు. మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం భరించేవి. ఈసారి రైతులు చెల్లించాలి్సన ప్రీమియం బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది. ఈ పథకంపై వ్యవసాయ శాఖ, బ్యాంకింగ్‌ అధికారులు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. దీంతో ఖరీఫ్, రబీ సీజన్‌ల్లో మొత్తం రూ.4,768 కోట్ల లక్ష్యానికి గాను రూ.3,820 కోట్ల మేర (80 శాతం) రుణాలు మంజూరయ్యాయి.

కౌలు రైతులకు సర్కారు అండ 
భూయజమానుల హక్కులకు భంగం కలగకుండా వారి భూమిని సాగుచేసుకుంటున్న కౌలురైతులకు 11 నెలల పాటు పంట మీద మాత్రమే హక్కు ఉండేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కౌలుదార్ల చట్టం తీసుకొచి్చంది. దీంతో కౌలుదారులకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకంతో పాటు పంటల బీమా, నష్టపోయిన పంటలకు పరిహారం పొందే అవకాశం ఏర్పడింది. ఈ ప్రకారం జిల్లాలో 12,561 మంది కౌలుదార్లకు రుణఅర్హత పత్రాలను రెవెన్యూ అధికారులు జారీ చేశారు. మరో 2,906 మందికి భూయజమానుల ద్వారా సాగుహక్కు పత్రాలను వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పించారు. ఇలా మొత్తంమీద 15,467 మంది కౌలుదార్లకు మేలు జరిగింది. ఆయా పత్రాల ఆధారంగా జిల్లాలో 11,376 మంది కౌలుదార్లకు రూ.23.26 కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement