
రుణ పంపిణీ వేగం పెంచండి
బ్యాంకర్లకు కేంద్రమంత్రి దత్తాత్రేయ సూచన
సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణాల పంపిణీని వేగవంతం చేయాలని బ్యాంకర్లకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్రం రైతులకు తక్కువ వడ్డీతో రుణాల మంజూరుకు రూ.20,339 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. స్వల్ప కాలిక పంట రుణాలపై వడ్డీలో రాయితీని ఇవ్వడానికీ కేంద్రం సిద్ధమైందన్నారు.
ఖరీఫ్‌లో రైతుల కార్యకలాపాలు పూర్తి స్థాయిలో మొదలైనందున రుణాల మంజూరులో వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా చూడాలన్నారు. ఇప్పటికే రూ.2,573 కోట్ల రుణ పంపిణీ పూర్తి అయినట్లు వివరించారు. ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’లో భాగంగా మ్యాచింగ్ ఫండ్స్ ను విడుదల చేయాలని దత్తాత్రేయ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.